
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటి బూరా (Saweety Boora) వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త, భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా (Deepak Hooda), అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటి కేసు పెట్టింది. సవీటి ఫిర్యాదు మేరకు హిస్సార్‌లోని (హర్యానా) ఓ పోలీస్ స్టేషన్‌లో దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
దీపక్ హుడా అదనపు కట్నంతో పాటు ఓ ఫార్చూనర్ కార్ డిమాండ్ చేస్తున్నాడని సవీటి తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీపక్ హుడాకు రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన పోలీసులు వెల్లడించారు. దీపక్ హుడాపై అదనపు కట్నం వేధింపులు, హింసించడం మరియు దాడి చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పోలీసులు వివరించారు.
పోలీసుల వాదనపై హుడాను జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ కారణంగానే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయానని అన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. త్వరలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని అన్నాడు. ఈ సందర్భంగా హుడా తన భార్య సవీటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆమెను కలవడానికి నాకు అనుమతి లేదని అన్నాడు.
కాగా, సవీటి బూరా-దీపక్ హుడాల వివాహం 2022లో జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రోహ్‌తక్ జిల్లాలోని మెహమ్ నియోజకవర్గం నుంచి హుడా పోటీ చేశారు. హుడా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు.
32 ఏళ్ల సవీటి 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో ఆమె భర్తతో కలిసి భాజపాలో చేరింది. గత నెలలోనే సవీటి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment