రామ్‌కుమారే నిందితుడు
చెన్నై: గత నెల 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకేసును చేధించే క్రమంలో సీసీ టీవీ ఫుటేజీలో ఒక యువకుడు ప్లాట్‌ఫారంపై ఆందోళనగా పరుగులు పెట్టడం, పక్కవీధిలో నింపాదిగా నడిచివెళ్లడం వంటి దృశ్యాలు పోలీసులకు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా తిరునెల్వేలికి చెందిన రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసులు చుట్టుముట్టగానే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రామ్‌కుమార్ అక్కడి పోలీసుల వద్ద తన నేరాన్ని అంగీకరించాడు. అయితే చికిత్స కోసం చెన్నై రాయపేట ఆసుపత్రిలో చేరగానే మాటమార్చాడు. అసలు నేరస్తుడిని కాపాడేందుకు పోలీసులు తనను అనవసరంగా హత్యకేసులో ఇరికించారని, పోలీసులతో వచ్చినవారే తన గొంతు కోశారని వాదించాడు. అలాగే రామ్‌కుమార్ తండ్రి సైతం తన కుమారుడు నిర్దోషి అని చెప్పుకున్నాడు.
ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ కులం రంగు పులుముకుంది. దీంతో ఇంతకూ స్వాతి హత్యకేసులో నిందితుడు ఎవరు అనే అయోమయం నెలకొంది.ఈ దశలో నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షులను మంగళవారం పుళల్‌జైలుకు తీసుకెళ్లారు. ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి శంకర్ సమక్షంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గుర్తింపు కార్యక్రమం సాగింది. పుళల్ జైల్లోని ఇతర హంతకులతోపాటూ రామ్‌కుమార్‌ను నిలబెట్టారు. హత్యను ప్రత్యక్షంగా చూసిన పెట్టెల అంగడి యజమాని శివకుమార్, స్వాతి తండ్రి గోపాలకృష్ణన్ తదితరులు రామ్‌కుమార్‌ను గుర్తించారు.