తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఈ మూడు రోజులూ పల్లెలు సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. కొలువుల కోసం పల్లెలు విడిచి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెలోగిళ్లలో చేరిపోతారు. రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి అంటూ సంక్రాంతిని స్వాగతించాల్సిన పల్లెల్లో ప్రస్తుతం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఏరోజుకారోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. చాలీ చాలని వేతనాలు.. కరువు.. కాటకాలు.. ఇలా రకరకాల కారణాలతో నేడు పల్లెసీమలు సంక్రాంతి శోభను సంతరించుకోలేకపోతున్నాయి. అయినా ఉన్నంతలో తృప్తిగా.. సంతోషంగా జరుపుకునేందుకు కొందరు సిద్ధమవుతుంటే.. మరికొందరు ఏం పండగో ఏమో అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకల తీరుతెన్నులపై న్యూస్‌లైన్ ప్రత్యేక కథనం.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : సంక్రాంతిని తెలుగునాట పెద్ద పండుగగా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. పండుగ అంటే ఎవరికైనా సంతోషమే. అందులోనూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఆశించినమేరకు పండుగ సందడి కనిపించడం లేదు.
అకాల వర్షాలతో అందివచ్చిన పంటలు దెబ్బతిని రైతు దిగాలుగా ఉన్నాడు. ధరలు చుక్కలను చూపుతున్నాయి. వ్యాపారుల పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా దెబ్బతినడంతో ఆ వర్గాల్లో సైతం నిరాశ నెలకొని ఉంది. పెరిగిన ధరల స్థాయిలో జీతాలు పెరగక ఉద్యోగుల పరిస్థితి కటకటగానే ఉంది.
అయినా తప్పదు :
ధరల బరువుతో ఎగువ మధ్యతరగతి స్థాయి ప్రజల్లో కూడా పండుగ ఉత్సాహం కనిపించడం లేదు. అయినా పిల్లల ఉత్సాహంపై నీళ్లు చల్లలేక, నలుగురిలో చిన్నతనంగా ఉంటుందని భావించి అప్పోసప్పో చేసైనా ప్రజలు పండుగకు సిద్ధమయ్యారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో ఉంటున్న జిల్లా వాసులు ఆదివారానికే స్వగ్రామాలకు చేరారు. ప్రైవేటు బస్సుల సంఖ్య బాగా తగ్గడంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి.
ఇన్‌స్టంట్ పేడరంగు
సంక్రాంతి అంటేనే ఇంటి ముంగిళ్లను శుభ్రపరిచి కల్లాపి (పేడ) చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను లక్ష్మిదేవికి ప్రతిరూపమని చెబుతారు. అందుకే శుభప్రదంగా పండుగల సమయంలో సిరిని ఆహ్వానించేందుకు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఆవు పేడ దొరకడమే కష్టంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇన్‌స్టంట్ పేడ రంగు అందుబాటులోకి వచ్చింది. ప్యాకెట్ ఖరీదు రూ.5. దీనిని నీటిలో కలిపి నేలపై చల్లితే అచ్చం కల్లాపి చల్లినట్లుగా ఉంటుందని విక్రయదారులు చెబుతున్నారు. ఈ రంగును కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
- న్యూస్‌లైన్, సింహాద్రిపురం
పల్లెకు పోదాం. చలో చలో
సంక్రాంతి సెలవులొచ్చాయి. ఊరికెళ్లాలి. అంతే.. అది బస్సయితేనేం.. ఆటో అయితేనేం.. అంటూ పట్నం నుంచి పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ పాటికే ఊర్లకు చేరుకున్నారు. మిగిలిన వారు కూడా భోగి పండుగ నాటికంతా ఇంట్లో ఉండాలని ఏ వాహనం దొరికితే దాన్ని పట్టుకుని ఇలా చాపాడు మండల కేంద్రం నుంచి గ్రామాలకు పయనమయ్యారు.
- చాపాడు, న్యూస్‌లైన్
పిండి వంటలకు ప్రిపరేషన్
సంక్రాంతి అంటూనే నోరూరించే పిండి వంటలే గుర్తుకొస్తాయి. ఒకప్పుడైతే బియ్యాన్ని రోటిలో పోసి దంచి పిండి వంటలకు వాడేవారు. క్రమక్రమంగా రోళ్లు మాయం కావడంతో ఇప్పుడంతా పిండి మిషన్లపై ఆధారపడుతున్నారు. రాయచోటిలో ఆదివారం ఇలా ఓ పిండి మిషన్ వద్ద మహిళలు తమ టిఫిన్ బాక్సులను ఇలా వరుసగా పెట్టారు. పిండి మిషన్ యజమానులకు ఇప్పుడు పండగే పండగ.
- న్యూస్‌లైన్, రాయచోటిటౌన్
సకల భోగాల భోగి..
సకల భోగాలతో ప్రజలు సంతోషంగా ఉండే కాలాన్ని భోగిగా పిలుచుకుంటారు. భోగి పండుగ రోజు భోగి మంటలు కాలుస్తారు. అందులో పాత పనికిరాని వస్తువులు వేసి చెడు తొలగి మంచి చేకూరాలని వేడుకుంటారు. ఇదేరోజు పిల్లలకు భోగి పండ్లు కోస్తారు. ఇలా చేయడం ద్వారా ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం.
పతంగుల సందడి..
సంక్రాంతి వేడుకల్లో పతంగుల సందడి మరువలేనిది. చిన్నా, పెద్దా తారతమ్య భేదం లేకుండా గాలి పటాలను ఎగురవేస్తారు. సంక్రాంతి వేడుకల్లో బాహ్యంగా కనిపించే సంబరాలకు ప్రతీకగా గాలిపటాలు నిలుస్తాయి. పండగకు వారం రోజు ల ముందు నుంచే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ప్రధానంగా చిన్న పిల్లలు గాలిపటాల ఎగురవేతతో ఈ పండుగ రాకను తెలియజేస్తుంది.
లక్ష్మీదేవికి ఆహ్వానం..
సంక్రాంతి పండుగకు, రైతుకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఏ పండుగకు ఇంట్లో చేరకపోయినా సంక్రాంతికి మాత్రం పంటలు చేతికంది ధాన్యరాసులు కళకళలాడుతుంటాయి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట ఇంటికి చేరిన తర్వాత చూసి రైతు కళ్లల్లో ఆనందం పొంగిప్రవహిస్తుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా రైతు కుటుంబం సంక్రాంతి రోజు ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఇంటి ముందు పెట్టి భూమాత రుణం తీర్చుకుంటుంది. ఆ రూపేణా ధాన్యలక్ష్మీ, పుష్పలక్ష్మీలను ఇంటిలోకి ఆహ్వానిస్తారు.
రైతుల పండుగ కనుమ..
సంక్రాంతి మరునాడు రోజును కనుమ అంటారు. కనుమ రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రైతులందరికీ చేతినిండా పనిఉంటుంది. అందుకే కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేస్తారు. కల్లాపి చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. అందులో గొబ్బెమ్మలను పెడుతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులు, వ్యవసాయంలో తమకెంతగానో ఉపయోగపడే ఎడ్లను శుభ్రంగా కడుగుతారు. పశులకు దిష్టి తీసి గుమ్మడికాయ పగులగొట్టి గజ్జెలు, పట్టెడలు, పూలదండలు వేసి చక్కగా అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. పొంగళి, పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో చల్లుతారు.
గంగిరెద్దుల విన్యాసాలు..
సంక్రాంతి వేడుక ఆరంభమైందంటే చాలు గంగిరెద్దు ఆటలు మొదలవుతా యి. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు... ఇంటిళ్లిపాదిని సల్లంగ చూడు అంటూ డూడూ బసవన్నలను ఆడిస్తా రు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రా లను ఎద్దులకు అలంకరించి గంగిరెద్దులను తయారు చేస్తారు. నేలపై పడుకొని గంగిరెద్దును ఆమాంతం పైకి ఎక్కించుకోవడం, గంగిరెద్దు నోట్లో తలపెట్టడం వంటి విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. రై తులు ఆనందంగా తోచిన రీతిలో గంగి రెద్దుల వారికి సమర్పించుకుంటారు. ఎద్దుల శ్రమను రైతుకు గుర్తు చేయడానికి పండుగ రోజు గంగిరెద్దులను ఇళ్లముందుకు తీసుకొస్తారు.
డూడూ బసవన్నా.. ఎన్నాళ్లకొచ్చావయ్యా!
గ్రామాలలో సంక్రాంతి సందడి మొదలైందంటే చాలు రకరకాల వేషధారణలో భిక్షగాళ్లు వస్తుంటారు. ఇలాంటి వారిలో డూడూ బసవన్నలు ఒకరు. వీరు ఏడాదిలో రెండు మూడు సార్లుగా గ్రామాలలో పర్యటించి గంగిరెద్దులను ఆటాడించి వినోదాన్ని పంచి గ్రామీణులు ఇచ్చే చిరుకానులన తీసుకెళుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ మొదలు కాగానే డూడూబసవన్నలు వచ్చేశారు. రాత్రివేళల్లో రాముడు - సీత పేర్లతో శ్రీరామచంద్రుడి కథను నాటక రూపంలో ప్రదర్శించి పురాణాలు గుర్తుకుతెస్తున్నారు. వీరిని చూసిన గ్రామీణులు అరే డూడూ బసవన్నా ఎన్నాళ్లకు వచ్చావు.. అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు.
- న్యూస్‌లైన్, సంబేపల్లె
‘పుంజు’కోనున్న పందేలు
సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో మొదలైంది. పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సత్తా ఉన్న కోడిపుంజులను వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్ద కోళ్లు సమరానికి సై అంటూ రె‘ఢీ’గా ఉన్నాయి.
- న్యూస్‌లైన్, చిన్నమండెం
కొత్త కళ వచ్చేసింది
గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించు కొంది. మహిళలు కొత్త ఉత్సాహంతో లోగిళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఇళ్లముందు అందమైన ముగ్గులు వేస్తున్నారు. గాజులు విక్రయించే మహిళలు పల్లెల్లో దర్శనమిస్తున్నారు. చేతులకు మట్టి గాజులు తొడిగించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. వచ్చేసింది సంక్రాంతి అంటూ ఆనందంగా గడుపుతున్నారు. - న్యూస్‌లైన్, దువ్వూరు
పెద్ద పండుగ చిన్నబోయింది..
అతివృష్టి, అనావృష్టితో పైరు ఎత్తిపోయింది.. ధాన్యం లేక గాదె బావురుమంటోంది.. రైతన్నకు తిండిగింజల దిగులు పట్టుకుంది.. కిటకిటలాడాల్సిన దుకాణాలు వెలవెలబోయాయి.. వ్యాపారం లేక వర్తకులు దివాలా తీశారు.. ఉద్యోగులకు ‘సమైక్య’ ఉద్యమం నిరాశను మిగిల్చింది.. వేతనాలందక అడ్వాన్సులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కర్మాగారాలు నడవ లేదు.. కార్యాలయాలు పనిచేయ లేదు.. పనుల్లేక కార్మికుల పరిస్థితి అప్పుచేసి పప్పుకూడు తిన్నట్టైంది... సగటు మనిషిలో సంతోషం ఆవిరైంది. కొత్త బట్టలు.. పిండి వంటల మాటే లేదు.. గంగిరెద్దులు.. డూడూ బసవన్నల సందడీ లేదు... కొత్త అల్లుళ్ల జాడ లేదు.. పండుగ పూట ‘పెద్ద’ సందడి లేదు.. బక్కచిక్కిన బడుగుజీవి సంక్రాంతి లక్ష్మిని పిలువ లేక పిలుపు లేక పెద్ద పండుగ చిన్నబోయింది..
-న్యూస్‌లైన్, కమలాపురం
పండుగ చేసు‘కొన’లేం
పులివెందులలో ఆదివారం సంక్రాంతి పండుగ సందడి కనిపించలేదు. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి. పూలు అమ్ముడుపోక నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మూర రూ.30లు అమ్మాల్సిన పూలు రూ.10లకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. వస్త్ర, రంగు పొడుల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు వెలవెలబోతున్నాయి.
-న్యూస్‌లైన్, పులివెందుల టౌన్
రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి
Published Mon, Jan 13 2014 2:34 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement