ఫెడరర్ శుభారంభం
పారిస్ : మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. ఆదివారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ ఫెడరర్ 6-3, 6-3, 6-4తో అలెజాంద్రో ఫలా (కొలంబియా)పై గెలిచాడు. కెరీర్‌లో వరుసగా 62వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న ఈ స్విస్ స్టార్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోర్టులోకి ఓ యువకుడు దూసుకొచ్చి ఫెడరర్‌తో ‘సెల్ఫీ’ తీసుకోవడంతో నిర్వాహకుల భద్రతా లోపాలను ఎత్తి చూపింది.
ఈ సంఘటనపై ఫెడరర్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 7-5, 6-1తో మాథ్యూ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-3తో ఇల్హాన్ (టర్కీ)పై, 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-1, 6-2, 6-2తో లిండెల్ (స్వీడన్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో నిరుటి రన్నరప్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 7-5, 6-4తో రోడినా (రష్యా)పై, తొమ్మిదో సీడ్ మకరోవా (రష్యా) 6-4, 6-2తో చిరికో (అమెరికా)పై, మాజీ చాంపియన్, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 4-6, 6-2, 6-0తో ష్వెదోవా (కజకిస్తాన్)పై గెలిచారు.