Women boxing
-
ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!
ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో జెండర్ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)తో జరిగిన పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్, ఇటలీ బాక్సర్ ఏంజిలా కారిని బౌట్ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని ఖాలీఫ్కు మద్దతు పలికారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్ పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్‌రాజన్‌ను ఇండియాలో వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇమానే చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు.కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 సెకన్ల స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.Imane Khelif is BORN WOMAN. She is NOT a man. *The right to change their gender is illegal and banned in Algeria, the country she represents.*Indians have harassed and harangued Shanthi Soundarrajan, a brilliant sportswoman, just because she didn’t look the way they expect a… pic.twitter.com/JzYvTNgTVV— Chinmayi Sripaada (@Chinmayi) August 2, 2024 గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్‌పై లింగ ఆరోపణలు వచ్చాయి. 2023 చాంపియన్‌షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్‌వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్‌పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో అనుమతినిన్చినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మహిళా బాక్సర్లు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.🇮🇹🇩🇿 Angela Carini from Italy in blue realizes she doesn’t want to fight a man and pulls out mid fight against the trans from Algeria in red at the Olympics.The "fight" lasted less than a minute.Cruel pic.twitter.com/VMksyAAbsx— Lord Bebo (@MyLordBebo) August 1, 2024 -
నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదిరింది..
తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందని ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వలేదు. తొలి బౌట్‌లోనే ఆధిపత్యం చూపించిన నిఖత్ ఇస్మయిలోవా మొహంపై పంచ్‌లతో అటాక్ చేసింది. అయితే రిఫరీ అడ్డుకొని ఆర్ఎస్సీ(Referee Stops Contest) కింద నిఖత్ గెలిచినట్లు ప్రకటించాడు. ఇక నిఖత్ జరీన్ రౌండ్ ఆఫ్ 32లో ఆఫ్రికాకు చెందిన రౌమైసా బౌలమ్ను ఎదుర్కోనుంది. మరోవైపు సాక్షికూడా కొలంబియాకు చెందిన జోస్ మారియాను 5-0తో చిత్తు చేసింది. #IND's🇮🇳 @nikhat_zareen starts off her campaign in style at IBA Women's World Boxing Championships 2023 🥊#WorldChampionships #Boxing pic.twitter.com/srfduaVL88 — Doordarshan Sports (@ddsportschannel) March 16, 2023 -
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
నాన్న, నేను, ఒలింపిక్ పతకం...
అమ్మాయికి ఆటలు ఎందుకని నాన్న ఏనాడూ అడ్డు చెప్పలేదు... బాక్సింగ్ లాంటి ప్రమాదకర క్రీడ ఎంచుకోవడం ఎందుకని నాన్న అభ్యంతర పెట్టలేదు... ఆర్థిక స్థితి అంతంత మాత్రమే, ఆడించడం కష్టం అంటూ అర్ధాంతరంగా తప్పుకోమని నాన్న ఆపలేదు... బౌట్లు, కేటగిరీలు, పంచ్‌ల గురించి తెలియకపోయినా దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవం అనే విషయం మాత్రం నాన్నకు బాగా తెలుసు... అందుకే తన కూతురు ఒలింపిక్స్‌లో బరిలోకి దిగితే చాలనేది మాత్రం ఆ నాన్న కల... సరిగ్గా రెండేళ్ల క్రితం లవ్లీనా చెప్పిన మాటలు ఇవి! అదే లక్ష్యంగా కష్టపడుతున్నానన్న లవ్లీనా ఇప్పుడు నాన్న చిరు కోరికను తీర్చడంతోనే సరి పెట్టలేదు. ఏకంగా పతకం సాధించి అంతకంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని పంచింది. సాక్షి క్రీడా విభాగం సరదాగా ప్రారంభించిన కిక్ బాక్సింగ్/మువతాయ్ నుంచి సీరియస్ బాక్సింగ్‌కు మళ్లాలనే నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడం వల్లే లవ్లీనా కెరీర్ మలుపు తిరిగింది. కవలలైన ఆమె ఇద్దరు అక్కలు లిచా, లిమా కిక్ బాక్సింగ్ ఆడేవారు. ఏడాదిపాటు లవ్లీనా కూడా అదే బాటలో నడిచింది. కానీ ఆ ఆటకు తగిన గుర్తింపు లేదని, భవిష్యత్తూ ఉండదని ఆమెకు తెలిసొచ్చింది. అస్సాం రాష్ట్రం, గోలాఘాట్ జిల్లా సమీపంలోని బారోముఖియా ఆమె స్వస్థలం. ప్రతిభాన్వేషణలో భాగంగా అస్సాంలోని వివిధ ప్రాంతా లకు వెళ్లిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ పదమ్ బోరో దృష్టిలో పడటం లవ్లీనా కెరీర్‌కు నాంది పలికింది. ఆమెలో ప్రతిభను గుర్తించిన పదమ్, బాక్సింగ్‌కు సరిగ్గా సరిపోతుందని భావించి గువహటి అకాడమీలో శిక్షణకు ఎంపిక చేశారు. ఆ తర్వాత లవ్లీనా వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. బాక్సింగ్‌లో తన ప్రతిభకు పదును పెడుతూ వరుస విజయాలతో ఆమె జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌గా కూడా నిలిచింది. 2016లో భారత సీనియర్ టీమ్ శిక్షణా శిబిరంలోకి వచ్చాక లవ్లీనాకు తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. గతంలో మిడిల్ వెయిట్ కేటగిరీలో తలపడిన ఆమె... ఒలింపిక్స్‌లో తొలిసారి వెల్టర్ వెయిట్‌ను చేర్చడంతో అందుకోసమే సాధన చేసింది. ఈ కేటగిరీ లో సరైన ప్రాక్టీస్ పార్ట్నర్లు లభించకపోయి నా... మరో విభాగానికి చెందిన సీనియర్ సరితా దేవితో పోటీ పడుతూ సాధన కొనసాగించింది. అమ్మ అనారోగ్యం... కరోనా... జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో రాణించి గత ఏడాదే లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అనంతరం లాక్డౌన్ సమయమంతా సొంత ఊరిలోనే గడిపింది. అనంతరం మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి వచ్చేసింది. అప్పటి వరకు అంతా బాగుంది. అయితే గత ఫిబ్రవరిలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తల్లి మమోని చెంతన ఉండేందుకు పది రోజులు మళ్లీ ఇంటికి వచ్చింది. ఇంట్లో పరిస్థితి చక్కబడినా... తిరిగి పటియాలా చేరుకున్న తర్వాత ఆమె కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇది లవ్లీనాకు బాగా నష్టం కలిగించింది. ఒలింపిక్స్ సన్నద్ధమయ్యే క్రమంలో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కరోనా నుంచి కోలుకోవడం ఒకవైపు... ఆపై ప్రాక్టీస్ కొనసాగించడం మరోవైపు... ఈ కఠిన సమయాన్ని లవ్లీనా పట్టుదలతో అధిగమించింది. ఇప్పుడు ఆమె విజయం చూస్తున్న తండ్రి టికెన్ బొర్గోహైన్ ఆనందానికి అవధులు లేవు. ఎన్నో ఇబ్బందులను దాటిన తర్వాత తన కూతురు తీసుకువస్తున్న ఒలింపిక్ పతకాన్ని చూసేందుకు ఆ నాన్న వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు! -
TOKYO OLYMPICS: ‘లవ్లీ’ పంచ్
లవ్లీనా బొర్గొహైన్... ఈ పేరు భారత క్రీడాభిమాని ఇక ఎప్పటికీ మరచిపోలేడు. టోక్యో ఒలింపిక్స్‌లో ‘పంచ్ పవర్’ తగ్గుతూ ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ నేనున్నానంటూ లవ్లీనా తన పదును చూపించింది. అద్భుతమైన ఆటతో చెలరేగి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది. ఒకవేళ ఓడినా... కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 2012లో మేరీకోమ్, విజేందర్ సింగ్‌ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. టోక్యో: 2020 ఒలింపిక్స్‌లో మరో మహిళ భారత్ ఖాతాలో పతకాన్ని చేర్చింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ (69 కేజీల విభాగం)లో లవ్లీనా బొర్గొహైన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 4–1 తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ నీన్–చిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత బాక్సర్... చివరి మూడు నిమిషాల్లో సమర్థవంతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని నిరోధించి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో చెన్ చిన్ చేతిలో ఓడిన లవ్లీనా ఈసారి ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్లో ముగ్గురు జడ్జీలు భారత బాక్సర్‌కు 10 పాయింట్లు ఇవ్వగా, రెండో రౌండ్లో ఆమె జోరుకు ఐదుగురూ 10 పాయింట్ల చొప్పున అందజేయడం విశేషం. మూడో రౌండ్లోనూ నలుగురు జడ్జీలు లవ్లీనాకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఈ అస్సాం బాక్సర్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకుంటూ ఒలింపిక్ పతకంతో మెరిసింది. ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో ఆమె ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలీ (టర్కీ)తో తలపడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే ఒలింపిక్ చరిత్రలో భారత బాక్సింగ్ ఘనత కూడా కాంస్యాన్ని (మేరీకోమ్, విజేందర్) దాటి మరింత మెరుగైన స్థితికి చేరుతుంది. తాను గెలిచినట్లు రిఫరీ ప్రకటించగానే ఆనందం పట్టలేక 23 ఏళ్ల లవ్లీనా స్టేడియం దద్దరిల్లేలా గట్టిగా అరిచేసింది! సిమ్రన్‌జిత్‌కు నిరాశ... 60 కేజీల విభాగంలో తలపడిన మరో భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ ఓటమితో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. థాయ్‌లాండ్‌కు చెందిన సుదపొర్న్ సిసొండీ 5–0తో సిమ్రన్ను చిత్తు చేసింది. థాయ్‌లాండ్ బాక్సర్ ఆరంభం నుంచి చివరి వరకు సిమ్రన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఆమె ‘లెఫ్ట్ హుక్’లకు సిమ్రన్ వద్ద జవాబు లేకపోయింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు ప్రతీసారి సుదపొర్న్కు పర్ఫెక్ట్ ‘10’ పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇద్దరికీ కాంస్యం ఎందుకు? ఒలింపిక్స్‌లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోరు జరుగుతుంది. సెమీస్‌లో ఓడిన ఇద్దరు కంచు పతకం కోసం ఆడాల్సి ఉంటుంది. అయితే బాక్సింగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నం. సెమీఫైనల్ చేరిన ఇద్దరికీ మరో మ్యాచ్ లేకుండా పతకం ఖాయమవుతుంది. సాధారణంగా సెమీస్‌లో ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు. వారు సాధారణ స్థితికి వచ్చి తక్కువ సమయంలో మళ్లీ బరిలోకి దిగడం చాలా కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే కాంస్యం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఆడితే ఇద్దరికీ ప్రమాదం జరగవచ్చు కాబట్టి మూడో స్థానం మ్యాచ్‌ను రద్దు చేసి ఇద్దరికీ పతకాలు ఇస్తున్నారు. సెమీస్‌లో ఓడిన ప్రతీ బాక్సర్ సమస్య ఎదుర్కోవాలని లేదు కానీ ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు రాకుండా ముందు జాగ్రత్త అని చెప్పవచ్చు! ఆమె చేతిలో నేను గతంలో నాలుగుసార్లు ఓడాను. ఇప్పుడు మాత్రం బెదరకుండా దూకుడుగా పంచ్‌లు విసరాలని నిర్ణయించుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి వంద శాతం నా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాను. సరిగ్గా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించిది. ఆమె గురించి బాగా తెలుసు కాబట్టి కొత్తగా ప్రణాళిక, వ్యూహం అవసరమే రాలేదు. సెమీస్ పోరుకు తగినంత సమయం ఉంది కాబట్టి వీడియో ద్వారా ప్రత్యర్థి బలాబలాలు తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిస్తా. గతంలో రింగ్‌లో దిగేటప్పుడు కొంత భయం వేసేది. ఇప్పుడు అది దూరం కావడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నాలుగు నెలల క్రితం వరకు కూడా మెడిటేషన్ చేసేదాన్ని కానీ... బాక్సింగ్‌లాంటి క్రీడలో ప్రశాంతంగా ఉండలేం. అనుకోకుండానే ఆవేశాన్ని ప్రదర్శిస్తాం. తాజా ఘనత గురించి ఇప్పుడే వివరంగా మాట్లాడలేను. ఇంకా ఆట మిగిలి ఉంది కదా. –లవ్లీనా బొర్గొహైన్ -
అంతా ‘బేబీ’ బాక్సర్లే.. భారత్ మొదటి స్థానం
భారత యువ మహిళా బాక్సింగ్ జట్టు తాజా విజయ దరహాసం వెనుక గల అసమాన శక్తి సామర్థ్యాల ఈ విశేషాన్ని బేబీరోజిసాన ఛానుతో మొదలుపెట్టడమే సబబు. యూత్ టోర్నిలో ఈ బేబీ బాక్సర్ బంగారు పతకాన్ని సాధించింది. జట్టులో మొత్తం పది మంది యువతులు ఉండగా మాంటెనెగ్రోలో జరిగిన ఈ యూత్ టోర్నీలో భారత్‌కు పది పతకాలు వచ్చాయి! ఐదు స్వర్ణాలు, మూడు రజితాలు, రెండు కాంస్యాలు. బంగారు పతకాల పట్టికలో కూడా వీరు భారత్‌ను మొదటి స్థానంలో నిలబెట్టారు. రెండు పతకాలతో ఉజ్బెకిస్థాన్, ఒక పతకంతో చెక్ రిపబ్లిక్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐరోపాలోని బాల్కన్ ప్రాంత దేశం అయిన మాంటెనెగ్రో ఆడ్రియాటిక్ సముద్రతీరం వెంబడి ఎగుడుదిగుడు పర్వతాలతో నిండి ఉంటుంది. అక్కడి బుద్వా నగరంలో జరిగిన 30వ ఆడ్రియాటిక్ పెర్ల్ టోర్నమెంట్‌లోనే భారత్ మహిళలు ఈ ఘన విజయాన్ని సాధించుకుని వచ్చారు. అంతా ‘బేబీ’ బాక్సర్లే. బరిలో మాత్రం ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. ఆదివారం టోర్నీ ముగిసింది. యువ బాక్సర్లు పది పతకాలతో వస్తున్నారని తెలియగానే భారత్‌లోని ప్రొఫెషనల్ ఉమెన్ బాక్సర్ల ముఖాలు వెలిగిపోయాయి. బేబీ ఛాను శిక్షణ పొందింది ఇంఫాల్‌లోని మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలోనే! ఆ శిక్షణ ఏ స్థాయిలో ఉందో ఆషియన్ జూనియర్ ఛాంపియన్ సబీనా బొబొకులోవా (ఉజ్బెకిస్తాన్) ను 3–2 తేడాతో ఆమె నాకౌట్ చేసినప్పుడు ప్రత్యర్థి జట్లు కనిపెట్టే ఉంటాయి. మరొక బంగారు పతకం అరుధంతీ చౌదరి సాధించినది. మూడుసార్లు ‘ఖేలో ఇండియా’ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఈ బాక్సింగ్ ఛాంపియన్ ఉక్రెయిన్ బాక్సర్ మార్యానా స్టోయికోను 5–0 తో ఓడించింది. మిగతా మూడు బంగారు పతకాలు అల్ఫియా పఠాన్, వింకా, సనమచ ఛాను సాధించినవి. బెస్ట్ ఉమెన్ బాక్సర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు కూడా మన యువ జట్టుకే దక్కింది. ఆ అవార్డు విజేత వింకా! అబ్బాయిల్ని అనడం కాదు కానీ మన పురుషుల జట్టుకు రెండు మాత్రమే బంగారు పతకాలు సాధ్యం అయ్యాయి. చదవండి: 'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను' -
నాలుగు పతకాలు ఖాయం
చెన్నై: మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఏకంగా నలుగురు సెమీస్ చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల 69 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (భారత్) 5–0తో అనస్తాసియ సిగెవ (రష్యా)పై విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో పూజా రాణి (భారత్) 4–1తో లారా మమెద్కులోవ (రష్యా)పై గెలిచి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదే విధంగా మహిళల క్వార్టర్స్‌లో నీరజ్ (57 కేజీలు) 4–1తో సయాన సగతేవ (రష్యా)పై గెలవగా... జాని (60 కేజీలు) 5–0తో అనస్తాసియ ఒబుషెంకోవ (బెలారస్)ను ఓడించి సెమీస్ చేరింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత పింకీ జాంగ్రా (51 కేజీలు)కు మాత్రం క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఆమె 0–5తో యులియా అపనసోవిచ్ (బెలారస్) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ గేమ్ పసిడి పతక విజేత గౌరవ్ సొలంకీ (56 కేజీలు), గోవింద్ సహాని (49 కేజీలు), సంజిత్ (91 కేజీలు),అభిషేక్ (52 కేజీలు) క్వార్టర్స్ చేరారు. -
పంచ్ అదిరింది
మహిళల బాక్సింగ్ 48 కేజీల విభాగంలో మేరీకోమ్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్ క్వార్టర్ ఫైనల్లో 5–0తో మెగాన్ గార్డన్ (స్కాట్లాండ్)ను ఓడించింది. 69 కేజీల క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ (భారత్) 2–3తో స్యాండీ రియాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 75 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో వికాస్ కృషన్ 5–0తో సోమర్విల్లె క్యాంప్‌బెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. -
ప్రతీ పతకానికి ఓ కథ
మణిపూర్ మణిహారం మేరీకోమ్. మహిళల బాక్సింగ్‌లో ఆమెవన్నీ చాంపియన్ ముద్రలే! ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు సార్లు విజేత. ఒలింపిక్స్‌లో కాంస్యం. తాజాగా ఐదోసారి ఆసియా చాంపియన్. దేశంలో ఓ మూలన ఉన్నట్టుండే రాష్ట్రం... సదుపాయాలేవీ లేని నేపథ్యం... ఇవన్నీ ఈ చాంపియన్బాక్సర్ను ఎక్కడా ఆపలేదు. ముగ్గురు పిల్లలకు తల్లయినా సరే! ఆమె పంచ్‌లకు పసిడి పతకాలు చేజిక్కాల్సిందే. న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ మేరీకోమ్ తాను సాధించిన ప్రతీ పతకం వెనుక ఓ పోరాటముందని చెప్పింది. తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌లో మరోసారి విజేతగా నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో ఆమెకిది ఐదో స్వర్ణం. ఈ ఘనత సాధించిన తొలి బాక్సర్‌గా ఆమె రికార్డులకెక్కింది. తన సుదీర్ఘ ప్రయాణంపై 35 ఏళ్ల మేరీ చెప్పిన విశేషాలివి... ఈ విజయం మరెంతో ప్రత్యేకం... నేను సాధించిన మిగతా మెడల్స్లాగే ఈ పతకం కూడా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను ప్రతీ పతకం కోసం ఎంతో ఆరాటపడ్డాను. మరెంతో పోరాడాను. అలా ఒక్కో పతకం వెనుక విశ్రమించని కథ ఉంది. నేను ఎంపీనయ్యాక (రాజ్యసభ) సాధించిన ఈ పతకం నాకు మరింత గుర్తింపును ఇచ్చింది. దీంతో నా హోదా కూడా పెరుగుతుందని భావిస్తున్నా. పోటీలు అప్పట్లా లేవ్... ప్రపంచంలో ఏ చాంపియన్‌షిప్ కూడా ఆషామాషీగా సాగడం లేదు. బౌట్లలో పోటీ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీనికి తగ్గట్లే నేనూ సన్నద్ధమవుతున్నా. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన 48 కేజీ కేటగిరీలోకి మళ్లీ వచ్చేశా. ఇంతకుముందు పోటీపడిన 51 కేజీ విభాగాన్ని బరువుగా భావించడం లేదు. అందులోనూ పతకాలు గెలిచాను. కానీ... 48 కేజీ కేటగిరీ నాకు అతికినట్లు సరిపోతుంది. తదుపరి లక్ష్యం ‘కామన్వెల్త్’... వచ్చే ఏడాది జరిగే గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్నా. సుదీర్ఘ కాలంగా బాక్సింగ్‌లో కొనసాగుతున్న నాకు ఇప్పటివరకైతే ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. పెద్దపెద్ద గాయాలు కాలేదు. ఇందుకు దేవుడికి థ్యాంక్స్. నా ఫిట్నెసే నా బలం. నేను క్రియాశీలక ఎంపీని... నేను పేరుకు మాత్రమే ఎంపీని కాదు. క్రియాశీలక పార్లమెంట్ సభ్యురాలిని. రెగ్యులర్‌గా రాజ్యసభకు హాజరవుతా. అలాగే నా బాక్సింగ్ ప్రాక్టీస్‌నూ కొనసాగిస్తా. బాధ్యతాయుత పదవిలో ఉన్న నేను ప్రభుత్వ పర్యవేక్షకురాలిగా క్రీడా ఈవెంట్లకు వెళ్తుంటా. ఇంతటి గురుతర బాధ్యతల కోసంఎంత కష్టపడుతున్నానో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. అన్ని పాత్రలకు న్యాయం చేస్తున్నా... ఎంపీగా సభకు వెళతా. బాక్సింగ్ గ్లౌవ్స్‌తో ప్రాక్టీస్‌కు వెళతా. తల్లిగా నా ముగ్గురు కుమారుల ఆలనాపాలనా చూస్తా. అకాడమీని నడిపిస్తున్నా... ఇలా చెబుతుంటే గారడిగానే ఉన్నా అన్ని పాత్రలకి న్యాయం చేస్తున్నా. ఇవన్నీ పరిమిత సమయపాల నలో క్లిష్టమే కానీ... చేయడం నాకు ఇష్టమే! అదే పనిగా ప్రయాణాలు... అయినా ఓకే ఆసియా చాంపియన్‌షిప్ ముగిసింది. ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని లుసానేకు బయల్దేరాల్సి ఉంది. అక్కడ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరమ్‌లో పాల్గొనాలి. ప్రయాణాలు చికాకు అనిపించినా...బాధ్యతలకు సిద్ధమైనప్పుడు నిబద్ధతతో పనిచేయాలి. -
జీవితంతో బాక్సింగ్
విజయం: మహిళలకు బాక్సింగ్ అంటేనే నవ్విపోయే పరిస్థితుల్లో.. కనీసం చేతులకు గ్లవ్స్ కూడా కొనుక్కోలేని పేదరికం నుంచి వచ్చిన ఓ అమ్మాయి వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అమ్మా నాన్నలకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో బాక్సింగ్‌ను ఎంచుకున్నా.. కఠోర శ్రమ, పట్టుదలతో అటు ప్రత్యర్థులతోపాటు ఇటు జీవితంతోనూ తలపడి గెలిచింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా బాక్సింగ్ రింగ్‌లో విజయాల పంచ్‌లు కురిపించి మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ కామ్. దేశం గర్వించదగ్గ ఈ క్రీడారత్నం జీవితకథ త్వరలో సినిమా రూపంలో మన ముందుకు రానుంది. మణిపూర్ రాష్ట్రంలోని చురాచంద్పూర్ జిల్లాలో కంగ్తయ్ అనే మారుమూల గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో 1983 మార్చి 1వ తేదీన జన్మించింది మేరీ కామ్. తండ్రి మాంగ్తే తోన్పాకామ్, తల్లి మాంగ్తే అఖమ్ కామ్లు అడవుల్లో చెట్లను నరికి, కాల్చివేసి వ్యవసాయ భూమిని తయారు చేసే పని (ఝమ్ కల్టివేషన్)లో దినసరి కూలీలు. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి తానూ పనికి వెళ్లిన మేరీ.. తమ కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయేది. దీంతో ఎలాగైనా వారికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో క్రీడల్లో అడుగుపెట్టింది. ఆరంభంలో అథ్లెటిక్స్‌పై ఆసక్తి కనబరిచినా.. తమ రాష్ట్రానికే చెందిన డింకోసింగ్.. 1998లో ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించడం చూసి మేరీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎవరి మద్దతూ లేకపోయినా.. బాక్సింగ్ క్రీడ మగవాళ్లకు మాత్రమేనన్న అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో.. ఏ ఒక్కరూ మద్దతుగా నిలవకపోయినా బాక్సర్‌ను కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు మేరీ కామ్. బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌లు కురిపించే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు సర్దిచెబుతూ.. శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించిన కోచ్‌ను ఒప్పిస్తూ తొలి అడుగులు వేసింది. కోచ్ ఇంబోచా సింగ్ వద్ద అంతా అబ్బాయిలే శిక్షణ తీసుకుంటున్నా.. వెరవకుండా వారితో కలిసే మెళకువలు నేర్చుకుంది. మణిపూర్ రాష్ట్ర కోచ్ ఎం.నర్జిత్సింగ్ వద్ద శిక్షణతో రాటుదేలి 2000 సంవత్సరంలో.. పాల్గొన్న తొలిసారే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో గర్వంతో పొంగిపోయిన తండ్రి.. భుజం తట్టగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగింది మేరీ. ‘చెన్నై’తో మొదలు... 2001 ఫిబ్రవరిలో చెన్నైలో జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కామ్.. తన జైత్రయాత్రను ఏడాదంతా కొనసాగించింది. 18 ఏళ్ల వయసులోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో మహిళలకు తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పాల్గొని రజతం గెలిచింది. 2002లో టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆ తరువాత 2005, 2006, 2008, 2010లలో జరిగిన ప్రపంచకప్‌లలో వరుసగా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2006 ప్రపంచకప్ తరువాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన మేరీ.. మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతూనే చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచింది. దృఢచిత్తం ఉండాలి... బాక్సర్‌గా సక్సెస్ కావాలంటే శారీరకంగా బలంగా ఉండటమొక్కటే సరిపోదు. గెలిచి తీరాలన్న పట్టుదల, వెనకడుగు వేయరాదన్న ధృడచిత్తం అవసరం. మహిళలు బాక్సింగ్‌లో రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా శ్రమించాల్సివుంటుంది.కెరీర్లో ఎక్కువసార్లు నాకన్నా ఎత్తుగా, బలంగా ఉన్న ప్రత్యర్థుల్నే ఎదుర్కొన్నాను. కానీ, నా తక్కువ ఎత్తునే అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థికి అందకుండా తప్పించుకుంటాను. రింగ్‌లో వారిని ఎక్కువగా పరిగెట్టిస్తూ.. అలసటకు గురిచేస్తాను. ఆ తరువాత నా పంచ్‌ల రుచి చూపించి పడగొడతుంటాను. -మేరీ కామ్ ప్రతికూలతల్ని దాటి... ప్రతి క్రీడాకారుడికీ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమన్నది ఓ స్వప్నం. ఐదుసార్లు విజేతగా నిలిచినా.. విశ్వ క్రీడల్లో పాల్గొనలేకపోయానన్న బాధ మేరీ కామ్‌ను వేధిస్తుండేది. అయితే 2012లో లండన్ ఒలింపిక్స్‌లో దాన్ని చేర్చడంతో మేరీకి ఆ అవకాశం రానే వచ్చింది. కానీ, కనీసం 51 కేజీల నుంచి మూడు కేటగిరీలకు మాత్రమే చోటు కల్పించారు. దీనికి తగ్గట్టుగానే ఏఐబీఏ కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మహిళలకు ఈ మూడు కేటగిరీల్లోనే పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకునేందుకు మేరీ అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటిదాకా 45, 46 కేజీల కేటగిరీల్లో పోటీపడుతూ వచ్చిన మేరీ కామ్.. 51 కేజీలకు మారాల్సి వచ్చింది. దీంతో మహిళల ప్రపంచకప్‌లో తొలిసారిగా 2012లో మేరీ.. సెమీఫైనల్లో బ్రిటన్‌కు చెందిన నికోలా ఆడమ్స్ చేతిలో ఓటమిపాలైంది. కానీ, ఒలింపిక్స్ బెర్తును మాత్రం దక్కించుకోగలిగింది. ఫలించిన కల... బాక్సింగ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి మేరీ కామ్ కన్న కల నిజమయ్యే రోజు వచ్చింది. ఉద్విగ్నభరిత క్షణాల మధ్య లండన్ ఒలింపిక్స్‌లో తొలిరౌండ్ కోసం రింగ్‌లో అడుగు పెట్టిన మేరీ.. బెబ్బులిలా విజృంభించింది. కరోలినా మిచల్చుక్ (పోలండ్)ను అలవోకగా ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో మరోవా రహాలి (టునిషియా)నూ మట్టికరిపించింది. అయితే సెమీ ఫైనల్లో మళ్లీ నికోలా ఆడమ్స్ (బ్రిటన్) ఎదురైంది. ఆమెతో తీవ్రంగా పోరాడిన మేరీ..చివరకు 6-11తో ఓటమిపాలైంది. కానీ, మూడోస్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకాన్ని దక్కించుకుని సగర్వంగా నిలిచింది. లండన్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి.. భారత మహిళలందరికీ స్ఫూర్తిప్రదాత అయింది. పద్మభూషణ్ ‘మేరీ’... ఒలింపిక్ పతకం సాధించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మేరీ కామ్‌ను భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందు 2010లోనే పద్మశ్రీ అవార్డునందించింది. దీంతోపాటు 2009లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, 2003లో అర్జున అవార్డుల్ని మేరీ కామ్ అందుకుంది. వెండితెరపై ‘మేరీ కామ్’ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన మేరీ కామ్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. మేరీ కామ్ పాత్రను పోషిస్తుండగా ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లామర్ క్వీన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక ఈ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని మేరీ కామ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది. చిత్రం ప్రివ్యూను ఇప్పటికే వీక్షించిన మేరీ కామ్.. ప్రియాంక నటనను చూసి చలించిపోయింది. భాగ్ మిల్కా భాగ్ వంటి సూపర్‌హిట్ తరువాత వస్తున్న క్రీడా నేపథ్య చిత్రంగా ‘మేరీ కామ్’ కోసం అటు సినీ, ఇటు క్రీడాభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. అతనే లేకపోతే... తాను సాధించిన విజయాల వెనుక తన తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో.. భర్త ఓన్లర్ కామ్ ప్రోత్సాహమూ అంతే ఉందంటుంది మేరీ కామ్. 2001లో పంజాబ్‌లో జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో మేరీకి పరచయమయ్యాడు ఓన్లర్. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ కోర్సు చదువుతున్న ఓన్లర్‌తో నాలుగేళ్ల ప్రేమ తరువాత 2005లో వివాహం జరిగింది. అతడు తనను చక్కగా అర్థం చేసుకొని ప్రోత్సహించాడని, తాను బాక్సింగ్ టోర్నీలతో బిజీగా గడుపుతుంటే ఇద్దరు పిల్లల్ని అన్నీ తానై చూసుకున్నాడని చెబుతుంది. అతనే లేకపోతే.. బాక్సర్‌గా తాను ఈ స్థాయికి చేరడం కష్టమయ్యేదేమో అంటుంది. అన్నట్టు.. మేరీకి ఇటీవలే మూడో బాబు పుట్టాడు! - శ్యామ్ కంచర్ల