open ATP tournment
-
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్‌లోని 12వ గేమ్‌లో 30–40తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. ఓవర్‌హెడ్ షాట్‌తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్‌లో కోర్డా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 94,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
నాదల్ కెరియర్లో 85 విజయం
అకాపుల్కో: ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన మెక్సికో ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నాదల్ 6–3, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. టైటిల్ గెలిచే క్రమంలో నాదల్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. మెక్సికో ఓపెన్‌ను నాదల్ నెగ్గడం ఇది మూడోసారి. గతంలో నాదల్ 2013, 2015లలో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 85వ సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్‌తో నాదల్ వరుసగా 17వ ఏడాది కనీసం ఒక టైటిల్‌ను సాధించినట్లయింది. విజేతగా నిలిచిన నాదల్కు 3,72,785 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 69 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మరో విజయంతో మెయిన్ ‘డ్రా’లోకి...
చెన్నై: భారత ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’ అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అతను 6-3, 7-5తో రష్యాకు చెందిన ఎల్గిన్‌ను కంగుతినిపించాడు. సోమవారం జరిగే చివరి క్వాలిఫయింగ్‌లో రామ్‌కుమార్... గొంబోజ్ (స్లోవేకియా)పై గెలిస్తే మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తాడు. కాగా భారత్‌కు చెందిన మరో యువ ఆటగాడు సనమ్ సింగ్ రెండో రౌండ్లో నిష్ర్కమించాడు. డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడెరిక్ నీల్సన్ 7-5, 7-5తో సనమ్ సింగ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో హెన్రీ లాక్సోనెన్ (స్విట్జర్లాండ్) 7-5, 6-4తో గొ సొయెడా (జపాన్)పై గెలుపొందగా, నార్బెర్ట్ గొంబోజ్ (స్లోవేకియా) 2-6, 6-1, 6-4తో డూసాన్ లాజోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. రాజీవ్ రామ్ (అమెరికా) 1-6, 6-3, 5-7తో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) చేతిలో కంగుతినగా, అల్బొట్ (మాల్డొవా) 7-6 (7/2), 6-3తో జె జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. కుడ్రియత్సెవ్ (రష్యా) 7-6 (7/9), 6-3తో కచనోవ్ (రష్యా)పై నెగ్గాడు. నేటి నుంచి మెయిన్ డ్రా: చెన్నై ఓపెన్ మెయిన్ డ్రా ఈవెంట్ సోమవారం మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు సాకేత్ మైనేని- కారెన్ కచనోవ్ (రష్యా) డబుల్స్ మ్యాచ్‌తో మెయిన్ డ్రా పోటీలు ఆరంభమవుతాయి. సాయంత్రం సెంటర్ కోర్టులో జరిగే మ్యాచ్‌లో భారత్-రష్యా జోడి... కెరెనో బూస్టా-అల్బెర్ట్ రెమోజ్ (స్పెయిన్) ద్వయంతో తలపడుతుంది. సింగిల్స్‌లో యెన్ సూన్ లూ (చైనీస్ తైపీ)తో టిమ్ స్మిజెక్ (అమెరికా); జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో జీవన్ నెదుచెజియాన్ (భారత్), లుకాస్ లాకో (స్లోవేకియా)తో డూడి సెలా (ఇజ్రాయెల్) తలపడతారు.