రామ్‌కుమార్
చెన్నై: భారత ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’ అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో అతను 6-3, 7-5తో రష్యాకు చెందిన ఎల్గిన్‌ను కంగుతినిపించాడు. సోమవారం జరిగే చివరి క్వాలిఫయింగ్‌లో రామ్‌కుమార్... గొంబోజ్ (స్లోవేకియా)పై గెలిస్తే మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తాడు. కాగా భారత్‌కు చెందిన మరో యువ ఆటగాడు సనమ్ సింగ్ రెండో రౌండ్లో నిష్ర్కమించాడు.
డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడెరిక్ నీల్సన్ 7-5, 7-5తో సనమ్ సింగ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో హెన్రీ లాక్సోనెన్ (స్విట్జర్లాండ్) 7-5, 6-4తో గొ సొయెడా (జపాన్)పై గెలుపొందగా, నార్బెర్ట్ గొంబోజ్ (స్లోవేకియా) 2-6, 6-1, 6-4తో డూసాన్ లాజోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. రాజీవ్ రామ్ (అమెరికా) 1-6, 6-3, 5-7తో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) చేతిలో కంగుతినగా, అల్బొట్ (మాల్డొవా) 7-6 (7/2), 6-3తో జె జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. కుడ్రియత్సెవ్ (రష్యా) 7-6 (7/9), 6-3తో కచనోవ్ (రష్యా)పై నెగ్గాడు.
నేటి నుంచి మెయిన్ డ్రా: చెన్నై ఓపెన్ మెయిన్ డ్రా ఈవెంట్ సోమవారం మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు సాకేత్ మైనేని- కారెన్ కచనోవ్ (రష్యా) డబుల్స్ మ్యాచ్‌తో మెయిన్ డ్రా పోటీలు ఆరంభమవుతాయి. సాయంత్రం సెంటర్ కోర్టులో జరిగే మ్యాచ్‌లో భారత్-రష్యా జోడి... కెరెనో బూస్టా-అల్బెర్ట్ రెమోజ్ (స్పెయిన్) ద్వయంతో తలపడుతుంది. సింగిల్స్‌లో యెన్ సూన్ లూ (చైనీస్ తైపీ)తో టిమ్ స్మిజెక్ (అమెరికా); జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో జీవన్ నెదుచెజియాన్ (భారత్), లుకాస్ లాకో (స్లోవేకియా)తో డూడి సెలా (ఇజ్రాయెల్) తలపడతారు.