
- నేడు చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ ఢీ
- జోరు మీదున్న ఇరు జట్లు
- మ.గం.2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18,జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
భారత్, న్యూజిలాండ్ వన్డేల్లో చివరిసారిగా గత వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీస్‌లో కూడా భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయాలు అందుకుంది. అంతకు ముందు కివీస్‌తో వరుసగా మూడు వన్డేల్లో కూడా టీమిండియాదే పైచేయి. అయితే ఫార్మాట్‌లు వేరైనా ఇటీవల మన గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆ జట్టు కొట్టిన దెబ్బ ఇంకా తాజాగానే ఉంది.
ఇరు జట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆ సిరీస్‌లో ఆడినవారే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో తమ సత్తా చాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ కోణంలో ఇది నామమాత్రపు మ్యాచే అయినా సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఇది ఉపయోగపడనుంది. ఇరు జట్ల సెమీస్ ప్రత్యర్థి ఎవరో కూడా ఈ మ్యాచ్‌తోనే తేలనుంది.
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’నుంచి ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన భారత్, న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ నెగ్గిన టీమ్‌లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది.
పంత్‌కు చాన్స్!
గత రెండు మ్యాచ్‌లలో ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి భారత జట్టు లక్ష్యాలను సునాయాసంగా ఛేదించింది. మన ప్రదర్శనను బట్టి చూస్తే అంతా ఫామ్‌లో ఉండటంతో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ అవకాశం ఇచ్చే ఆలోచనతో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. వికెట్ కీపర్‌గా రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమైంది.
కారు ప్రమాదం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత పంత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే గత ఏడాది ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత ఒకే రోజు విరామంతో సెమీఫైనల్ ఆడాల్సి ఉండటంతో ప్రధాన పేసర్ షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం కూడా ఉంది. అతని స్థానంలో అర్ష్ దీప్ ఆడవచ్చు. కివీస్ టాప్–8లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ స్థానంలో సుందర్ జట్టులోకి రానున్నాడు.
పంత్ బరిలోకి దిగితే అక్షర్ బ్యాటింగ్ అవసరం కూడా టీమ్‌కు అంతగా ఉండకపోవచ్చు. మరో వైపు కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఆడిస్తే అతని వన్డే ప్రదర్శనను అంచనా వేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌పరంగా రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్‌లతో టాప్–4 పటిష్టంగా ఉండగా పాండ్యా, జడేజా అదనపు బలం.
అదే జట్టుతో...
న్యూజిలాండ్ కూడా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. రచిన్, యంగ్, లాథమ్ ఇప్పటికే సెంచరీలు సాధించగా, కాన్వే కూడా ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ బ్యాటర్ విలియమ్సన్ వైఫల్యమే కొంత ఆందోళన కలిగిస్తోంది.
అయితే గతంలో కీలక మ్యాచ్‌లలో భారత్‌పై రాణించిన రికార్డు ఉన్న మాజీ కెపె్టన్ తన స్థాయికి తగినట్లు ఆడితే టీమ్‌కు తిరుగుండదు. ఫిలిప్స్‌లాంటి ఆల్‌రౌండర్ జట్టుకు మరింత కీలకం. జేమీసన్, రూర్కే, హెన్సీలతో పేస్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. కివీస్ స్పిన్ కూడా చాలా బలంగా ఉండటం విశేషం. సాంట్నర్, బ్రేస్‌వెల్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా కివీస్ కూడా దుర్బేధ్యంగా కనిపిస్తోంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, పంత్, పాండ్యా, జడేజా, సుందర్, రాణా, వరుణ్, అర్ష్ దీప్.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), కాన్వే, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.
పిచ్, వాతావరణం
స్పిన్‌కు అనుకూలం. వర్షసూచన ఏమాత్రం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం.
కోహ్లి @300
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 299 వన్డేల కెరీర్‌లో కోహ్లి 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లికి ముందు భారత్ నుంచి సచిన్, ధోని, ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, యువరాజ్ 300 వన్డేలు ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment