
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్ జంట 6–3, 6–3తో హైనెక్ బార్టన్ (చెక్ రిపబ్లిక్)–ఎరిక్ వాన్‌షెల్‌బోయిమ్ (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ తమ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 7–6 (7/5), 7–5తో ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 7–5, 6–0తో బెర్నాడ్ టామిక్ (ఆ్రస్టేలియా)–నికోలస్ మెజియా (కొలంబియా)లపై, బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆ్రస్టేలియా) 6–2, 6–4తో ఆదిల్ కల్యాణ్‌పూర్–కరణ్ సింగ్ (భారత్)లపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించారు.