నిఘా నీడలో పోస్టుమార్టం
సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ మృతదేహానికి ఎట్టకేలకు శనివారం పోస్టుమార్టం జరిగింది. ఈ ప్రక్రియ ఐదుగురు వైద్యులతో కూడిన బృందం తో పాటు తిరువళ్లూరు మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వి సమక్షంలో జరిగింది. పూర్తిగా వీడియో చిత్రీకరణ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిగా పట్టుబడ్డ రామ్‌కుమార్ గత నెల పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తనయుడి మృతిలో అనుమానం ఉందంటూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం కోర్టు మెట్లు ఎక్కడంతో పోస్టుమార్టం వాయిదా పడుతూ వచ్చింది.
దీంతో మృత దేహాన్ని చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులకు పైగా ఉంచాల్సి వచ్చింది. ఎట్టకేలకు పరమశివం తరఫు వాదనల్ని కోర్టు పక్కన పెట్టడంతో పోస్టుమార్టం నిర్వహణకు తగ్గ చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆ మేరకు శనివారం నిఘా నీడలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. నిఘానీడలో: రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహణ సమాచారంతో అందరి దృష్టి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి మీద పడింది. దీంతో ఆ పరిసరాల్లో క ట్టుదిట్టమైన భ ద్రతా ఏర్పాట్లు చేశారు. పది గంటల సమయంలో తిరువళ్లువర్ మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వం సమక్షంలో రామ్‌కుమార్ మృతదేహాన్ని పరమశివం గుర్తించారు.
ఈ సమయంలో వీసీకే నేత తిరుమావళవన్, న్యాయవాది రామ్‌రాజ్ అక్కడే ఉన్నారు. తదుపరి మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గొంతు, చాతి మీద గాయాలు ఉండడాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో ఆ గాయాలకు గల కారణాలను ప్రత్యేకంగా పరిశీలించే విధంగా వైద్య బృందానికి ఆదేశాల్ని మెజిస్ట్రేట్ జారీ చేశారు. పదిన్నర గంటల సమయంలో ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ కదిర్ కె.గుప్తా, రాయపేట, కీల్పాకం, స్టాన్లీ ఆసుపత్రులు వైద్యులు వినోద్, సెల్వకుమార్, మణి గండన్, రాజులతో కూడిన బృందం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. గంటన్నర పాటు సాగిన ఈ ప్రక్రియను రెండు కెమెరాల ద్వారా పూర్తిగా వీడియో చిత్రీకరించారు.
వాగ్వివాదం: మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందుగా వైద్యులతో రామ్‌కుమార్ తరఫు న్యాయవాదులు వాగ్యుద్దానికి దిగారు. కోర్టు తమకు కల్పించిన అవకాశం మేరకు పోస్టుమార్టం నివేదిక నకలు, వీడియో దృశ్యాలు, ఫొటోలను తమకు పోస్టుమార్టం పూర్తయిన గంటన్నరలోపు ఇవ్వాల్సిందిగా వైద్యులకు సూచించారు. ఇందుకు వైద్య బృందం నిరాకరించడంతో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. చివరకు వీసీకే నేత తిరుమావళవన్ జోక్యం చేసుకుని, రాత్రిలోపు తమకు సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. అవసరం అయితే, రీ పోస్టుమార్టం చేయొచ్చని సూచించారు. తమకు అన్ని ప్రక్రియల్ని త్వరితగతిన ముగించి నకలు పత్రాలను చేతికిచ్చినప్పుడే మృతదేహానికి తీసుకుంటామని తేల్చారు. దీంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహం మళ్లీ మార్చురీకి పరిమితమైంది.