స్వాతి హత్య కేసును సీబీఐ విచారించాలి
హైకోర్టులో రామ్‌కుమార్ తల్లి పిటిషన్
కేకే.నగర్: చెన్నై, నుంగంబాక్కంకు చెందిన ఇన్పోసిస్ ఉద్యోగి స్వాతి గత జూన్ నెల నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తిరునెల్వేలి జిల్లా సెంగోడుకు చెందిన రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచి జైల్లో నిర్భంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిజమైన నిందితుడిని రక్షించి అమాయకుడు అయిన తన కుమారుడిని అరెస్టు చేసినట్లు అందువలన ఈ హత్య కేసు సీబీఐ విచారణకు మార్చాలని మద్రాసు హైకోర్టులో రామ్‌కుమార్ తల్లి పుష్పం పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో పిటిషన్‌దారులు పుష్పం తరఫున న్యాయవాది హాజరై ఈ హత్య కేసుపై నుంగంబాక్కం పోలీసులు సరిగ్గా విచారణ జరపలేదని, ఇంకనూ ఈ హత్య కేసులో ముత్తుకుమార్, ఇస్మాయిల్‌లకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిని పోలీసులు విచారణ జరపలేదని వాదించారు. స్వాతి శరీరంపై గల కత్తిపోట్లను చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసేందుకు అవకాశం లేదన్నారు. ఇంకనూ ఈ హత్య కేసులో తమను పోలీసులు విచారించరాదని ముఖ్యమంత్రి విభాగానికి పిటిషన్‌దారులు లేఖ రాశారని అన్నారు. అయినా ఈ కేసులో సంబంధం గల వారిని విచారించకుండా నిజమైన నిందితులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నందున ఈ కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాలని వాదించారు.
పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ గాని, నివేదికను కాని దాఖలు చేయడానికి తాము ఇష్టపడలేదన్నారు. అందుకు బదులుగా స్వాతి హత్య కేసులో పోలీసులు జరిగిన సమగ్ర విచారణ వివరాలను కోర్టులో దాఖలు చేస్తామన్నారు. ఆ తరువాత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు తీర్పును వాయిదా వేశారు.