కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా | Chennai techie swathi murder case: Ramkumar's phone was active till arrest | Sakshi
Sakshi News home page

కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా

Published Mon, Jul 4 2016 8:24 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా

కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా

విచారణ వేగవంతం
* కొండముచ్చు అన్నందుకే చంపా
* దేవరాజన్ బృందంతో నిందితుడు
* తల్లి, సోదరి వద్ద కూడా విచారణ
* మీనాక్షిపురం ఇంట్లో తనిఖీలు


సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి చెన్నైకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తరలించారు.

కాగా తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా, కొండముచ్చు(దేవాంగు) వలే ఉన్నావని పదేపదే హేళన చేయడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చినట్టు దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్‌కుమార్ వాంగ్ములం ఇచ్చాడు. ఇక, ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసిన సెంగోట్టై పోలీసులు మీనాక్షిపురంలోని రామ్‌కుమార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
 
ప్రేమోన్మాదంతో స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది. ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజన్ నేతృత్వంలోని బృందం శనివారం రాత్రంతా పాళయం కోట్టై ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్ట వేసింది. ఆసుపత్రి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడికి  వచ్చే వాళ్లు ప్రతి ఒక్క రినీ తనిఖీల అనంతరం అనుమతించారు. రామ్‌కుమార్‌కు ఆస్పత్రి తరఫున బ్రెడ్, పాలు మాత్రం అందించారు.

రాత్రంతా ఈ బృందం జరిపిన విచారణలో తనలోని ప్రేమికుడు, ఉన్మాది గురించి రామ్‌కుమార్ వివరించాడు. ఫేస్‌బుక్ ద్వారా స్వాతితో ఏర్పడ్డ పరిచయం, ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు. తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించినట్టు, అందుకే పదే పదే వెంటబడ్డట్టూ వివరించాడు. అదే సమయంలో తన ప్రేమకు మధ్యవర్తి ఓ మిత్రుడు వ్యవహరించినట్టు రామ్‌కుమార్ పేర్కొనడంతో అతగాడి కోసం విచారణ మొదలెట్టారు.

చివరకు తనను తిరస్కరించిన స్వాతి కొండముచ్చు వలే ఉన్నావని పదే పదే వ్యాఖ్యానించడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి సమీపంలోని ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని చెన్నైకు వెళ్లినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ రోజు ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదు అని, ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించానని, అయితే, ఆమె మాటలు ఉన్మాదిని చేసినట్టు, హంతుకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

నుంగంబాక్కం స్టేషన్ నుంచి మేన్షనుకు రాగానే టీవీల్లో స్వాతి మృతి చెందినట్టు వచ్చిన వార్తతో అక్కడి నుంచి ఉడాయించి మీనాక్షిపురం చేరుకున్నట్టు వివరించాడు. రెండ్రోజులు బయటకు వెళ్లనప్పటికీ, తర్వాత మేకల మందల్ని తోలుకుని బయటకు వెళ్లినట్టు, క్రమంగా ఈ హత్య కేసు విచారణ గురించి పత్రికలు, టీవీల్లో తెలుసుకుంటూ వచ్చానని పేర్కొన్నాడు. తన ఇంటికి మఫ్టీలో మహిళా కానిస్టేబుల్ వెళ్లినప్పుడే పోలీసులు తనను సమీపించినట్టే అని భావించి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టే మీడియాల్లో సమాచారాలు వెలువడుతుండడం గమనార్హం.

ఇక, ప్రేమోన్మాది మీద సెంగోట్టై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసి, అతడి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ రక్తపు మరకతో ఉన్న చొక్కా, స్వాతి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, స్వాతిని హతమార్చిన విషయం ముందుగా తమకు తెలియదని రామ్‌కుమార్ తల్లి పుష్ప పోలీసులు వద్ద స్పష్టం చేశారు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, ఫేస్‌బుక్ పరిచయం గురించి తమకు తెలియదంటూ రామ్‌కుమార్‌తో సన్నిహితంగా ఉండే మీనాక్షిపురం మిత్రులు తెలియజేయడం గమనార్హం. అయితే, అవసరం మేరకు తప్ప, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని, అలాంటి వాడా, ఇలా అన్న విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.
 
చెన్నైకి రామ్‌కుమార్: రాత్రంతా సాగిన విచారణతో ఆదివారం ఉదయం రామ్‌కుమార్‌కు వైద్య పరీక్షల్ని అందించారు. కొంత మేరకు కోలుకున్న దృష్ట్యా, ఇక, చెన్నైకు తీసుకెళ్లవచ్చని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్, వైద్యబృందం, ముందు రెండు, వెనుక రెండు పోలీసు వాహనాలను సిద్ధం చేసి భద్రత నడమ చెన్నైకు తరలించే ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం చెన్నైకు తరలించే ప్రయత్నం చేసినా, అక్కడి కోర్టు న్యాయమూర్తి సెలవు మీద వెళ్లి ఉండడంతో సమస్యలు తప్పనట్టు సమాచారం.  చెన్నైకు రామ్‌కుమార్‌ను తరలించే క్రమంలో అతడ్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఆసుపత్రి ఆవరణలో చుట్టుముట్టడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరకు న్యాయ పర సమస్యల్ని అధిగమించి, గట్టి భద్రత నడమ సరిగ్గా ఐదు గంటల సమయంలో అంబులెన్స్ పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి జాతీయ రహదారి గుండా చెన్నై వైపుగా దూసుకెళ్లింది.

ఆరు వందల కి.మీ దూరం పయనం కాబట్టి, సోమవారం వేకువ జామున చెన్నైకు చేరుకోనున్నారు. నేరుగా రామ్‌కుమార్‌ను రాయపేట ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేక వార్డులో వైద్య చికిత్సలు అందించి, వైద్యుల సలహా మేరకు తదుపరి విచారణను వేగవంతం చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు స్వాతి హత్యతో సమాప్తం కావాలని, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, రామ్‌కుమార్ కఠినంగా శిక్షించబడాలని స్వాతి చిన్నాన్న గోవిందరాజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

అలాగే, స్వాతి స్నేహితుడు మహ్మద్ బిలాల్ సిద్ధిక్ పేర్కొంటూ, వేధింపుల విషయాన్ని స్వాతి ఎవరి దృష్టికైనా తీసుకొచ్చి ఉంటే, ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు అని వ్యాఖ్యానించాడు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం,  ఏ సమస్యనైనా నేరుగా ఢీకొట్టే ధైర్యం, శక్తి ఆమెకు ఉండబట్టే ఎవరి దృష్టికి తీసుకు రాలేదని పేర్కొంటూ, నిందితుడు కఠినంగా శిక్షించ బడాలని విన్నవించాడు.
 
ఇళ్ల వద్ద నిఘా..నిఘా నేత్రాల మీద ప్రస్తుతం అందరి దృష్టి మళ్లింది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను గుర్తించడంలో నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడ్డాయి. రైల్వే స్టేషన్లలో నిఘా నేత్రాలు కన్పించనప్పటికీ, నుంగబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని  ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా నిందితుడు ఉడాయిస్తుండడాన్ని బందించింది. ఇది పోలీసుల విచారణకు ఎంతగానో దోహదపడింది. ఈ పరిస్థితుల్లో తమ ఇళ్ల వద్ద నిఘా నేత్రాల  ఏర్పాటు మీద జనం దృష్టి పెట్టారు. సొంత ఇళ్లు కల్గిన వాళ్లతో పాటు అపార్ట్‌మెంట్స్, పలు ప్రాంతాల్లోని దుకాణాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు మీద ఆయా యజమానులు దృష్టి పెట్టి ఉండడం విశేషం. ఇందుకు తగ్గట్టుగా సీసీ కెమెరాల విక్రయ ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement