sweetie
-
‘గృహ హింస’ వివాదంలో భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్
చండీగఢ్: దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారుల దాంపత్యంలో పెను వివాదం రేగింది. కుటుంబ కలహాలతో పరిస్థితి పోలీసు కేసు వరకు వెళ్లింది. హరియాణాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా, భారత బాక్సర్ స్వీటీ బూరాకు 2022లో పెళ్లి జరిగింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హుడా 2019 నుంచి 2022 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. మరోవైపు స్వీటీ బూరా 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఇప్పుడు హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. గతంలోనే డిమాండ్ ప్రకారం లగ్జరీ కారును ఇచ్చినా... మరింత డబ్బు కావాలంటూ తనను కొడుతున్నాడని స్వీటీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 ప్రకారం హుడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి 2–3 సార్లు నోటీసులు జారీ చేసినా... అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ హుడా ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే తాను పోలీసుల ముందుకు వస్తానని, అయితే స్వీటీపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు కేసుపై మరింత సమాచారం ఇచ్చేందుకు స్వీటీ నిరాకరించింది. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి హుడా ఓటమి పాలయ్యాడు. -
'అలా పిలిస్తే నాకు అసహ్యం!'
న్యూయార్క్: సమాజంలోనూ, కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన గౌరవం అందించడంపై... వ్యాపార రంగంలో వెలుగొందుతున్న మహిళా శక్తి, ప్రవాస భారతీయురాలు, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి తన అభిప్రాయాలను విస్పష్టంగా వెలిబుచ్చారు. మహిళలకు సమాన హోదా అందిచాలన్నా, సమాన గౌరవం కల్పించాలన్నా తోటివారు స్వీటీ, హనీ అంటూ సంబోధించడం సరికాదని, అలా పిలవడాన్ని తాను ద్వేషిస్తానని ఆమె తెగేసి చెప్పారు. కార్యాలయాల్లో ఎవరైనా సరే సాటి మహిళను ముద్దు పేర్లతో పిలిచే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేందుకు ప్రయత్నించాలంటూ న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ సమావేశంలో నూయి మనసులోని మాటను స్పష్టం చేశారు. ఏళ్ళ తరబడి మహిళలు సమాన హక్కులకోసం పోరాడుతూనే ఉన్నారని, ముఖ్యంగా కార్యాలయాల స్థాయిలో సమాన గౌరవాన్ని అందుకొనేందుకు వారు పాఠశాల స్థాయి నుంచే మగవారికి దీటుగా అన్ని హక్కుల్లోనూ పోటీ పడాలని, మంచి స్థాయిని సంపాదించాలని అన్నారు. అప్పుడే కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని రాణించవచ్చని, అత్యంత గౌరవాన్ని పొందవచ్చని సూచించారు. అలా కాకుండా మనం నేటికీ సమాన గౌరవం, సమాన హక్కులకోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. ముఖ్యంగా మహిళలు పనిచేసే చోట ఒకరికి ఒకరు సహకరించుకోవడం కనిపించదని, ఒకరిపట్ట ఒకరు సోదరి భావం కలిగి ఉండటం ఎంతో అవసరమని, అదే మరింత బలాన్ని ఇస్తుందని నూయి తెలిపారు. ఓ మహిళ గురించి మరో మహిళ చెబితే మనం పెద్దగా పట్టించుకోమని, అదే విషయాన్ని ఓ పురుషుడు చెప్పినప్పుడు నమ్మేందుకు సిద్ధంగా ఉంటామని, అటువంటి మనస్తత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరి సలహాలు మరొకరు తీసుకోవడం మహిళాశక్తిగా మారేందుకు బలమైన మార్గమని నూయి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి మహిళలు వ్యక్తిగత జీవితంలో ఎంతో సమర్థవంతంగా నెగ్గుకు వస్తారన్నారు. కుమార్తెగానూ, భార్యగానూ, తల్లిగానూ, కోడలుగానూ ఎన్నో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని అదే సమయంలో బిడ్డలకు జన్మనివ్వడం, పిల్లల సంరక్షణ, తల్లిదండ్రుల బాధ్యతలతో పాటు వృత్తి నిర్వహణలోనూ ముందుంటున్నారన్నారు. అటువంటి మహిళలకు సంఘాలు, ప్రభుత్వాలు, సంస్థలు ఎటువంటి గుర్తింపును, గౌరవాన్ని ఇస్తున్నాయో ఓసారి ఆలోచించాల్సిన అవసరం కూడ ఉందని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త నూయి ప్రశ్నించారు. -
భార్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొని భర్త మృతి
►రెండు బైక్‌లు ఢీ: రోడ్డుపై పడిపోయిన వ్యక్తి... ►ఆయన పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం ►తండ్రి మృతి...కూతుళ్లకు తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందగా, కుమార్తెలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన బుర్ర జగన్(35) సోమవారం రాత్రి తన కుమార్తెలు స్వీటీ(11), క్రేజీ(3)లతో కలిసి బైక్(29 బీజీ 5802)పై యాచారం వస్తున్నాడు. ఆయన భార్య వెనుక నుంచి బస్సులో వస్తోంది. మంచాల మండలం లోయపల్లికి మల్లేష్ ఎదురుగా వస్తున్నాడు. ఈక్రమంలో ఖానాపూర్ స్టేజీ సమీపంలో వీరి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పైనుంచి రోడ్డుపై పడిపోయిన జగన్ పైకి లేచేందుకు యత్నిస్తున్నాడు. అంతలోనే ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు(ఏపీ29జడ్2589) ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వీటీ, క్రేజీ, మల్లేష్‌లను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులోనే జగన్ భార్య కూడా ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.