అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు.
జొకోవిచ్ కెరీర్‌లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్‌లో 5–6తో వెనుకబడి తన సర్వీస్‌లోని 12వ గేమ్‌లో 30–40తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు.
ఓవర్‌హెడ్ షాట్‌తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్‌లో కోర్డా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 94,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment