
మణిపూర్ మణిహారం మేరీకోమ్. మహిళల బాక్సింగ్‌లో ఆమెవన్నీ చాంపియన్ ముద్రలే! ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు సార్లు విజేత. ఒలింపిక్స్‌లో కాంస్యం. తాజాగా ఐదోసారి ఆసియా చాంపియన్. దేశంలో ఓ మూలన ఉన్నట్టుండే రాష్ట్రం... సదుపాయాలేవీ లేని నేపథ్యం... ఇవన్నీ ఈ చాంపియన్‌బాక్సర్‌ను ఎక్కడా ఆపలేదు. ముగ్గురు పిల్లలకు తల్లయినా సరే! ఆమె పంచ్‌లకు పసిడి పతకాలు చేజిక్కాల్సిందే.
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ మేరీకోమ్ తాను సాధించిన ప్రతీ పతకం వెనుక ఓ పోరాటముందని చెప్పింది. తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌లో మరోసారి విజేతగా నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో ఆమెకిది ఐదో స్వర్ణం. ఈ ఘనత సాధించిన తొలి బాక్సర్‌గా ఆమె రికార్డులకెక్కింది. తన సుదీర్ఘ ప్రయాణంపై 35 ఏళ్ల మేరీ చెప్పిన విశేషాలివి...
ఈ విజయం మరెంతో ప్రత్యేకం...
నేను సాధించిన మిగతా మెడల్స్‌లాగే ఈ పతకం కూడా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను ప్రతీ పతకం కోసం ఎంతో ఆరాటపడ్డాను. మరెంతో పోరాడాను. అలా ఒక్కో పతకం వెనుక విశ్రమించని కథ ఉంది. నేను ఎంపీనయ్యాక (రాజ్యసభ) సాధించిన ఈ పతకం నాకు మరింత గుర్తింపును ఇచ్చింది. దీంతో నా హోదా కూడా పెరుగుతుందని భావిస్తున్నా.
పోటీలు అప్పట్లా లేవ్...
ప్రపంచంలో ఏ చాంపియన్‌షిప్ కూడా ఆషామాషీగా సాగడం లేదు. బౌట్‌లలో పోటీ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీనికి తగ్గట్లే నేనూ సన్నద్ధమవుతున్నా. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన 48 కేజీ కేటగిరీలోకి మళ్లీ వచ్చేశా. ఇంతకుముందు పోటీపడిన 51 కేజీ విభాగాన్ని బరువుగా భావించడం లేదు. అందులోనూ పతకాలు గెలిచాను. కానీ... 48 కేజీ కేటగిరీ నాకు అతికినట్లు సరిపోతుంది.
తదుపరి లక్ష్యం ‘కామన్వెల్త్’...
వచ్చే ఏడాది జరిగే గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్నా. సుదీర్ఘ కాలంగా బాక్సింగ్‌లో కొనసాగుతున్న నాకు ఇప్పటివరకైతే ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. పెద్దపెద్ద గాయాలు కాలేదు. ఇందుకు దేవుడికి థ్యాంక్స్. నా ఫిట్‌నెసే నా బలం.
నేను క్రియాశీలక ఎంపీని...
నేను పేరుకు మాత్రమే ఎంపీని కాదు. క్రియాశీలక పార్లమెంట్ సభ్యురాలిని. రెగ్యులర్‌గా రాజ్యసభకు హాజరవుతా. అలాగే నా బాక్సింగ్ ప్రాక్టీస్‌నూ కొనసాగిస్తా. బాధ్యతాయుత పదవిలో ఉన్న నేను ప్రభుత్వ పర్యవేక్షకురాలిగా క్రీడా ఈవెంట్లకు వెళ్తుంటా. ఇంతటి గురుతర బాధ్యతల కోసంఎంత కష్టపడుతున్నానో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా.
అన్ని పాత్రలకు న్యాయం చేస్తున్నా...
ఎంపీగా సభకు వెళతా. బాక్సింగ్ గ్లౌవ్స్‌తో ప్రాక్టీస్‌కు వెళతా. తల్లిగా నా ముగ్గురు కుమారుల ఆలనాపాలనా చూస్తా. అకాడమీని నడిపిస్తున్నా... ఇలా చెబుతుంటే గారడిగానే ఉన్నా అన్ని పాత్రలకి న్యాయం చేస్తున్నా. ఇవన్నీ పరిమిత సమయపాల నలో క్లిష్టమే కానీ... చేయడం నాకు ఇష్టమే!
అదే పనిగా ప్రయాణాలు... అయినా ఓకే
ఆసియా చాంపియన్‌షిప్ ముగిసింది. ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని లుసానేకు బయల్దేరాల్సి ఉంది. అక్కడ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరమ్‌లో పాల్గొనాలి. ప్రయాణాలు
చికాకు అనిపించినా...బాధ్యతలకు సిద్ధమైనప్పుడు నిబద్ధతతో పనిచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment