శృంగవరపుకోట: సంచలనం రేపిన రైల్వే ఉద్యోగిని స్వాతి హత్యకేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య ఎవరు.. ఎందుకు చేశారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు సరైన ఆధారాలు లభ్యం కాక కేసు కొలిక్కి రాలేదు. పట్టణంలోని స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో ట్రాక్షన్ సబ్‌స్టేష న్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని చిట్టిమోజు స్వాతి సోమవారం రాత్రి హత్యకు గురైన విషయం పాఠకులకు విదితమే. స్వాతి హత్యపై పలుకోణాల్లో దర్యాప్తు సాగుతోంది. హంతకులు స్థానికులా.. బయటి నుంచి వచ్చారా.. హత్యకు ఎన్ని రోజుల నుంచి పథక రచన చేశారు.
అంత కిరాతకంగా చంపాల్సినంత కక్ష ఎవరికి ఉంది.. ఆమెతో కలిసి పనిచేసినవారు, బంధువులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు, గతంలో స్వాతి పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా అన్ని వర్గాల వారిని విచారించేందుకు, సెల్‌ఫోన్ కాల్‌డేటా సేకరణ, సంఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలు, రక్తం శాంపిల్స్ పరిశీలన వంటి అంశాలైపై 10 బృందాలు పనిచేస్తున్నాయి. సబ్‌స్టేషన్ పరిసరాలపై అవగాహన, డ్యూటీలో ఇద్దరు మహిళలు తప్ప ఎవరూ ఉండరన్న విషయం తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడి, కేసును పక్కదోవ పట్టించేందుకు కొన్ని నగలు తీసుకునిపోయారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సమాచారం చెప్పండి..
సీసీఎస్ డిఎస్సీ చక్రవర్తి నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐల నేతృత్వంలో 10 టాస్క్‌ఫోర్స్ బృందాలు, సివిల్, జి.ఆర్.పి.ఎఫ్, ఆర్.పి.ఎఫ్ బృందాలు హత్య కేసు మిస్టరీని ఛేదించటానికి పనిచేస్తున్నాయని ఎస్.కోట సీఐ లక్ష్మణమూర్తి చెప్పారు. హత్యకు సంబంధించి ఏ చిన్న సమాచారం తెలిసినా స్థానిక పోలీసు అధికారులకు చెప్పి సహకరించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచటంతోపాటు వారికి నగదు పారితోషికం ఇస్తామని చెప్పారు.
రైల్వే అధికారుల తీరుపై విమర్శలు
రైల్వే ఉద్యోగిని స్వాతి హత్యకు పరోక్షంగా రైల్వే అధికారులే కాారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఊరి చివర ఎటువంటి రక్షణ లేకుండా, సెక్యూరిటీ గార్డు, అలారం లేని చోట రాత్రి వేళ నిర్దయగా మహిళలకు డ్యూటీలు వేయటం రైల్వే అధికారుల పైశాచికత్వానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. డే డ్యూటీ వేయాలని, స్టేషన్‌లో బాత్రూమ్ కూడా లేదని, రక్షణ కరువయిందని అర్జీలు పెట్టుకుని మొత్తుకున్నా రైల్వే అధికారులు పట్టించుకోకపోవటం వల్లనే స్వాతి దారుణ హత్యకు గురైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతి హత్య కేసులో వీడని మిస్టరీ
Published Thu, May 14 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement