లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు.
ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్‌పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది.
భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్‌పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్‌కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment