రామ్‌కుమార్ ఆత్మహత్య
ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆదివా రం ఆత్మహత్య చేసుకున్నాడు. రిమాండ్ ఖైదీగా పుళల్ జైల్లో ఉన్న రామ్‌కుమార్ విద్యుత్ వైరును కొరికి మరీ బలవన్మరణానికి పాల్పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని, కేసు ను ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీ కులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్వాతి హత్య కేసు విచారణ ఇక ముగిసినట్టే అన్నది స్పష్టం అవుతోంది.
సాక్షి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును చేదించేందుకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టారు. చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురంలో నక్కి ఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు. తాము పట్టుకునే క్రమంలో నిందితుడు రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెర మీదకు తెచ్చిన వాదనను అతడి కుటుంబీకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు. పోలీసులే బలవంతంగా గొంతు కోసి, తమ వాడ్ని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించే పనిలో పడ్డారు.
అలాగే, కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో స్వాతి హత్య కేసుకు సంబంధించిన చార్జ్ షీట్‌ను కోర్టులో పోలీసులు దాఖలు చేయాల్సి ఉంది. అదే సమయంలో రామ్‌కుమార్ నిందితుడు అన్నది నిరూపించేందుకు తగ్గ ఆధారాల సేకరణ పోలీసులకు తలకు మించిన భారంగా మారిందన్న సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, అతడు ఆత్మహత్య చేసుకోలేదని, హతమార్చబడ్డాడన్న అనుమానాలతో ఆరోపణలు గుప్పించే వాళ్లు ఉండడం గమనార్హం.
రామ్‌కుమార్ ఆత్మహత్య : పుళల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మరణించాడు. అయితే, రామ్‌కుమార్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలు తొలుత బయటకు రాలేదు. మీడియాల్లో రామ్‌కుమార్ ఆత్మహత్య వార్త హల్‌చల్ సృష్టించడంతో జైళ్ల శాఖ వర్గాలు స్పందించాయి. సాయంత్రం 4.45 గంటల సమయంలో టీ తాగినానంతరం నీళ్లు కోసం వెళ్లిన రామ్‌కుమార్ వంట గది వద్ద ఉన్న స్విచ్ బోర్డుకు వెళ్తున్న విద్యుత్ వైర్‌ను కొరికి తెంచినట్టు వివరించారు.
ఆ వైర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైనట్టు ప్రకటించారు. హుటాహుటిన తాము ఆసుపత్రికి తరలించామని వివరించారు. అయితే, జైళ్ల శాఖ వర్గాల వాదనలు అనుమానాలకు దారి తీసి ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుళల్‌లో రామ్‌కుమార్ ఎలా ఈ ప్రయత్నం చేసి ఉంటాడని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. ఇక, రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట మార్చురీకి తరలించిన సమాచారంతో అతడి న్యాయవాది రామ్‌రాజ్ పరుగులు తీశారు.
శనివారం రామ్‌కుమార్‌ను తాను కలిసినట్టు, ఆరోగ్యంగా అతడు ఉన్నట్టు, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాని వ్యక్తిగానే కన్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునేంత మానసిక స్థితిలో అతడు లేదు అని ఆయన వాదిస్తుండడం అనుమానాలకు బలం చేకూరి ఉన్నాయి. అతడు మరణించిన సమాచారం కనీసం తనకు కూడా పోలీసులు చెప్పలేదని పేర్కొన్నారు. రామ్‌కుమార్ బంధువు సెల్వం మాట్లాడుతూ తమ వాడి మృత దేహాన్ని చూడడానికి కూడా తనను పోలీసులు అనుమతించడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు.
హత్యగా ఆరోపణ: రామ్‌కుమార్ మరణించిన సమాచారం తమకు అధికారికంగా అందలేదని, మీడియాల్లో వచ్చిన వార్తల ద్వారానే తెలిసిందని అతడి తండ్రి పరమ శివం ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాడు ఈ కేసులో నిర్దోషి అని, అతడ్ని అన్యాయంగా ఇరికించడమే కాకుండా, ఆధారాలు లభించక ఇప్పుడు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. రామ్‌కుమార్ మరణ సమాచారంతో మీనాక్షిపురంలో ఉద్రిక్తత నెల కొంది. మీనాక్షిపురం, పన్‌పోలి, సెంగోటైై్ట్టవడకరై పరిసరాల్లో రామ్‌కుమార్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణను సీబీఐకి అప్పగించినప్పుడే, స్వాతి హత్యకేసుతో పాటు రామ్‌కుమార్ కేసులోనూ దోషులు బయట పడతారని వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. రామ్‌కుమార్ మరణంతో ఇక స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది.