'అలా పిలిస్తే నాకు అసహ్యం!' | I hate being called 'sweetie' or 'honey' | Sakshi
Sakshi News home page

'అలా పిలిస్తే నాకు అసహ్యం!'

Published Sat, Apr 9 2016 2:21 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

'అలా పిలిస్తే నాకు అసహ్యం!'

'అలా పిలిస్తే నాకు అసహ్యం!'

న్యూయార్క్: సమాజంలోనూ, కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన గౌరవం అందించడంపై... వ్యాపార రంగంలో వెలుగొందుతున్న మహిళా శక్తి, ప్రవాస భారతీయురాలు, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి తన అభిప్రాయాలను విస్పష్టంగా వెలిబుచ్చారు. మహిళలకు సమాన హోదా అందిచాలన్నా, సమాన గౌరవం కల్పించాలన్నా తోటివారు స్వీటీ, హనీ అంటూ సంబోధించడం సరికాదని, అలా పిలవడాన్ని తాను ద్వేషిస్తానని ఆమె తెగేసి చెప్పారు.  కార్యాలయాల్లో ఎవరైనా సరే సాటి మహిళను ముద్దు పేర్లతో పిలిచే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేందుకు ప్రయత్నించాలంటూ న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ సమావేశంలో నూయి మనసులోని మాటను స్పష్టం చేశారు.

ఏళ్ళ తరబడి మహిళలు సమాన హక్కులకోసం పోరాడుతూనే ఉన్నారని, ముఖ్యంగా కార్యాలయాల స్థాయిలో సమాన గౌరవాన్ని అందుకొనేందుకు వారు పాఠశాల స్థాయి నుంచే మగవారికి దీటుగా అన్ని హక్కుల్లోనూ పోటీ పడాలని, మంచి స్థాయిని సంపాదించాలని అన్నారు. అప్పుడే కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని రాణించవచ్చని, అత్యంత గౌరవాన్ని పొందవచ్చని సూచించారు.  అలా కాకుండా మనం నేటికీ సమాన గౌరవం, సమాన హక్కులకోసం పోరాడుతూనే ఉన్నామన్నారు.

ముఖ్యంగా మహిళలు పనిచేసే చోట ఒకరికి ఒకరు సహకరించుకోవడం కనిపించదని, ఒకరిపట్ట ఒకరు సోదరి భావం కలిగి ఉండటం ఎంతో అవసరమని, అదే మరింత బలాన్ని ఇస్తుందని నూయి తెలిపారు. ఓ మహిళ గురించి మరో మహిళ చెబితే మనం పెద్దగా పట్టించుకోమని, అదే విషయాన్ని ఓ పురుషుడు చెప్పినప్పుడు నమ్మేందుకు సిద్ధంగా ఉంటామని, అటువంటి మనస్తత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరి సలహాలు మరొకరు తీసుకోవడం మహిళాశక్తిగా మారేందుకు బలమైన మార్గమని నూయి అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి మహిళలు వ్యక్తిగత జీవితంలో ఎంతో సమర్థవంతంగా నెగ్గుకు వస్తారన్నారు.  కుమార్తెగానూ, భార్యగానూ, తల్లిగానూ, కోడలుగానూ  ఎన్నో ముఖ్యమైన పాత్రలు  పోషిస్తారని  అదే సమయంలో బిడ్డలకు జన్మనివ్వడం, పిల్లల సంరక్షణ, తల్లిదండ్రుల బాధ్యతలతో పాటు వృత్తి నిర్వహణలోనూ ముందుంటున్నారన్నారు. అటువంటి మహిళలకు సంఘాలు, ప్రభుత్వాలు, సంస్థలు ఎటువంటి గుర్తింపును, గౌరవాన్ని ఇస్తున్నాయో ఓసారి ఆలోచించాల్సిన అవసరం కూడ ఉందని  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త నూయి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement