
ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీపై విజయం
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–13, 21–10తో ఇండోనేసియా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. లక్ష్య సేన్ ధాటికి తట్టుకోలేక జొనాథన్ క్రిస్టీ 36 నిమిషాల్లో చేతులెత్తేశాడు.
ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీలో సెమీఫైనల్లో క్రిస్టీ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. గతంలో క్రిస్టీ చేతిలో నాలుగుసార్లు ఓడిపోయిన లక్ష్య సేన్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చలాయించాడు. లక్ష్య ఆటకు జవాబివ్వలేక క్రిస్టీ అనవసర తప్పిదాలు చేశాడు. దాంతో తొలి గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ లక్ష్య తన దూకుడు కొనసాగించాడు.
స్కోరు 11–6 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. నేడు క్వార్టర్ ఫైనల్లో 6వ ర్యాంకర్ లీషి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్ ఆడతాడు.
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. హావో నాన్ జియె–హాన్ జెంగ్ వె (చైనా)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌ను 16–21తో కోల్పోయారు. రెండో గేమ్‌లో స్కోరు 2–2 వద్ద ఉన్నపుడు చిరాగ్ వెన్ను నొప్పితో ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో సాత్విక్–చిరాగ్ ద్వయం మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్ (భారత్) 16–21, 13–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 10–21, 12–21తో జె ఫెంగ్ యాన్–జిన్ వె యా (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment