
భర్తపై కేసు పెట్టిన బాక్సర్ స్వీటీ బూరా
చండీగఢ్: దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారుల దాంపత్యంలో పెను వివాదం రేగింది. కుటుంబ కలహాలతో పరిస్థితి పోలీసు కేసు వరకు వెళ్లింది. హరియాణాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా, భారత బాక్సర్ స్వీటీ బూరాకు 2022లో పెళ్లి జరిగింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హుడా 2019 నుంచి 2022 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు.
మరోవైపు స్వీటీ బూరా 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఇప్పుడు హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. గతంలోనే డిమాండ్ ప్రకారం లగ్జరీ కారును ఇచ్చినా... మరింత డబ్బు కావాలంటూ తనను కొడుతున్నాడని స్వీటీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 ప్రకారం హుడాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
దీనికి సంబంధించి 2–3 సార్లు నోటీసులు జారీ చేసినా... అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ హుడా ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే తాను పోలీసుల ముందుకు వస్తానని, అయితే స్వీటీపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు కేసుపై మరింత సమాచారం ఇచ్చేందుకు స్వీటీ నిరాకరించింది. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి హుడా ఓటమి పాలయ్యాడు.