న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ప్లేయర్‌ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్ టోరీ్నలో ఆండీ రాడిక్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు.
తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్‌లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment