కోర్టుకు ‘మౌళివాకం’
సాక్షి, చెన్నై:మౌళివాకం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు సీబీఐకు అప్పగించాలని డిమాం డ్ చేస్తూ, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రైమ్ సృష్టి డెరైక్టర్ బాల గురుస్వామి, ఇంజనీరు కార్తీక్‌ను అరెస్టు చేశారు. మౌళివాకం అపార్ట్‌మెంట్ 61 మందిని బలిగొన్న ఈ ప్రమాదంపై ఓ వైపు న్యాయ విచారణ, మరో వైపు సిట్ విచారణ సాగుతోంది. అయితే, ఈ విచారణలు న్యాయ బద్దంగా జరిగే అవకాశాలు లేవన్న ఆరోపణలున్నాయి. నాణ్యతా లోపంతో పాటుగా, అనుమతుల మంజూరు వ్యవహారంలో ఉన్న పెద్దల బండారం బయటకు రావాలంటే, కేసును సీబీఐకు అప్పగించాల్సిందేనన్న డిమాండ్ వస్తోంది. ఈ పరిస్థితుల్లో విచారణను సీబీఐకు అప్పగించాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మంగళవారం కోర్టుకు ఎక్కారు.
కోర్టులో పిటిషన్ : మౌళివాకం ఘటనను తన పిటిషన్‌లో వివరిస్తూ, ఈ కేసు న్యాయబద్ధంగా జరగాలంటే సీబీఐకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అధికారులతో కూడిన కమిషన్లు, సిట్ బృందాలు విచారించినా, వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతృత్వంలో ప్రత్యేక బృందంతోగానీ, సీబీఐతో గానీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, న్యాయమూర్తి సుందరేశన్ నేతృత్వంలో ప్రధాన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ, తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వే సింది.
అరెస్టు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ కేసు దర్యాప్తుకు సిట్ బృందం రంగంలోకి దిగింది. కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో జాయింట్ కమిషనర్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. మాంగాడు పోలీసుల నుంచి కేసు వివరాలను సేకరించే పనిలో పడింది. అరెస్టయిన ప్రైమ్ సృష్టి నిర్వాహకుడు మోహన్ రాజ్, ఆయన కుమారుడు ముత్తుల్ని ఇప్పటికే కస్టడీకి తీసుకుని మాంగాడు పోలీసులు విచారించే పనిలో ఉండగా, మిగిలిన నలుగుర్ని కస్టడీకి తీసుకునేందుకు శ్రీ పెరంబదూరు కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ప్రైమ్ సృష్టి డెరైక్టర్ బాల గురు స్వామి, ఇంజనీర్ కార్తీక్‌లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు తాము బాధ్యత వహించేది లేదని, ఇది ప్రకృతి విలయతాండవం అంటూ బాల గురు వాదించిన విషయం తెలిసిందే. ఛలో రాజ్ భవన్: మౌళివాకం ఘటనను సీబీఐకు అప్పగించాలన్న డిమాండ్‌తో ఛలో రాజ్ భవన్‌కు డీఎంకే పిలుపు నిచ్చింది.
సుమారు 25 వేల మందితో ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధం అయ్యారు. తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం జిల్లాల్లోని పార్టీ శ్రేణులకు మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 12న జరిగే ఛలో రాజ్‌భవన్ కార్యాక్రమాన్ని అన్నా అరివాలయం వద్ద కరుణానిధి ప్రారంభించబోతున్నారు. ఈ ర్యాలీలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళితో పాటుగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. విద్యార్థులకు షిఫ్ట్ పద్ధతిలో పాఠాలు : మౌళివాక్కంలో ప్రైమ్ సృష్టి రెండో భవనం పక్కనే ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. మొదటి భవనం కుప్ప కూలడం, రెండో భవనం ప్రమాదం అంచున ఉన్నట్లు తేలింది. దీంతో ఆ రెండో భవనం పరిసరాల్లోని సుమారు ఇరవై ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ ఇళ్లలోని వారు తమ బంధువులు ఇళ్లల్లో తలదాచుకున్నారు.
ఈ భవనానికి పక్కనే ఉన్న మహోన్నత పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ పాఠశాలను మూసి వేశారు. ఎప్పుడు పాఠశాల పునఃప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన దృష్ట్యా, సోమవారం పాఠశాల పునః ప్రారంభం అవుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూశారు. అయితే, అందుకు తగ్గ చర్యలు అధికారులు తీసుకోలేదు. మౌళివాకంలోని మరో పాఠశాలలో షిఫ్టుల పద్ధతిలో ఇక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. బుధవారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు, మధ్యాహ్నం 1గంట నుంచి 4 గంటల వరకు తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు తరగతుల్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
పరిహారం: మౌళివాకం ఘటనలో 61 మంది విగత జీవులైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తరాంధ్ర వాసులు 35 మంది ఉన్నారు. మరో 14 మంది తమిళులు, మిగిలిన వారు ఒడిశా వాసులు. మృతుల కుటుంబాలకు తలా రెండు లక్షలు పరిహారాన్ని సీఎం జయలలిత ప్రకటించారు. అయితే, రాష్ట్రానికి చెందిన వారు సైతం ఉండడంతో పరిహారం పెంచారు. రాష్ట్రానికి చెందిన 14 మంది మృతుల కుటుంబాలకు మరో ఐదు లక్షలు అదనంగా ప్రకటించారు. మొత్తం తలా ఏడు లక్షల్ని బాధిత కుటుంబాలకు మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జయలలిత అందజేశారు.