
హాంగ్జౌ (చైనా): క్రొయేషియా టెన్నిస్ ప్లేయర్ మారిన్ సిలిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ చరిత్రలో కొత్త ఘనతను నమోదు చేశాడు. ఏటీపీ టైటిల్ నెగ్గిన అతి తక్కువ ర్యాంకింగ్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సిలిచ్ విజేతగా నిలిచాడు.
ఫైనల్లో అతను 7–6 (7/5), 7–6 (7/5)తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్‌ను ఓడించి తన కెరీర్‌లో 21వ టైటిల్ గెలుచుకున్నాడు. హౌంగ్జౌ ఓపెన్‌లో బరిలోకి దిగే సమయానికి సిలిచ్ ఏటీపీ ర్యాంక్ 777 కావడం విశేషం. 35 ఏళ్ల సిలిచ్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇక్కడ ఆడే అవకాశం లభించింది.
ఒకప్పుడు పురుషుల సింగిల్స్‌లో మంచి విజయాలతో టాప్ ఆటగాళ్లలో ఒకడిగా సిలిచ్ కొనసాగాడు. 2014లో తన ఏకైక గ్రాండ్‌స్లామ్ (యూఎస్ ఓపెన్) నెగ్గిన అతను ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు. 2018లో అతను వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకును కూడా అందుకున్నాడు. గత కొంత కాలంగా గాయాలతో అతను చాలా వరకు ఆటకు దూరమయ్యాడు.