Swathi murder case
-
రామ్‌కుమార్ పోస్ట్‌మార్టంపై నేడు నిర్ణయం
సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ మృతి కేసు న్యాయమూర్తులను సైతం సంకటంలో పడేస్తున్నది. ఈ కేసు విచారణలో ఇద్దరు న్యాయమూర్తులు మారారు. ముచ్చటగా మూడో న్యాయమూర్తిగా కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించి నిర్ణయం తీసుకోనున్నది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ అతడి కుటుంబీకులు ఆరోపించే పనిలో పడ్డారు. దీంతో తిరువళ్లూరు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నేతృత్వంలో విచారణ సాగుతున్నది. అదే సమయంలో పోస్టుమార్టం విషయంగా ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదని, తమకు చెందిన ప్రైవే టు వైద్యులను నియమించేందుకు తగ్గ అనుమతి ఇవ్వాలని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం, అతడి తరఫు న్యాయవాది రామరాజ్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణ గందరగోళానికి దారి తీశాయని చెప్పవచ్చు. దీంతో పోస్టుమార్టం నిలుపుదల చేశారు. మృతదేహం రాయపేట మార్చురీ వద్ద గట్టి భద్రత నడుమ ఉంచారు. ఈ పిటిషన్లను తొలుత వైద్యనాథన్ న్యాయమూర్తి, తదుపరి మరో న్యాయమూర్తిగా రమేష్ విచారించడం, ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండడంతో కేసు విచారణ న్యాయ వర్గాలకు సంకటంగా మారాయి. మంగళవారం విచారణ సాగాల్సి ఉన్నా, కేసు మరో బెంచ్‌కు మార్చడంతో ఆటంకం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ముందు రామ్‌కుమార్ తండ్రి పరమశివం తరఫున న్యాయవాది శంకర్ సుబ్బు హాజరై మరో బెంచ్‌కు న్యాయమూర్తి నియామకం గురించి వివరించారు. ఇందుకు స్పందించిన బెంచ్ మూడో న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్‌కు కేసును అప్పగించారు. ఈ బెంచ్ గురువారం విచారణ చేపట్టి, పోస్టుమార్టం విషయంలో ప్రైవేటు వైద్యుడి నియామకానికి సంబంధించి నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా గురువారం మధ్యాహ్నం తర్వాత రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగవచ్చు. -
పోలీసు మెడకు రామ్‌కుమార్ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జూన్ 24వ తేదీన నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణహత్య, తిరునెల్వేలీలో నిందితుడు రామ్‌కుమార్ అరెస్ట్, అతను అసలైన నిందితుడు కాదనే వాదనలు ఇలా ఈ కేసులో ప్రతి అడుగు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. క్రైం సినిమాను తలపించే రీతిలో మూడు నెలలుగా సాగుతున్న ఈ కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యతో సరికొత్త మలుపు తిరిగింది. జైలులోని కరెంటు వైరును నోటితో కొరికి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసు వర్గాల కథనం. వేలాది మంది ఖైదీలు, వందలాది మంది జైలు సిబ్బంది గస్తీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక ఖైదీ అంత సులువుగా కరెంటువైరు కొరికి ఉంటాడని, ఒక ఖైదీ ఇంత దారుణానికి పాల్పడుతుంటే సిబ్బంది ఏమి చేస్తున్నట్లు అనే అనుమానాలు తలెత్తాయి. రామ్‌కుమార్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని అతని తండ్రి పరమశివం తదితరులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని పథకం ప్రకారం హతమార్చారని పరమశివం ఆరోపిస్తున్నారు. రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని ఆయన అన్నారు. రామ్‌కుమార్ నిందితుడే కాదని మరో ప్రచారం సాగుతున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో అతను అంతం కావడంతో స్వాతి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రామ్‌కుమార్ మరణంపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసు శాఖ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోస్టుమార్టంపై హైకోర్టు స్టే రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రమే చేర్చినా హై కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రాయపేట ఆసుపత్రి చుట్టూ పెద్ద ఎత్తున ఆదివారం అర్ధరాత్రి వరకు రామ్‌కుమార్ బంధువులు, సానుభూతిపరులు చుట్టుముట్టి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు పెట్టారు. రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ప్రత్యేకంగా వైద్యబృందాన్ని నియమించారు. ఈ బృందం సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా రామ్‌కుమార్ న్యాయవాదులు రామ్రాజ్, విజయేంద్రన్ హైకోర్టును ఆశ్రయించారు. రామ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నందున పోస్టుమార్టంపై నిషేధం విధించాలని, ఈ కేసును అత్యవసర కేసుగా స్వీకరించాలని కోరారు. అయితే అత్యవసర కేసుగా తీసుకోవడం కుదరదని న్యాయమూర్తులు నిరాకరించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు పోస్టుమార్టంను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తులు... రామ్‌కుమార్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు పోస్టుమార్టంపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాల భగ్గు స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోమవారం డిమాండ్ చేశారు. ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత తదితరులు ఈ అంశంపై గళమెత్తారు. రామ్‌కుమార్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు డిమాండ్ చేశారు. పుళల్ జైలు వద్ద సోమవారం విపక్ష పార్టీలు ఆందోళన, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి నిరసన ప్రకటించాయి. అలాగే రామ్‌కుమార్ సొంతూరు సెంగోట్టై సమీపం మీనాక్షిపురంలో అతని బంధుమిత్రులు సోమవారం ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా మూడు ప్రభుత్వ బస్సులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. న్యాయవిచారణ ప్రారంభం రామ్‌కుమార్‌ది సహజమరణం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ కారణంగా ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం 9.20 గంటలకు రాయపేట ఆసుపత్రికి వచ్చారు. రామ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంపై ఉన్న గాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స చేసిన డాక్టర్లను విచారించి అక్కడి నుంచి పుళల్ జైలుకు చేరుకున్నారు. రామ్‌కుమార్ ఉన్న గది, కరెంటువైరు కొరికిన ప్రాంతాన్ని పరిశీలించి జైలు అధికారులను విచారించారు. -
రామ్‌కుమార్ శవపరీక్షకు స్పెషల్ టీమ్
చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్‌కుమార్ మరణంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. డాక్టర్లు, నిపుణులతో నలుగురు సభ్యుల టీమ్‌ను ఏర్పాటుచేసి రామ్‌కుమార్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ పుళల్ జైళ్లో ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇది కచ్చితంగా హత్యేనని, కేసును ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రామ్‌కుమార్ మరణంపై ఆయన సోదరుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విద్యుత్ వైర్‌ను కొరికి పట్టుకోవడంతో రామ్‌కుమార్ షాక్‌కు గురై చనిపోయినట్టు జైళ్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే జైళ్ల శాఖ వర్గాల వాదనలు పలు అనుమానాలు దారితీస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ఈ జైళ్లులో రామ్‌కుమార్ ఈ ప్రయత్నం ఎలా చేశాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైంది. సీసీటీవీ పుటేజీ ఆధారితంగా రామ్‌కుమార్‌ను జూలైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రామ్‌కుమార్ ఆత్మహత్య
ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆదివా రం ఆత్మహత్య చేసుకున్నాడు. రిమాండ్ ఖైదీగా పుళల్ జైల్లో ఉన్న రామ్‌కుమార్ విద్యుత్ వైరును కొరికి మరీ బలవన్మరణానికి పాల్పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని, కేసు ను ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీ కులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్వాతి హత్య కేసు విచారణ ఇక ముగిసినట్టే అన్నది స్పష్టం అవుతోంది. సాక్షి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును చేదించేందుకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టారు. చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురంలో నక్కి ఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు. తాము పట్టుకునే క్రమంలో నిందితుడు రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెర మీదకు తెచ్చిన వాదనను అతడి కుటుంబీకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు. పోలీసులే బలవంతంగా గొంతు కోసి, తమ వాడ్ని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించే పనిలో పడ్డారు. అలాగే, కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో స్వాతి హత్య కేసుకు సంబంధించిన చార్జ్ షీట్‌ను కోర్టులో పోలీసులు దాఖలు చేయాల్సి ఉంది. అదే సమయంలో రామ్‌కుమార్ నిందితుడు అన్నది నిరూపించేందుకు తగ్గ ఆధారాల సేకరణ పోలీసులకు తలకు మించిన భారంగా మారిందన్న సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, అతడు ఆత్మహత్య చేసుకోలేదని, హతమార్చబడ్డాడన్న అనుమానాలతో ఆరోపణలు గుప్పించే వాళ్లు ఉండడం గమనార్హం. రామ్‌కుమార్ ఆత్మహత్య : పుళల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మరణించాడు. అయితే, రామ్‌కుమార్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలు తొలుత బయటకు రాలేదు. మీడియాల్లో రామ్‌కుమార్ ఆత్మహత్య వార్త హల్చల్ సృష్టించడంతో జైళ్ల శాఖ వర్గాలు స్పందించాయి. సాయంత్రం 4.45 గంటల సమయంలో టీ తాగినానంతరం నీళ్లు కోసం వెళ్లిన రామ్‌కుమార్ వంట గది వద్ద ఉన్న స్విచ్ బోర్డుకు వెళ్తున్న విద్యుత్ వైర్‌ను కొరికి తెంచినట్టు వివరించారు. ఆ వైర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైనట్టు ప్రకటించారు. హుటాహుటిన తాము ఆసుపత్రికి తరలించామని వివరించారు. అయితే, జైళ్ల శాఖ వర్గాల వాదనలు అనుమానాలకు దారి తీసి ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుళల్‌లో రామ్‌కుమార్ ఎలా ఈ ప్రయత్నం చేసి ఉంటాడని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. ఇక, రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట మార్చురీకి తరలించిన సమాచారంతో అతడి న్యాయవాది రామ్రాజ్ పరుగులు తీశారు. శనివారం రామ్‌కుమార్‌ను తాను కలిసినట్టు, ఆరోగ్యంగా అతడు ఉన్నట్టు, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాని వ్యక్తిగానే కన్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునేంత మానసిక స్థితిలో అతడు లేదు అని ఆయన వాదిస్తుండడం అనుమానాలకు బలం చేకూరి ఉన్నాయి. అతడు మరణించిన సమాచారం కనీసం తనకు కూడా పోలీసులు చెప్పలేదని పేర్కొన్నారు. రామ్‌కుమార్ బంధువు సెల్వం మాట్లాడుతూ తమ వాడి మృత దేహాన్ని చూడడానికి కూడా తనను పోలీసులు అనుమతించడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. హత్యగా ఆరోపణ: రామ్‌కుమార్ మరణించిన సమాచారం తమకు అధికారికంగా అందలేదని, మీడియాల్లో వచ్చిన వార్తల ద్వారానే తెలిసిందని అతడి తండ్రి పరమ శివం ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాడు ఈ కేసులో నిర్దోషి అని, అతడ్ని అన్యాయంగా ఇరికించడమే కాకుండా, ఆధారాలు లభించక ఇప్పుడు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. రామ్‌కుమార్ మరణ సమాచారంతో మీనాక్షిపురంలో ఉద్రిక్తత నెల కొంది. మీనాక్షిపురం, పన్పోలి, సెంగోటైై్ట్టవడకరై పరిసరాల్లో రామ్‌కుమార్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణను సీబీఐకి అప్పగించినప్పుడే, స్వాతి హత్యకేసుతో పాటు రామ్‌కుమార్ కేసులోనూ దోషులు బయట పడతారని వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. రామ్‌కుమార్ మరణంతో ఇక స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. -
స్వాతి హత్య కేసును సీబీఐ విచారించాలి
హైకోర్టులో రామ్‌కుమార్ తల్లి పిటిషన్ కేకే.నగర్: చెన్నై, నుంగంబాక్కంకు చెందిన ఇన్పోసిస్ ఉద్యోగి స్వాతి గత జూన్ నెల నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తిరునెల్వేలి జిల్లా సెంగోడుకు చెందిన రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచి జైల్లో నిర్భంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిజమైన నిందితుడిని రక్షించి అమాయకుడు అయిన తన కుమారుడిని అరెస్టు చేసినట్లు అందువలన ఈ హత్య కేసు సీబీఐ విచారణకు మార్చాలని మద్రాసు హైకోర్టులో రామ్‌కుమార్ తల్లి పుష్పం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో పిటిషన్‌దారులు పుష్పం తరఫున న్యాయవాది హాజరై ఈ హత్య కేసుపై నుంగంబాక్కం పోలీసులు సరిగ్గా విచారణ జరపలేదని, ఇంకనూ ఈ హత్య కేసులో ముత్తుకుమార్, ఇస్మాయిల్‌లకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిని పోలీసులు విచారణ జరపలేదని వాదించారు. స్వాతి శరీరంపై గల కత్తిపోట్లను చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసేందుకు అవకాశం లేదన్నారు. ఇంకనూ ఈ హత్య కేసులో తమను పోలీసులు విచారించరాదని ముఖ్యమంత్రి విభాగానికి పిటిషన్‌దారులు లేఖ రాశారని అన్నారు. అయినా ఈ కేసులో సంబంధం గల వారిని విచారించకుండా నిజమైన నిందితులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నందున ఈ కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాలని వాదించారు. పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ గాని, నివేదికను కాని దాఖలు చేయడానికి తాము ఇష్టపడలేదన్నారు. అందుకు బదులుగా స్వాతి హత్య కేసులో పోలీసులు జరిగిన సమగ్ర విచారణ వివరాలను కోర్టులో దాఖలు చేస్తామన్నారు. ఆ తరువాత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు తీర్పును వాయిదా వేశారు. -
స్వాతి హత్య కేసు అడ్డం తిరుగుతున్నదా?
సాక్షి, చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ను రక్షించేందుకు తగ్గ వ్యూహ రచనల్లో నిందితుడి తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టుంది. మీనాక్షి పురం గ్రామం అంతా రామ్‌కుమార్ వెంట ఉన్నట్టుగా చాటేపనిలో పడ్డట్టుంది. అరెస్టు జరిగిన రోజున రామ్‌కుమార్ గొంతును బలవంతంగానే కోసినట్టు ఆరోపిస్తూ, తెన్కాశి ఇన్స్పెక్టర్ బాలమురుగన్ బృందాన్ని కోర్టుకు లాగేం దుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గట్టుగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేరింది. అయితే, రామ్‌కుమార్ దోషి అని నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణను విచారణ బృందం వేగవంతం చేసింది. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో గత నెల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారు ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితుడి గుర్తింపులో తీవ్ర కష్టాలు పడ్డ చెన్నై పోలీసులు చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ హంతకుడిగా గుర్తిం చారు. తాము పట్టుకునే క్రమంలో నింది తుడు గొంతు కోసుకున్నట్టుగా పోలీసులు వాదించడమే కాదు, కేసూ పెట్టారు. నింది తుడు రామ్‌కుమార్ అన్నది తేలినా, సాక్ష్యాల సేకరణకు మరింత కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఈ సమయంలో రామ్‌కుమార్ నిందితుడు కాదు అని, అమాయకుడని, ఎవర్నో రక్షించే యత్నంలో రామ్‌కుమార్‌ను బలిపశువు చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ప్రధానంగా రామ్‌కుమార్ కుటుంబీకులు, మీనాక్షి పురం వాసు లు అయితే, రామ్‌కుమార్‌ను వెనకేసుకు వచ్చే రీతిలో వ్యవహరిస్తుండడం, అదే సమయంలో పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగడం చోటుచేసుకున్నాయి. రామ్‌కుమార్ అమాయకుడిగా చాటేందు కు ఈ న్యాయవాదులు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితు ల్లో రామ్‌కుమార్ తండ్రి పరమశివం ద్వా రా ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో...! అని వివరిస్తూ గొంతు కోసుకోలేదు...గొంతు కోశారు...అని చాటే రీతిలో సెంగోట్టై పోలీ సు స్టేషన్లో కేసు పెట్టించే పనిలో పడ్డారు. గొంతు కోశారు: బుధవారం రామ్‌కుమార్ తండ్రి పరమశివం సెంగోట్టై పోలీసు స్టేష న్లో ఓ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును తీసుకునేందుకు స్టేషన్ సిబ్బంది నిరాకరించారు. చివరకు రామ్‌కుమార్‌గా అండగా ఉన్న న్యాయవాదులు రామరాజ్, రవికుమార్, మారికుట్టిలతో కలిసి పోలీసుస్టేషన్‌కు పరమశివం చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ ప్రతాపన్లేని దృష్ట్యా, ఆయన వచ్చే వరకు వేచి ఉండక తప్పలేదు. ఇన్స్పెక్టర్ రాగానే, ఫిర్యాదును అందజేశారు. దానిని పరిశీలించిన ఇన్ స్పెక్టర్ ప్రతాపన్ పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించారు. అయితే, ఆ ఫిర్యాదులో గొంతు కోశారు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించి ఉండడం గమనార్హం. తాను బీఎస్ఎన్ఎల్ లైన్మెన్గా పనిచేస్తున్నానని ఫిర్యాదులో పరమశివం గుర్తు చేశారు. తన కుమారుడు బీఈ చదివినట్టు, కొన్ని సబ్జెక్టులు తప్పినందున చెన్నైలో పనిచేస్తూ, చదువుకుంటూ వచ్చినట్టు వివరించారు.గత నెల 25న చెన్నై నుంచి రామ్‌కుమార్ తన ఇంటికి వచ్చాడని వివరిస్తూ, ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో తన ఇంటి తలుపును కొట్టినట్టు పేర్కొన్నారు. తలుపుతీయగానే, తాము పోలీసుల మని పేర్కొంటూ లోనికి వచ్చే యత్నం చేశారని, అప్పటికే, వెనుక వైపు నుంచి మరో ఇద్దరు పోలీసులు పరుగున వచ్చి రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఉన్నట్టుగా చెప్పడంతో ఆందోళనకు గురైనట్టే వివరించారు. వెనుక వైపు వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన కుమారుడు ఉండడంతో కేకులు పెట్టానని, ఆ శబ్దానికి ఇరుగు పొరుగు వారు పరుగులు తీయడంతో, తెన్కాశి ఇన్స్పెక్టర్ బాల మురుగన్ తన సిబ్బందిని అరుస్తూ, రామ్‌కుమార్‌ను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని వివరించారు. అయితే, రామ్‌కుమార్ గొంతు కోసుకోలేదని, బలవంతంగా తెన్కాశి ఇన్స్పెక్టర్ బాల మురుగన్ కోసి నాటకం రచించారని ఆరోపించారు. బాలమురుగ న్‌తో పాటు, తన ఇంటికి వచ్చిన వారందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని విన్నవించారు. మీడియాతో న్యాయవాదులు, రామ్‌కుమార్ తండ్రి మాట్లాడుతూ పథకం ప్రకారం పోలీసులు విచారణ సాగించారని ఆరోపించారు. పథకం ప్రకారం రామ్‌కుమార్‌ను ఇరికించడంతో పాటు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఉన్నారని వివరించారు. మరో వైపు దోషిగా నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణలో విచారణ బృందం పరుగులు తీస్తున్నది. -
రామ్‌కుమారే నిందితుడు
చెన్నై: గత నెల 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకేసును చేధించే క్రమంలో సీసీ టీవీ ఫుటేజీలో ఒక యువకుడు ప్లాట్‌ఫారంపై ఆందోళనగా పరుగులు పెట్టడం, పక్కవీధిలో నింపాదిగా నడిచివెళ్లడం వంటి దృశ్యాలు పోలీసులకు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా తిరునెల్వేలికి చెందిన రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు చుట్టుముట్టగానే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రామ్‌కుమార్ అక్కడి పోలీసుల వద్ద తన నేరాన్ని అంగీకరించాడు. అయితే చికిత్స కోసం చెన్నై రాయపేట ఆసుపత్రిలో చేరగానే మాటమార్చాడు. అసలు నేరస్తుడిని కాపాడేందుకు పోలీసులు తనను అనవసరంగా హత్యకేసులో ఇరికించారని, పోలీసులతో వచ్చినవారే తన గొంతు కోశారని వాదించాడు. అలాగే రామ్‌కుమార్ తండ్రి సైతం తన కుమారుడు నిర్దోషి అని చెప్పుకున్నాడు. ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ కులం రంగు పులుముకుంది. దీంతో ఇంతకూ స్వాతి హత్యకేసులో నిందితుడు ఎవరు అనే అయోమయం నెలకొంది.ఈ దశలో నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షులను మంగళవారం పుళల్‌జైలుకు తీసుకెళ్లారు. ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి శంకర్ సమక్షంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గుర్తింపు కార్యక్రమం సాగింది. పుళల్ జైల్లోని ఇతర హంతకులతోపాటూ రామ్‌కుమార్‌ను నిలబెట్టారు. హత్యను ప్రత్యక్షంగా చూసిన పెట్టెల అంగడి యజమాని శివకుమార్, స్వాతి తండ్రి గోపాలకృష్ణన్ తదితరులు రామ్‌కుమార్‌ను గుర్తించారు. -
స్వాతి హత్య వెనుక ముగ్గురున్నారా?
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్ కుమార్ ని అరెస్టు చేసి కేసు అంతు తేల్చామని పోలీసులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుండగా.. అసలైన ప్రశ్నలు వాటి వెనుక అనుమానాలు మాత్రమే అలాగే ఉండిపోయాయి. ఆ ప్రశ్నలకు పోలీసులు కూడా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలు, ప్రత్యక్ష సాక్షి, నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ముగ్గురు వ్యక్తులకు ఈ కేసులో భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. తనకు 50 గజాల దూరంలోనే స్వాతి హత్య జరిగిందని, తాను ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని చూశానని సెల్వం అనే ఓ ప్రొఫెసర్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, ఆరోజు స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని చూశానని, అతడు.. ప్రస్తుతం అరెస్టు అయిన వ్యక్తి ఒకటి కాదని అన్నారు. అయితే, మరి చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదు. స్పందించేందుకు నిరాకరించారు. అలాగే, రామ్ కుమార్ తోపాటు రూమ్ మేట్ గా ఉన్న ఓ సంస్థ సెక్యూరిటీ గార్డు నటేశాన్ కనిపించకుండా పోయాడు. దీనిపై ప్రశ్నించగా అతడు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే, పోలీసుల అదుపులోనే ఉన్నట్లు, ఈ హత్య కేసులో అతడే ప్రధాన సాక్షి అని తెలుస్తోంది. ఒక వేళ నటేశాన్ కు ఈ హత్య విషయం ముందే తెలియకుంటే పోలీసులకు ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదని, నిందితుడి కోసం తొలుత పోలీసులు గడపగడప తిరిగి అడిగినా ఎందుకు అతడు వివరాలు అందించలేదని మరో ప్రశ్న తలెత్తుతోంది. సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారా స్వాతి తనకు పరిచయం అయిందని, తన కోసం సూర్య ప్రకాశ్ మధ్యవర్తిగా ఉన్నాడని పోలీసులకు చెప్పాడు. అయితే, వాస్తవానికి రామ్ కుమార్ ప్రెండ్స్ లిస్ట్ లో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి లేడు. అసలు ఇంతకీ ఆ సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఎవరు? అతడు అసలు ఉన్నాడా లేడా అనే విషయం పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి స్వాతి హత్య చిక్కుముడులు ఇంకా వీడనట్లేనని చెప్పవచ్చు. -
నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని..
చీకొట్టింది, చీదరించుకుంది స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ వాంగ్మూలం ప్రేమించాల్సిందిగా స్వాతిని ఎంతగానో బతిమలాడాను, చీదరించుకుంది, చీకొట్టింది, అందుకే హతమార్చానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు రామ్‌కుమార్ చెప్పాడు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24)ని దారుణంగా హత్యచేసిన రామ్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగా నే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించి గొంతుకు 18 కుట్లు వేయడం ద్వారా పోలీసులు రామ్‌కుమార్ ప్రాణాలు కాపాడగలిగారు. కొద్దిగా కోలుకున్న తరువాత తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు అతని నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ సందర్భంగా స్వాతిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలిలోని ఐన్‌స్టీన్ ఇంజనీరింగ్ కళాశాలలో గత ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నాలుగు బ్యాక్‌లాగ్స్ నిలిచిపోయాయి. మూడు నెలల క్రితం ఉద్యోగాన్వేషణలో చెన్నైకి చేరుకున్నాను. చూలైమేడు సౌరాష్ట్రా నగర్‌లోని ఏఎస్ మేన్షన్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని సమీపంలోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా చేరాను. అక్కడి సమీపంలో నివసించే స్వాతి ప్రతిరోజూ నేను నివసించే మేన్షన్ మీదుగానే వెళ్లేది. నేను మెకానికల్ ఇంజనీరునని, నెలకు రూ.లక్ష జీతానికి పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాను. ప్రతిరోజూ మాటలు కలపడం ప్రారంభించాను. ఈ దశలో నేను ఇంజనీరును కాదని, ఒక వస్త్రదుకాణంలో గుమాస్తా అని స్వాతి తెలుసుకుని దూరం పెట్టడం ప్రారంభించింది. స్వాతిపై ప్రేమను పెంచుకున్న తాను అనేక సార్లు ఆమె వెంటపడి చెప్పడం ప్రారంభించాను. తనపై కోపంతో కసిరికొట్టింది. వెంటపడవద్దని బెదిరిం చింది. ప్రతిరోజూ తండ్రిని వెంటపెట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళుతూ నేను మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. స్వాతితో కలిసి ఉన్న జీవితా న్ని ఊహించుకున్నా, ఆమె లేని జీవితం వృథాఅని బాధపడ్డాను. ఇలా ఎడబాటుకు లోనైస్థితి లో నాకు దక్కని స్వాతి ఎవ్వరీ దక్కకూడదని భావించాను. స్వాతిని చంపేయాలని నిర్ణయిం చుకుని పుస్తకాల మాటున కత్తిపెట్టుకుని రెండురోజులు వెంటపడ్డాను. మూడోరోజైన గత నెల 24వ తేదీన ప్రేమించాలంటూ ప్లాట్‌ఫారంపైనే చివరిసారిగా బతిమాలాడాను. అయితే యథాప్రకారం చీకొట్టడంతో ఆగ్రహంతో హతమార్చానని రామ్‌కుమార్ అంగీకరించాడు. పూర్తిస్థాయి విచారణ కోసం రామ్‌కుమార్‌ను రెండు రోజుల్లో చెన్నైకి తీసుకురానున్నారు. -
ప్రమోషన్ కోసమే స్వాతి హత్య
విజయనగరం : జిల్లాలో సంచలనం సృష్టించిన ఎస్.కోట రైల్వే ఉద్యోగిని హత్య కేసు చిక్కుముడి వీడింది. పోలీసులకు సవాల్‌గా మారిన స్వాతి హత్య కేసును నెలరోజుల దాటాక ఎట్టకేలకు ఛేదించారు. గతనెల 11న శృంగవరపుకోట మండల కేంద్రం రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చిట్టిమోజు స్వాతి దారుణ హత్యకు గురవడం తెలిసిందే. హత్యకు ప్రధాన సూత్రధారి అదే విభాగంలో పనిచేసే ఉద్యోగి గోపి అని పోలీసులు గుర్తించారు. ప్రమోషన్ కోసమే స్వాతిని హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గోపాలపట్నంలో పనిచేస్తున్న స్వాతిని ఎస్.కోటకు, ఎస్.కోటలో పనిచేస్తున్న నిందితుడిని గోపాలపట్నం బదిలీ చేయడమే హత్యకు కారణమని తెలిసింది. స్వాతిని బెదిరించి ఎస్.కోట నుంచి బదిలీ చేయించుకుని వెళ్లేలా ప్రయత్నించాడు. అది వీలు కాకపోవడంతో స్వాతి అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. మరో ముగ్గురితో కలిసి స్వాతిని హత్య చేశాడు. రైల్వే పోర్టర్‌గా పనిచేసి, డిపార్ట్మెంటల్ పరీక్ష రాసిన నిందితునికి కొద్దిరోజుల క్రితం పదోన్నతి లభించడం గమనార్హం. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి కేసును సవాల్‌గా తీసుకున్నారు. దాదాపు 12 వందల మంది వరకు అనుమానితుల్ని విచారించారు. రైల్వే ఉద్యోగులతో పాటు రైళ్లలో పనిచేసే ప్రైవేటు కార్మికులు, టీ, సమోసాలు అమ్మేవారు, స్వాతి భర్త కుటుంబ సభ్యులు, ఇనుప ముక్కలు అమ్మేవారిని విచారించారు. ఈ క్రమంలో సహ ఉద్యోగి సూత్రధారి అన్న కీలక సమాచారం బయటపడింది. ఎస్.కోటలో నిందితుడు పనిచేస్తుండగా కొందరు ఇనుప తుక్కు నేరస్తులతో సంబంధాలున్నట్టు సమాచారం. ఇతనిపై ఇప్పటికే ఇనుప తుక్కు రవాణా కేసులున్నట్టు తెలిసింది. -
స్వాతి హత్య కేసులో వీడని మిస్టరీ
శృంగవరపుకోట: సంచలనం రేపిన రైల్వే ఉద్యోగిని స్వాతి హత్యకేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య ఎవరు.. ఎందుకు చేశారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు సరైన ఆధారాలు లభ్యం కాక కేసు కొలిక్కి రాలేదు. పట్టణంలోని స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో ట్రాక్షన్ సబ్‌స్టేష న్లో పనిచేస్తున్న ఉద్యోగిని చిట్టిమోజు స్వాతి సోమవారం రాత్రి హత్యకు గురైన విషయం పాఠకులకు విదితమే. స్వాతి హత్యపై పలుకోణాల్లో దర్యాప్తు సాగుతోంది. హంతకులు స్థానికులా.. బయటి నుంచి వచ్చారా.. హత్యకు ఎన్ని రోజుల నుంచి పథక రచన చేశారు. అంత కిరాతకంగా చంపాల్సినంత కక్ష ఎవరికి ఉంది.. ఆమెతో కలిసి పనిచేసినవారు, బంధువులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు, గతంలో స్వాతి పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా అన్ని వర్గాల వారిని విచారించేందుకు, సెల్‌ఫోన్ కాల్‌డేటా సేకరణ, సంఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలు, రక్తం శాంపిల్స్ పరిశీలన వంటి అంశాలైపై 10 బృందాలు పనిచేస్తున్నాయి. సబ్‌స్టేషన్ పరిసరాలపై అవగాహన, డ్యూటీలో ఇద్దరు మహిళలు తప్ప ఎవరూ ఉండరన్న విషయం తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడి, కేసును పక్కదోవ పట్టించేందుకు కొన్ని నగలు తీసుకునిపోయారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం చెప్పండి.. సీసీఎస్ డిఎస్సీ చక్రవర్తి నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐల నేతృత్వంలో 10 టాస్క్‌ఫోర్స్ బృందాలు, సివిల్, జి.ఆర్.పి.ఎఫ్, ఆర్.పి.ఎఫ్ బృందాలు హత్య కేసు మిస్టరీని ఛేదించటానికి పనిచేస్తున్నాయని ఎస్.కోట సీఐ లక్ష్మణమూర్తి చెప్పారు. హత్యకు సంబంధించి ఏ చిన్న సమాచారం తెలిసినా స్థానిక పోలీసు అధికారులకు చెప్పి సహకరించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచటంతోపాటు వారికి నగదు పారితోషికం ఇస్తామని చెప్పారు. రైల్వే అధికారుల తీరుపై విమర్శలు రైల్వే ఉద్యోగిని స్వాతి హత్యకు పరోక్షంగా రైల్వే అధికారులే కాారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఊరి చివర ఎటువంటి రక్షణ లేకుండా, సెక్యూరిటీ గార్డు, అలారం లేని చోట రాత్రి వేళ నిర్దయగా మహిళలకు డ్యూటీలు వేయటం రైల్వే అధికారుల పైశాచికత్వానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. డే డ్యూటీ వేయాలని, స్టేషన్లో బాత్రూమ్ కూడా లేదని, రక్షణ కరువయిందని అర్జీలు పెట్టుకుని మొత్తుకున్నా రైల్వే అధికారులు పట్టించుకోకపోవటం వల్లనే స్వాతి దారుణ హత్యకు గురైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.