ఇంటి ముంగిట అందమైన ముగ్గులేసి.. ఇంటివాకిటికి పచ్చని తోరణాలు కట్టి.. వంటింట్లో ఘుమఘుమలాడే పిండివంటలు చేసి.. సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లు ఆహ్వానం పలికాయి..
వీధుల్లో గంగిరెద్దు విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. పండుగకు కొత్త శోభను తీసుకొచ్చాయి. గాలిపటాలతో పిల్లల కేరింతలు.. యువకుల ఆటపాటలు..బావామరదళ్ల ఆటపట్టింపులు.. పెద్దల ముచ్చట్లు.. వెరసి పల్లె సీమల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. బంధువులతో పల్లె లోగిళ్లు కళకళలాడుతున్నాయి. సోమవారం భోగిని జిల్లా ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. తెలతెలవారుతుండగానే భోగి మంటలు వేసి..ఇంటి ముంగిట కల్లాపి చల్లి సంక్రాంతి లక్ష్మిని మనసారా ఆహ్వానం పలికారు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్: తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతిని జిల్లావాసులు సోమవారం ఘనంగా ఆహ్వానం పలికారు. తెల్లవారుజామున 4 నుంచే వీధుల్లో, రోడ్డు కూడళ్లలో స్థానిక యువకులు, ప్రజలు కలిసి భోగిమంటలు వేశారు. కొన్నిచోట్ల ఆది వారం అర్ధరాత్రి నుంచే భోగిమంటలు వెలుగులు చిమ్మాయి. ఉదయాన్నే పిల్లలకు పెద్దలు రేగుపళ్లతో భోగిస్నానాలు చేయించారు. ఇళ్లల్లో గౌరీపూజలు నిర్వహించారు.
ఇళ్ల ముందు కల్లాపి రంగునీళ్లు చల్లి కళ్లు చెదిరేలా రంగురంగుల ముగ్గుల ను తీర్చారు. కొన్ని కాలనీలలో ఆ ప్రాంతీ యులు పిల్లలతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. బాలలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో సరదాగా కోడిపందేలు నిర్వహిచారు. బయ టి ప్రాంతాల్లో ఉన్న బంధువులు సోమవా రం ఉదయం ఇళ్లకు చేరుకోవడంతో ఆయా కుటుంబాలు పండుగను సంబరం గా జరుపుకుంటున్నారు.
శిల్పారామంలో..
కడప శిల్పారామంలో సోమవారం సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగురోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు కడప నగరానికి చెందిన నటరాజ నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణరాయభారం పడక సీన్ ప్రదర్శించారు. దుర్యోధనుడిగా పాపయ్య, అర్జునుడిగా రాయుడు, కృష్ణుడుగా మహేంద్ర శాస్త్రి పాత్రోచిత నటనతో సందర్శకులను ఆకట్టుకున్నారు.
అనంతరం గంగిరెద్దుల వారి బృందం సీతారామ కల్యాణం ఘట్టాన్ని ప్రదర్శించారు. గంగిరెద్దులతో నిర్వహించిన ఈ కల్యాణఘట్టం ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది. శిల్పారామం పాలనాధికారి మునిరాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంగళవారం ముగ్గుల పోటీ నిర్వహించనున్నారు.
తెలుగు లోగిళ్ల ఆహ్వానం..
Published Tue, Jan 14 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement