merikom
-
సింధుకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: తెలుగుతేజం పీవీ సింధు కీర్తి కిరీటంలో మరో పురస్కారం దర్జాగా చేరింది. భారత ప్రభుత్వం ప్రపంచ చాంపియన్ సింధును మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’ అవార్డుకు ఎంపిక చేసింది. మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ అందుకోనుంది. 71వ గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పలురంగాల్లో విశేష కృషి చేసిన భారతీయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులకు చోటుదక్కింది. మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, భారత మహిళల హాకీ కెపె్టన్ రాణి రాంపాల్, పురుషుల హాకీ మాజీ కెప్టెన్ ఎం.పి.గణేష్, స్టార్ షూటర్ జీతు రాయ్, మహిళల ఫుట్‌బాల్ మాజీ సారథి ఒయినమ్ బెంబెం దేవి, ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్‌లు ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపికయ్యారు. అప్పుడు ‘పద్మ’... ఇప్పుడు భూషణ్ మన సింధుకిది రెండో పద్మ పురస్కారం. ఐదేళ్ల క్రితం 2015లో ఆమెకు పద్మశ్రీ దక్కింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగుతేజం ఖాతాలో ఇప్పటికే 5 ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలున్నాయి. గతేడాది జరిగిన ఈవెంట్లో బంగారు పతకం నెగ్గిన 24 ఏళ్ల సింధు కెరీర్లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలున్నాయి. ఇది వరకే పద్మశ్రీ (2006), పద్మభూషణ్ (2013)లు అందుకున్న మణిపూర్ బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ తాజాగా ‘పద్మవిభూషణ్’గా ఎదిగింది. స్పోర్ట్స్‌లో ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో వ్యక్తి మేరీ. మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, దివంగత పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరి (న్యూజిలాండ్), క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్లు మాత్రమే పద్మవిభూషణ్ అందుకున్నారు. సచిన్ అనంతరం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. 41 ఏళ్ల జహీర్‌ఖాన్ 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన టీమిండియా సభ్యుడు. 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. 25 ఏళ్ల భారత కెప్టెన్ రాణి రాంపాల్ 241 మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. క్వాలిఫికేషన్ మ్యాచ్‌ల్లో అమెరికాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్ బెర్తు సాధించడంలో రాణి కీలకపాత్ర పోషించింది. -
మేరీనే క్వాలిఫయర్స్‌కు...
ఆమె ఒక దిగ్గజ బాక్సర్. ఒకట్రెండు సార్లు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... ఐదుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచింది. అంతేనా... భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మహిళల బాక్సింగ్‌కు మణిపూస లాంటిది. రాష్ట్రపతి స్వయంగా ఎగువసభకు నామినేట్ చేసిన ఎంపీ కూడా! అంతటి మేటి బాక్సర్ ఏకపక్ష విజయం సాధించడం వరకు బాగానే ఉన్నా... అనుభవరీత్యా తనకంటే ఎంతో జూనియర్ అయిన ప్రత్యర్థితో తలపడుతున్నపుడు... విజయానంతరం ఆమె వ్యవహరించిన తీరు క్రీడాలోకాన్ని విస్మయపరిచింది. ఇంతకాలం తన పంచ్‌లతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ మేటి బాక్సర్ మేరీకోమ్ కాగా... ఈ మణిపూర్ బాక్సర్‌కు సవాల్ విసిరిన క్రీడాకారిణి తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. కొన్ని నెలలుగా ఎంతో ఉత్కంఠరేపిన మహిళల బాక్సింగ్ ట్రయల్స్ శనివారంతో ముగియగా... భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి వెళ్లే ఐదుగురు బాక్సర్లు కూడా ఖరారయ్యారు. న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత పొందింది. మహిళల 51 కేజీల ట్రయల్ ఫైనల్ బౌట్లో ఆమె 9–1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను ఓడించింది. దీంతో ఈ కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో మేరీ పోటీపడనుంది. మిగతా ట్రయల్స్ పోటీల్లో 57 కేజీల్లో రెండుసార్లు ప్రపంచ రజత పతక విజేత అయిన సోనియా లాథర్‌కు చుక్కెదురైంది. సాక్షి చౌదరి ధాటికి ఆమె ఓడిపోయింది. 60 కేజీల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్ సరితా దేవి కూడా జాతీయ చాంపియన్ సిమ్రన్‌జీత్ కౌర్ చేతిలో కంగుతింది. 69 కేజీల విభాగంలో లలితాపై లవ్లీనా బొర్గొహైన్... 75 కేజీల విభాగంలో నుపుర్‌పై పూజా రాణి గెలిచి క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదించారు. ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ పోటీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు చైనాలో జరుగుతాయి. ఇందులో రాణించిన బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తారు. హోరాహోరీ అనుకున్నా... తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. తనకూ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ అవకాశమివ్వాలంటూ పట్టుపట్టి మరీ ట్రయల్స్ పెట్టాలంది. ఒలింపిక్స్ అర్హతే లక్ష్యంగా పగలూ రాత్రి కష్టపడిన ఆమె... మేరీతో దీటుగా తలపడే అవకాశముందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) కూడా భావించింది. అందుకే ఆమె ప్రతిభకు వెన్నంటే నిలిచింది. నిఖత్‌కు మద్దతు తెలిపేందుకు ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డితోపాటు తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే తీరా పోటీదగ్గరకొచ్చేసరికీ ఏకపక్షమవుతుందని ఎవరూ ఊహించలేదు. 36 ఏళ్ల మణిపూర్ వెటరన్ దిగ్గజాన్ని ఢీకొట్టడం అంత సులువు కాదని బౌట్ మొదలైన కాసేపటికే తెలంగాణ అమ్మాయికి తెలిసొచ్చింది. స్పష్టమైన పంచ్ లతో మేరీకోమ్ విజృంభిస్తుంటే నిఖత్ వద్ద సమాధానం లేకపోయింది. ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ సంధించిన పంచ్‌లు బౌట్‌ను పర్యవేక్షించిన జడ్జిలను ఆకట్టుకోలేకపోయాయి. కేవలం ఒక్కరు మాత్రమే నిఖత్‌కు పాయింట్ ఇవ్వగా... మిగతా తొమ్మిది మంది మేరీకోమ్ పైచేయి సాధించిందని భావించారు. అయితే విజయగర్వంతో ప్రత్యరి్థకి కనీస గౌరవం ఇవ్వకుండా మేరీకోమ్ రింగ్ నుంచి బయటికి రావడం పలు విమర్శలకు తావిచ్చింది. తనతో పోరాడిన ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ బాక్సర్‌కు మేరీలాంటి దిగ్గజం కరచాలనం చేయకపోవడం దారుణమని క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి. అసలేమైంది... ఏమిటీ వివాదం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ తీసుకున్న నిర్ణయం ట్రయల్స్ వివాదాన్ని రేపింది. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్íÙప్లో మేరీ కాంస్యం గెలిచింది. దీంతో ఆయన పతక విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయర్ బెర్త్‌లని ప్రకటించారు. అంటే ట్రయల్స్‌లో పాల్గొనకుండా మేరీకి మినహాయింపు ఇవ్వడం ఏంటని ఆ కేటగిరీ (51 కేజీలు)లో ఉన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రశి్నంచింది. బీఎఫ్ఐ తీరుపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా కేంద్ర క్రీడాశాఖకు లేఖ రాసింది. ట్రయల్స్ పోటీల ద్వారానే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బెర్త్‌లు ఖరారు చేయాలని కోరింది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రాలాంటి ఆటగాళ్లు ఆమె ట్రయల్స్ కోరడాన్ని సమరి్థంచారు. దీనిపై స్పందించిన ఆ శాఖ ట్రయల్స్ నిర్వహించాలంటూ బీఎఫ్ఐను ఆదేశించింది. దీంతో నేరుగా చైనా (క్వాలిఫయర్స్) వెళ్లే అవకాశాన్ని పోటీదాకా తెచ్చిన నిఖత్ జరీన్‌పై మేరీ కోపం పెంచుకుంది. అందుకేనేమో బౌట్ ముగిశాక చేయి కలపలేదు. ప్రత్యర్థితో ఏ మాత్రం హుందాగా ప్రవర్తించకుండా తన మానాన తాను వెళ్లిపోయింది. -
నిఖత్ x మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు సమయం వచ్చేసింది. నేడు జరిగే బౌట్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌తో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తలపడనుంది. 51 కేజీల విభాగంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా ఈ ముఖాముఖీ జరగనుంది. ఇందులో గెలిచే బాక్సర్‌కే ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుక్రవారం జరిగిన తమ తొలి రౌండ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించి వీరిద్దరు తుది పోరుకు సన్నద్ధమయ్యారు. నిఖత్ 10–0తో ప్రస్తుత జాతీయ చాంపియన్ జ్యోతి గులియాను, మేరీకోమ్ 10–0తో రితు గ్రేవాల్‌ను ఓడించారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఒక దశలో ఎంతో సీనియర్ అయిన మేరీకోమ్ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరక ర వ్యాఖ్యలు చేసింది. బాక్సింగ్ వర్గాల్లో ఎక్కువ మం ది నిఖత్కే అం డగా నిలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్రయల్స్‌కు సమాఖ్య ఒప్పుకుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
ట్రయల్స్‌కు బాక్సర్ నిఖత్ అర్హత
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్‌కు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ అర్హత సాధించింది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్, జ్యోతి గులియా, రితూ గ్రేవాల్‌లతో పాటు నిఖత్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ నెల 27, 28 తేదీల్లో ట్రయల్స్ జరుగుతాయి. ఈ నలుగురు బాక్సర్లకు ర్యాంకింగ్స్ కేటాయించగా మేరీకోమ్ మొదటి, నిఖత్ రెండో స్థానంలో ఉన్నారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నిబంధనల ప్రకారం తొలి స్థానంలో ఉన్న మేరీకోమ్, నాలుగో స్థానంలో ఉన్న రితూతో తలపడుతుంది. జ్యోతిని నిఖత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు బౌట్లలో గెలిచిన వారి మధ్య ఫైనల్ బౌట్ ఉంటుంది. మేరీ, నిఖత్ తమ తొలి బౌట్లలో విజయం సాధిస్తే వారిద్దరు ఫైనల్లో తలపడతారు. తుది విజేతకు మాత్రమే ఫిబ్రవరిలో చైనాలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం ఉంటుంది. -
బీఎఫ్ఐ ఆదేశిస్తే... నిఖత్‌తో బౌట్‌కు సిద్ధమే
న్యూఢిల్లీ: ‘నిఖత్ జరీన్‌తో తలపడేందుకు నాకెలాంటి భయం లేదు’ అని భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రకటించింది. ‘భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆదేశిస్తే... ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్ బౌట్లో నిఖత్‌ను ఓడించి లాంఛనం పూర్తి చేస్తాను’ అని రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఈ మణిపూర్ బాక్సర్ స్పష్టం చేసింది. శనివారం ఓ సన్మాన కార్యక్ర మంలో పాల్గొనేందుకు వచ్చిన మేరీకోమ్ తాజా వివాదంపై స్పందించింది. ‘బీఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని, నిబంధనలను నేను మార్చలేను. పోటీపడటమే నాకు తెలుసు. బీఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. వారు నిఖత్‌తో ట్రయల్స్ బౌట్లో తలపడాలని ఆదేశిస్తే తప్పకుండా పోటీపడతాను’ అని 36 ఏళ్ల మేరీకోమ్ తెలిపింది. -
నేను జోక్యం చేసుకోలేను!
న్యూఢిల్లీ: బాక్సర్లు మేరీకోమ్, నిఖత్ జరీన్ (51 కేజీలు) ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెలక్షన్ ట్రయల్స్ బౌట్ వివాదంలో తాను నేరుగా జోక్యం చేసుకోలేనని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే దేశానికి మేలు జరిగే నిర్ణయాన్ని తీసుకోవాలని మాత్రం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు సూచిస్తానని ఆయన తెలిపారు. ‘దేశానికి, క్రీడలకు, క్రీడాకారులకు మేలు జరిగే నిర్ణయం తీసుకోవాలని భారత బాక్సింగ్ సమాఖ్యకు నేను కచ్చితంగా సూచిస్తాను. అయితే ఒలింపిక్ చార్టర్ నిబంధనల ప్రకారం స్వయం ప్రతిపత్తిగల క్రీడా సమాఖ్యల సెలక్షన్ నిర్ణయాల్లో ప్రభుత్వ మంత్రులు జోక్యం చేసుకోరాదు’ అని కిరణ్ రిజిజు ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘తక్షణమే స్పందించినందుకు ధన్యవాదాలు సర్. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నాను’ అని క్రీడల మంత్రి స్పందనకు నిఖత్ సమాధానం ఇచి్చంది. -
అయ్యో... నిఖత్!
న్యూఢిల్లీ: మరోసారి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నుంచి నిరాశే ఎదురైంది. సెలక్షన్ ట్రయల్స్‌ను పక్కనబెట్టి మళ్లీ పతక విజేతలకు బీఎఫ్ఐ జైకొట్టడంతో నిఖత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు దూరమైంది. ఈ ఆగస్టులోచాంపియన్షిప్కు ముందు కూడా ఇలాంటి నిర్ణయంతో నిఖత్ జరీన్ ఇంటికే పరిమితమైంది. మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ కూడా నిఖత్ వెయిట్ కేటగిరీ (51 కేజీలు) కావడం తెలంగాణ బాక్సర్‌కు శాపమైంది. మేటి బాక్సర్‌ను కాదనలేక, షెడ్యూలు ప్రకారం ట్రయల్స్ నిర్వహించకుండానే మేరీని బీఎఫ్ఐ ఖరారు చేసింది. ఇప్పుడు నిఖత్ ఒలింపిక్స్ ఆశల్ని క్వాలిఫయింగ్‌కు ముందే తుంచేసింది. వచ్చే ఫిబ్రవరిలో ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగనున్నాయి. ఈ ఈవెంట్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన విజేతల్ని బీఎఫ్ఐ ఎంపిక చేసింది. అక్కడ కాంస్యాలు నెగ్గిన మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) సెలక్షన్ ట్రయల్స్‌తో నిమిత్తం లేకుండానే చైనా ఈవెంట్‌కు అర్హత పొందారు. దీంతో 51 కేజీల కేటగిరీలో ఉన్న నిఖత్ సెలక్షన్ బరిలోకి దిగకుండానే బీఎఫ్ఐ చేతిలో నాకౌట్ అయ్యింది. బాక్సింగ్ సమాఖ్య నిర్ణయంపై మేరీ సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. పతక విజేతనైనా నాకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో పాల్గొనే అవకాశమిచి్చన బీఎఫ్ఐకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని పేర్కొంది. -
పసిడి పోరుకు మంజు రాణి
ఉలన్ ఉడే (రష్యా): ఆడుతున్న తొలి ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనే భారత యువ మహిళా బాక్సర్ మంజు రాణి అదరగొట్టింది. 2001లో మేరీకోమ్ తర్వాత బరిలోకి దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఫైనల్‌కు చేరిన తొలి భారత బాక్సర్‌గా గుర్తింపు పొందింది. శనివారం జరిగిన 48 కేజీల సెమీఫైనల్లో మంజు 4–1తో చుఠామట్ రక్సత్ (థాయ్‌లాండ్)పై ఘన విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో్ల ఎకతెరీనా పల్త్‌సెవా (రష్యా)తో మంజు రాణి తలపడుతుంది. మేరీకోమ్‌కు షాక్... రికార్డు స్థాయిలో ఏడో పసిడి పతకంపై గురిపెట్టిన భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన పోరాటాన్ని సెమీస్‌తో ముగించింది. దీంతో ఆమె ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన సెమీస్ బౌట్లో ఆమె 1–4తో రెండో సీడ్ బుసెంజ కకిరోగ్లు (టర్కీ) చేతిలో ఓడింది. 54 కేజీల విభాగంలో జమునా బోరో 0–5తో టాప్‌సీడ్ హుయాంగ్ హ్సియావో వెన్ (చైనీస్ తైపీ) చేతిలో, లవ్లీనా 2–3తో యాంగ్ లియు (చైనా) చేతిలో ఓడి కాంస్యాలతో సంతృప్తి చెందారు. -
చరిత్ర సృష్టించిన మేరీ కోమ్
మన మేరీ మరో ‘ప్రపంచ’ పతకంతో చరిత్ర సృష్టించింది. మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన స్టార్ బాక్సర్ మేరీకామ్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు 8వ పతకం ఖాయమైంది. ఆమెతో పాటు మంజు రాణి, జమున బొరొ, లవ్లినా బొర్గొహైన్ సెమీస్ చేరి కనీసం కాంస్యానికి అర్హత సాధించారు. ఉలన్ ఉడే∙(రష్యా): భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆమె 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఓడినా కనీసం కాంస్యమైనా దక్కుతుంది. గెలిస్తే పసిడి వేటలో పడుతుంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మేరీకోమ్ 51 కేజీల కేటగిరీలో 5–0తో కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియాను చిత్తుగా ఓడించింది. విశేష అనుభవజు్ఞరాలైన మేరీ ముందు విక్టోరియా పంచ్‌లు నీరుగారాయి. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యరి్థని తన పిడిగుద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ మణిపూర్ వెటరన్ బాక్సర్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. క్యూబా పురుషుల బాక్సర్ ఫెలిక్స్ సవన్ ఏడు ప్రపంచ పతకాలతో ఉన్న రికార్డును మేరీ చెరిపేసింది. మేరీకోమ్ వరల్డ్ బాక్సింగ్‌లో ఇప్పటికే 6 స్వర్ణాలతో పాటు ఒక రజతం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో తలపడిన ఐదుగురు బాక్సర్లలో నలుగురు సెమీస్ చేరడంతో భారత్‌కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మంజు రాణి (48 కేజీలు), జమున బొరొ (54 కేజీలు), లవ్లినా బొర్గొహైన్ (69 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ వేదికపై రెండు సార్లు కాంస్యాలు గెలిచిన కవిత చహల్ (ప్లస్ 81 కేజీలు)కు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె క్వార్టర్స్‌లోనే ఓడిపోయింది. 48 కేజీల బౌట్లో మంజురాణి... టాప్ సీడ్, గత ‘ప్రపంచ’ ఛాంపియన్ షిప్ కాంస్య విజేత కిమ్ హ్యాంగ్ మి (దక్షిణ కొరియా)కు షాకిచి్చంది. తొలిసారిగా మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన హరియాణా బాక్సర్ మంజు 4–1తో కొరియన్‌ను ఇంటిదారి పట్టించింది. 54 కేజీల బౌట్లో అస్సామ్ బాక్సర్ జమున బొరొ కూడా 4–1తో ఉర్సులా గాట్‌లబ్ (జర్మనీ)పై నెగ్గింది. 69 కేజీల్లో లవ్లినా 4–1తో ఆరో సీడ్ కరొలినా కొస్జెస్కా (పోలండ్)పై గెలిచింది. మరో క్వార్టర్స్‌లో కవిత చహల్ (ప్లస్ 81 కేజీలు) 0–5తో కత్సియరినా కవలెవా (బెలారస్) చేతిలో పరాజయం చవిచూసింది. -
క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్
వులన్ వుడే (రష్యా): భారత వెటరన్ మహిళా బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు లవ్లినా బొర్గొహెయిన్ (69 కేజీలు), జమున బొరొ (54 కేజీలు) కూడా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మేరీకి తొలిరౌండ్లో బై లభించింది. అనంతరం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన జిట్పాంగ్ జుటమస్పై గెలుపొందింది. మేరీ స్పష్టమైన పంచ్‌లకు జడ్జిలంతా ఆమెకే ఓటేశారు. దీంతో బౌట్లో గెలిచినట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. జడ్జిలు మేరీకి 30 పాయింట్లు, జిట్పాంగ్కు 27 పాయింట్లు ఇచ్చారు. 36 ఏళ్ల మేరీకోమ్ ఇప్పుడు పతకానికి విజయం దూరంలో ఉంది. అయితే క్వార్టర్ ఫైనల్లో ఆమెకు గట్టి ప్రత్యర్థి ఎదురైంది. భారత బాక్సర్... పాన్ అమెరికా చాంపియన్, రియో ఒలింపిక్స్ కాంస్య విజేత ఇంగ్రిట్ వాలెన్సియా (కొలంబియా)తో తలపడనుంది. 54 కేజీల ప్రిక్వార్టర్స్‌లో జమున... ఐదో సీడ్ ఒయిడాడ్ ఫౌ (అల్జీరియా)ను కంగుతినిపించింది. ఈ బౌట్లోనూ జడ్జిలు జమున గెలిచినట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. 69 కేజీల విభాగంలో మూడో సీడ్ లవ్లినా బొర్గొహెయిన్ 5–0తో ఒమైమా బెల్ అబిబ్ (మొరాకో)పై నెగ్గింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య విజేత అయిన లవ్లినా క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ కరోలినా కొస్జెవ్‌స్కా (పొలండ్)తో, జమున... జర్మనీకి చెందిన ఉర్సు లా గొట్లాబ్తో పోటీపడతారు. ఇది వరకే మంజు రాణి (48 కేజీలు), కవిత చహల్ (ప్లస్ 81 కేజీలు) కూడా క్వార్టర్స్ చేరారు. దీంతో మొత్తం ఐదుగురు భారత బాక్సర్లు పతకం వేటలో పడ్డారు. నేటి క్వార్టర్స్‌లో గెలిచి సెమీస్ చేరితే వీరికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. -
మేరీకోమ్‌పైనే దృష్టి
ఉలాన్ ఉడె (రష్యా): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడో స్వర్ణమే లక్ష్యంగా భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ బరిలోకి దిగనుంది. నేడు మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో మూడో సీడ్‌గా పోటీపడనుంది. తొలి రౌండ్లో బై పొందిన ఈ మణిపూర్ బాక్సర్ మంగళవారం నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో తలపడుతుంది. మేరీకోమ్‌తోపాటు మరో నలుగురికి కూడా తొలి రౌండ్లో బై లభించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ 2006లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. స్వదేశంలో జరిగిన ఆ ఈవెంట్లో భారత్ రెండు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలు గెల్చుకుంది. భారత జట్టు: మంజు రాణి (48 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), నీరజ్ (57 కేజీలు), సరిత (60 కేజీలు), మంజు (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సవీటి (75 కేజీలు), నందిని (81 కేజీలు), కవిత(ప్లస్ 81 కేజీలు). -
పతకం తెస్తానో లేదో..: మేరీకోమ్
న్యూఢిల్లీ: రష్యాలోని ఉలాన్ ఉదెలో వచ్చే నెల 3 నుంచి 13 వరకు జరిగే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధిస్తాననే హామీ ఇవ్వలేనని భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ పేర్కొంది. ‘నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా. ప్రతి ఈవెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. పతకం సాధిస్తానని మాత్రం చెప్పలేను’ అని వ్యాఖ్యానించింది. స్థాయికి తగ్గట్లు రాణిస్తే స్వర్ణం సాధించడం సమస్య కాబోదని పేర్కొంది. మేరీ ఇప్పటివరకు 8 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లలో 48 కేజీల విభాగంలో 7 పతకాలు సాధించగా... రాబోయే చాంపియన్ షిప్లో తొలిసారి 51 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. -
పసిడి కాంతలు
అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మళ్లీ తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. శనివారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఏడు పతకాలతో భారత బాక్సర్లు అదరగొట్టగా... ఆదివారం ఇండోనేసియాలో ముగిసిన ప్రెసిడెంట్స్ కప్‌లో మనోళ్లు ఏకంగా ఏడు స్వర్ణాలు, రెండు రజతాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అద్భుతం చేశారు. ఈ క్రమంలో టోర్నమెంట్లో ఉత్తమ జట్టు పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. న్యూఢిల్లీ : వేదిక మారింది. టోర్నమెంట్ పేరు మారింది. కానీ భారత బాక్సర్లు జోరు మాత్రం కొనసాగింది. ప్రత్యర్థులు ఎవరైనా... తమ పంచ్ ప్రతాపాన్ని చాటుకుంటూ మన బాక్సర్లు పతకాల పంట పండించారు. 24 గంటలు గడవకముందే మరో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఇండోనేసియాలోని లాబువాన్ బాజోలో ముగిసిన ప్రెసిడెంట్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు గెల్చుకున్నారు. ఏడు స్వర్ణాల్లో నాలుగు మహిళా బాక్సర్లు అందించగా... మిగతా మూడు పురుష బాక్సర్లు సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలోనే మరో రెండు రజతాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమున బోరో (54 కేజీలు), మోనిక (48 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) విజేతలుగా నిలిచారు. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా సాధన చేస్తున్న మేరీకోమ్‌కు ఈ టోర్నీలో ఎదురులేకుండా పోయింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ మణిపూర్ మెరిక పసిడి కాంతులు విరజిమ్మింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 36 ఏళ్ల మేరీకోమ్ 5–0తో ఏప్రిల్ ఫ్రాంక్స్ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించింది. రెండు నెలల క్రితం ఇండియా ఓపెన్‌లో స్వర్ణం నెగ్గిన మేరీకోమ్ ఆ తర్వాత విరామం తీసుకొని ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఇతర ఫైనల్స్‌లో అస్సాంకు చెందిన జమున బోరో 5–0తో గియులియా లమాగ్న (ఇటలీ)పై, పంజాబ్ అమ్మాయి సిమ్రన్‌జిత్ 5–0తో హసానా హుస్‌వతున్ (ఇండోనేసియా)పై, హరియాణా అమ్మాయి మోనిక 5–0తో ఎన్‌డాంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించి బంగారు పతకాలను దక్కించుకున్నారు. గౌరవ్, దినేశ్‌లకు రజతాలు పురుషుల విభాగంలో ఐదుగురు బాక్సర్లు పసిడి కోసం బరిలోకి దిగారు. అంకుశ్ దహియా (64 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) స్వర్ణాలు నెగ్గగా... గౌరవ్ బిధురి (56 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అంకుశ్ 5–0తో లెయుంగ్ కిన్ ఫాంగ్ (మకావు)పై, అనంత ప్రహ్లాద్ 5–0తో రహమాని రామిష్ (అఫ్గానిస్తాన్)పై, నీరజ్ స్వామి 4–1తో మకాడో జూనియర్ రామెల్ (ఫిలిప్పీన్స్)పై గెలిచారు. గౌరవ్ బిధురి 2–3తో మాన్‌డాగి జిల్ (ఇండోనేసియా) చేతిలో, దినేశ్ 0–5తో సమాద సపుత్ర (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. ఓవరాల్‌గా తొమ్మి ది పతకాలు నెగ్గిన భారత్‌కు ఈ టోర్నీలో ఉత్తమ జట్టు అవార్డు లభించింది. -
నా రిటైర్మెంట్ అప్పుడే.. మేరీకోమ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన రిటైర్మెంట్ ప్రణాళికలను గురువారం వెల్లడించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఈ 36 ఏళ్ల మణిపురీ బాక్సర్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాతే ఆటకు గుడ్‌బై చెబుతానని ప్రకటించింది. ‘2020 టోక్యో ఒలింపిక్స్ అనంతరం రిటైర్మెంట్ తీసుకుంటా. అంతకన్నా ముందు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే నా దృష్టి ఉంది’ అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ తెలిపింది. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మేరీకోమ్ ఎన్నో ఘనతలు సాధించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్స్‌లో కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు పతకాలను దక్కించుకుంది. రింగ్‌లో దిగిన ప్రతీసారి పతకం సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది. ‘దేశానికి పతకం అందించేందుకు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. కచ్చితంగా స్వర్ణం గెలవడమే లక్ష్యంగా బరిలో దిగుతా. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నా’ అని మేరీకోమ్ పేర్కొంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగనుండటంతో క్వాలిఫయర్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి మే వరకు క్వాలిఫయింగ్ పోటీలు జరుగనున్నాయి. అర్హత పోటీలను వచ్చే ఏడాది నిర్వహించడం పట్ల మేరీకోమ్ హర్షం వ్యక్తం చేసింది. -
భారత బాక్సర్ల పసిడి పంట
గువాహటి: సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో మేరీకోమ్ 5–0తో భారత్‌కే చెందిన వన్లాల్ దువాటిపై గెలిచింది. సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో సరితా దేవి 3–2తో సిమ్రన్‌జిత్ కౌర్ (భారత్)పై, జమున 5–0తో సంధ్యారాణి (భారత్)పై, నీరజ 5–0తో మనీషా (భారత్)పై గెలిచారు. 48 కేజీల విభాగం ఫైనల్లో మోనిక (భారత్) 2–3తో గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో, లవ్లీనా (భారత్) 2–3తో అసుంతా (ఇటలీ) చేతిలో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో దీపక్ (49 కేజీలు), అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 4–1తో సచిన్ సివాచ్ (భారత్)పై, దీపక్ 5–0తో గోవింద్ (భారత్)పై, ఆశిష్ 4–1తో దుర్యోధన్ (భారత్)పై, శివ థాపా 5–0తో మనీశ్ (భారత్)పై విజయం సాధించారు. ఫైనల్లో ఓడిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), కవిందర్ (56 కేజీలు) రజత పతకాలను దక్కించుకున్నారు. -
కుస్తీ మే సవాల్
స్త్రీకి జీవితంలో ప్రతిదీ ఒక కుస్తీనే.అలాంటి స్త్రీ.. కుస్తీ పోటీల్లో ఉంటే..భర్త చప్పట్లు కొట్టకపోతే ఎలా?!‘బెటర్ హాఫ్’గా ఒప్పుకున్నప్పుడుచేతికి రింగు తొడిగిస్తారు. బాక్సింగ్ చేసే చోటు కూడా రింగే. భార్య బాక్సింగ్ రింగ్‌ని ప్రేమించింది.భర్త భార్యను ప్రేమించాలి.. ‘విత్ దిస్ రింగ్’! ‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.వధువు, వరుడు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి అయిపోయింది. జనవరి 1 అది. పెళ్లికి వచ్చినవాళ్లలో ముగ్గురు స్నేహితురాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు కెరీర్లో పైపైకి ఎదగాలని కోరుకుంటున్న అమ్మాయి. ఇంకొకరు మంచి కాలమిస్టుగా ఎదుగుతున్న అమ్మాయి. మరొకరు ఒక అడుగు పైకి ఎగబాగుతూ, ఒక అడుగు కిందికి జారుతూ ఉన్న నటి. ఆ పెళ్లిలో ఆ ముగ్గురూ ఒక ఒప్పందానికి వస్తారు. సరిగ్గా ఏడాది లోపు తాము కూడా పెళ్లి చేసుకోవాలని. అంతగా పెళ్లిలోని ఆ రింగ్ సెరిమనీ వాళ్లలో ఉత్సాహం తెస్తుంది. పెళ్లిప్రమాణాల్లో ‘విత్ దిస్ రింగ్’ అనే మాటకు ఈ ముగ్గురు అమ్మాయిల చెంపలు కెంపులవుతాయి. నాలుగేళ్ల క్రితం అమెరికన్ టెలివిజన్ చానల్ ‘లైఫ్‌టైమ్’లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామాలోని థీమ్ ఇది. ఆ టీవీ మూవీ పేరు ‘విత్ దిస్ రింగ్’. ‘విత్ దిస్ రింగ్’ అనే పేరుతోనే ఇండియాలో ఈ ఫిబ్రవరిలో యూట్యూబ్‌లోకి ఒక డాక్యుమెంటరీ అప్లోడ్ అయింది. అందులోనూ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. మనకు తెలిసిన అమ్మాయిలే. మేరీకోమ్, సరితాదేవి, చోటో లోరా. ముగ్గురూ బాక్సర్లు. ‘నువ్వసలు అమ్మాయివేనా?’, ‘నీకు పెళ్లెలా అవుతుందనుకున్నావ్?’, ‘కండలున్న ఆడదాన్ని ఏ మగాడు చేసుకుంటాడు?’, ‘పరువు తియ్యడానికి పుట్టావే నువ్వు నా కడుపున’, ‘ఊళ్లో అంతా నవ్వుతున్నారు’, ‘నీ నడక ఎలా మారిపోతోందో తెలుసా.. ఆడతనాన్ని వెతుక్కోవలసి వస్తోంది’.. ఎన్ని మాటలు!! అన్నీ పడ్డారు. బాక్సింగ్ ప్రాణం అనుకున్నారు. కష్టాలు అనుభవించారు. తినీ తినకా బరిలో నిలబడ్డారు. ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. పతకాలు సాధించారు. ఊరేం సంతోషించలేదు. పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. బాక్సింగ్ రింగ్.. ఈ ముగ్గురి ఫస్ట్ మ్యారేజ్. ఆ తర్వాతే మ్యారేజ్ రింగ్. ఇంట్లో వద్దన్న పని చెయ్యడం కష్టం. ఊరు వద్దన్న పని చెయ్యడం ఇంకా కష్టం. ఆ రెండు కష్టాలనూ వీళ్లు బాక్సింగ్‌తో ముఖం మీద.. ముఖం మీద గుద్దేసి, విజేతలయ్యారు. ‘విత్ దిస్ రింగ్’ అనే ఈ డాక్యుమెంటరీ ఇప్పటికిప్పుడు యూట్యూబ్‌లో మీకు అందుబాటులో ఉంది. అయితే ఇవాళ మనస్టోరీ పై ముగ్గురి స్నేహితురాళ్లు, కింది ముగ్గురు మహిళా బాక్సర్ల గురించి కాదు. అమీషా జోషి, అన్నా సర్కిస్సియన్ అనే ఇద్దరు అమ్మాయిల గురించి! మేరీ కోమ్, సరితాదేవి, ఛోటో లోరాలపై డాక్యుమెంటరీ తీసింది వీళ్లే. బాక్సర్లుగా ఎదగడానికి ఆ ముగ్గరూ ఎంత కష్టపడ్డారో, వాళ్లపై డాక్యుమెంటరీ తియ్యడానికి వీళ్లిద్దరూ అంత కష్టపడ్డారు. గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రాన్ని తియ్యడానికి వీళ్లకు పదేళ్లు పట్టింది!!అమీషా, అన్నా ఎవరికి వారుగా ఫిల్మ్మేకర్లు. చిన్న వయసే. కెనడాలో ఉంటారు. అనుకోకుండా కలుసుకున్నారు. ఎవరైనా బయోపిక్‌లు, బయోబుక్లు తేవాలంటే.. ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరా అని వెదకుతారు. వీళ్లకు ఆ సమస్య లేదు. ప్రతి మహిళ జీవితమూ ఇన్స్పైరింగే వీళ్ల ఉద్దేశంలో. అయితే మేరీ, సరిత, ఛోటోల స్టోరీ అనుకున్నప్పుడు ఇన్స్పైరింగ్ని పక్కన పెట్టి, వాళ్ల స్ట్రగుల్‌ని ముఖ్యాంశంగా తీసుకున్నారు. ఎక్కడో ఈశాన్య భారతదేశంలో, పేదరికంలో, సంప్రదాయాల చట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఏంటి, బాక్సింగ్ రింగ్‌లోకి రావడమేంటి! వచ్చి విజయం సాధించడం ఏంటి! డాక్యుమెంటరీ తియ్యాల్సిందే అనుకున్నారు. ఊరికే అవుతుందా? రిసెర్చ్ అవసరం. ఆట టఫ్‌గా ఉంటుంది. ట్రైనింగ్ ఇంకా టఫ్‌గా ఉంటుంది. ఇక లేత బలహీనమైన ఎముకలు గల ఆ అమ్మాయిల మనోబలం వాటికి మించి టఫ్‌గా ఉందని.. అన్నా, అమీషలకు తెలుస్తూనే ఉంది. బయల్దేరారు. ఆ ముగ్గురు బాక్సర్లు పుట్టిన ఊరికి, ఆడిన ఊరికీ, పతకం గెలిచిన ఊరికీ తిరిగారు. శ్రమ పడ్డారు. నోట్స్ రాసుకున్నారు. షూట్స్ చేశారు. డబ్బులు ఖర్చుపెట్టారు. మరి వీటన్నిటికీ టైమ్? ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. సెలవురోజుల్లో కొంత పని. సెలవు పెట్టి కొంత పని. ఇలా పదేళ్లు.. ఓ భారీ నీటì పారుదల ప్రాజెక్టును కట్టినట్లుగా.. జీవితం అనే ఒక బరిలో, బాక్సింగ్ అనే ఇంకో బరిలో మేరీ, సరితా ఛోటో ఎలా నెగ్గుకొచ్చిందీ చిత్రీకరించారు. అన్నా అయితే ఒక ఆటగా బాక్సింగ్‌ను ఎప్పుడూ ఇష్టపడలేదు. మేరి, సరిత, ఛోటోల ఆట చూశారు కాబట్టి ఇష్టపడ్డారు. మామూలుగానైతే విస్మయపరిచే అనామక స్త్రీల జీవితాలను అన్నాను నమ్మోహనపరుస్తాయి. అయితే ఈ ముగ్గురి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు.. ఒక స్త్రీ జీవన పోరాటాన్ని డాక్యుమెంటరీని తీయడానికి అవసరమైన స్క్రీన్ ప్లే అన్నాకు లభించింది.పదేళ్ల తర్వాతనైనా డాక్యుమెంటరీ పూర్తయినందుకు అమీషా కూడా విశ్రాంతిగా వేళ్లు విరుచుకుంటున్నారు. ‘బాబోయ్.. చిన్న పనైతే కాదు’’ అని నవ్వుతోంది అమీషా. డాక్యుమెంటరీ కోసం ఈ ఇద్దరూ రోజూ సాయంత్రాలలో, శని ఆదివారాల్లో పూర్తిగా డే అంతా పని చేశారు. ప్రాజెక్టులో సగభాగం పూర్తయ్యాక.. సగంలో ఆపేద్దాం అని కూడా అనుకున్నారు. ఒళ్లంతా సినిమా రీళ్లు చుట్టుకుపోయి తమను బందీలను చేసినట్లు ఫీలయ్యారు. సొంత డబ్బు సరిపోవడం లేదు. ఫండింగ్ చేసేవాళ్లు.. మహిళల బాక్సింగ్ అంటే చిన్న పంచ్లాంటి చూపు విసిరి.. మీకేం పనిలేదా? పని లేని పనికి ఫండింగ్ కూడానా అన్నట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజు అమీషా అంది... ‘‘మనకేనా ఈ ఎగ్జయింట్మెంట్! ప్రపంచానికి లేదా?’’ అని. ‘మేరీ కోమ్’ సినిమా బాగా ఆడింది. ‘దంగల్’ ఇంకా బాగా ఆడింది. ఒకటి బాక్సింగ్. ఇంకొకటి రెజ్లింగ్. రెండూ స్త్రీలు చేసినవే. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లారు. డబ్బు సంపాదించడం కోసం కాదు. ముందసలు జనాల్లోకి వెళ్లాలి. పెళ్లి, పిల్లలు కాకుండా కెరియర్లో ఎదగాలన్న అభిలాష ఉన్న యువతుల జీవితాల్లో ఎంత కష్టం ఉంటుందో తెలియాలి. మహిళా బాక్సింగ్‌లో ఇండియాకు, కెనడాకు తేడా ఉంటుంది. కెనడా కన్నా ఇండియా చాలా నయం. కెనడానే కాదు, తక్కిన దేశాలతో పోలిస్తే కూడా.. ఉమెన్ బాక్సింగ్ ఈవెంట్‌కి ఇండియాలో డబ్బులు కుమ్మరించే స్పాన్సరర్లు చాలామందే ఉంటారు. కెనడాలో ఫండింగే ఉండదు. మహిళలు ఒక హాబీగా మాత్రమే ఆడతారు. వాళ్లకు సొంత జిమ్‌లు ఉంటాయి. ట్రైనర్‌ను పిలిపించుకుని అక్కడే శిక్షణ పొందుతారు. ముందు జాబ్ చూసుకుంటారు. బాక్సింగ్ పోటీలకు వెళ్లాలనుకున్నప్పుడు.. అప్పుడు ఫండ్ రైజింగ్ కోసం చూస్తారు. ఇండియాలో అసలు చదువుతున్నప్పుడే ఆర్థిక సహాయం చేసేవాళ్లుంటారు. ప్రభుత్వమూ ముందుకొస్తుంది. బాగా ఆడితే ఉద్యోగం ఇస్తుంది. ఒకసారి ఉద్యోగం వచ్చాక జీవితం స్థిరపడిననట్లే. ఇన్ని అవకాశాలు, సదుపాయాలు ఉన్నా కూడా భారతదేశంలో మహిళా బాక్సర్లు కుటుంబ ఆంక్షల వల్ల, పెళ్లి కాదేమోనన్న పెద్దవాళ్ల భయాల వల్ల ఆశను చంపుకోవలసి వస్తోంది. ఈ విషయాలన్నీ అన్నా, అమీషా ఇండియా టూర్లో ఉన్నప్పుడు అర్థం చేసుకున్నారు. వాటన్నిటినీ డాక్యుమెంటరీలో.. చూసింది చూసినట్లు చూపిస్తే ఈ ముగ్గురూ ఎగిరిపోయి, భారతదేశంలో క్రీడలకు లభిస్తున్న ప్రోత్సాహం ఒక్కటే కనిపిస్తుంది. అందుకే మొదట మేరీ కోమ్ చుట్టూ ఆమె నిజ జీవితాన్ని ఒక కథగా అల్లుకున్నారు. తర్వాత మిగతా ఇద్దరి లైఫ్‌ని, లైఫ్ అచీవ్మెంట్స్నీ తీసుకున్నారు. లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే లోపు సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. మేరీకోమ్‌కి, సరితకు పెళ్లయింది. మేరీ కోమ్ భర్త.. పిల్లల్ని భద్రంగా చూసుకుంటాడు. ఆట ఆడేందుకు అవసరమైన స్థిమితత్వాన్ని ఆమెకు చేకూరుస్తాడు. సరిత భర్త కూడా అంతే. వాళ్లకొక కొడుకు. సరిత ఈవెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడికి తల్లీ తండ్రీ అతడే. వాస్తవానికి మేరీ, సరిత.. పెళ్లయ్యాకే మెరుగైన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్లిలా శ్రమ పడడం, భర్త సహకరించడం.. డాక్యుమెంటరీలో ఇవేవీ నేరుగా చూపించలేదు అన్నా, అమీషా. చూస్తుంటే తెలిసిపోతుంది.. చిన్న మాట, చిన్న సహాయం తోడుగా ఉంటే స్త్రీలు ఎంత కష్టమైన ఆటలోనైనా అత్యున్నతస్థాయిలో రాణించగలరని.ఇంతకీ ఈ డాక్యుమెంటరీకి ‘విత్ దిస్ రింగ్’ అని పేరెందుకు పెట్టినట్లు?‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.. అనే పెళ్లి ప్రమాణంలోని ఈ మాటను ఇక్కడ మనం మరొక రకంగా అర్థం చేసుకోవాలి. ‘నిన్నే కాదు.. ఆటపై ఉన్న నీ ఇష్టాన్నీ ప్రేమిస్తున్నాను’ అని. జీవిత భాగస్వామిగా నీ ఇష్టానికి పూర్తి భాగం ఇస్తాను’ అని కూడా! అన్నా.. అమీష అభినందనీయులు. ►పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. ►అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే స్త్రీకి కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. ►లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే దారిలో సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. -
వరల్డ్ నంబర్‌వన్ మేరీకోమ్
భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తన ఘనమైన కెరీర్లో మరో కీర్తికిరీటం చేరింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ మణిపూర్ మాణిక్యం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎదిగింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్‌వన్‌గా నిలిచింది. 36 ఏళ్ల ఈ వెటరన్ బాక్సర్ గత నవంబర్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచింది. దీంతో మేరీ ఆ వెయిట్ కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించింది. -
సూపర్ సోనియా
న్యూఢిల్లీ: బరిలో దిగిన తొలి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనే యువ బాక్సర్ సోనియా చహల్ అదర గొట్టింది. శుక్రవారం జరిగిన 57 కేజీల సెమీఫైనల్లో సోనియా 5–0తో జో సన్ హవా (ఉత్తర కొరియా)పై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు) ఇప్పటికే ఫైనల్ చేరగా... తాజాగా సోనియా ఆమె సరసన చేరింది. 64 కేజీల విభాగంలో జరిగిన మరో సెమీఫైనల్లో సిమ్రన్‌జిత్ 1–4తో డాన్ డూ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో భారత్ ఖాతాలో రెండు కాంస్యాలు చేరగా... ఇద్దరు బాక్సర్లు స్వర్ణ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరుగనున్న ఫైనల్లో హనా (ఉక్రెయిన్)తో మేరీకోమ్, ఆర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ)తో సోనియా తలపడనున్నారు. 2006లో సొంత గడ్డపై జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా భారత్ 4 స్వర్ణాలు సహా 8 పతకాలు సాధించింది. అనంతరం 2008లో 4 పతకాలు (1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలు) దక్కించుకుంది. ఇప్పుడు ఈ ప్రదర్శనను మెరుగుపరిచే అవకాశం భారత బాక్సర్ల ముందుంది. హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా సెమీఫైనల్లో జకార్తా ఆసియా క్రీడల రజత పతక విజేతపై సునాయాసంగా గెలుపొందింది. మొదటి రెండు రౌండ్లు మామూలుగానే ఆడిన సోనియా... మూడో రౌండ్లో రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రత్యర్థి ఎవరైనా తన సహజసిద్ధ ఆట మారదని చెప్పే సోనియా ఈ బౌట్లో అదే చేసి చూపించింది. ‘ఫైనల్‌కు చేరతానని ఊహించలేదు. సొంతగడ్డపై అభిమానుల మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్లడం సంతోషాన్నిస్తోంది. తొలి రెండు రౌండ్లు ముగిసేసరికి ప్రత్యర్థే ముందంజలో ఉందని కోచ్ చెప్పారు. దీంతో మూడో రౌండ్ ప్రారంభం నుంచే దూకుడు కనబర్చాను. ఫైనల్లోనూ ఇదే ఆటతీరు కొనసాగిస్తూ... స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని సోనియా వెల్లడించింది. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలో దిగి కాంస్యం నెగ్గడంపై సిమ్రన్‌జిత్ సంతోషం వ్యక్తం చేసింది. -
అదరగొట్టిన భారత బాక్సర్లు!
న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన ఐదు విభాగాల బౌట్లకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు విజయాలు సాధించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (48 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 2006 చాంపియన్ లైష్రామ్ సరితా దేవి (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. మరో బౌట్లో గెలిచి సెమీస్ చేరుకుంటే మేరీకోమ్, మనీషా, లవ్లీనా, భాగ్యవతిలకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. రికార్డుస్థాయిలో ఆరో స్వర్ణంపై గురి పెట్టిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఈ మెగా ఈవెంట్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగిన ఈ మణిపూర్ బాక్సర్ 5–0తో ఐజెరిమ్ కెసెనయేవా (కజకిస్తాన్)ను ఓడించింది. తొలి రౌండ్లో ఆచితూచి ఆడిన మేరీకోమ్ రెండో రౌండ్లో అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌లు విసిరింది. బౌట్‌ను పర్యవేక్షించిన నలుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 30–27 పాయింట్లు ఇవ్వగా... మరోజడ్జి 29–28 పాయింట్లు ఇచ్చారు. ‘తొలి బౌట్ కఠినంగానే సాగింది. టోర్నీలో మొదటి బౌట్ కావడంతో ఒత్తిడితో పాల్గొన్నా. అయితే గత 16 ఏళ్లుగా నా అభిమానుల నుంచి ఈ రకమైన ఒత్తిడిని విజయవంతంగా అధిగమిస్తూ వస్తున్నా. ఈ తరహా ఒత్తిడంటే నాకు ఇష్టమే’ అని 35 ఏళ్ల మేరీకోమ్ వ్యాఖ్యానించింది. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా బాక్సర్ వు యుతో మేరీకోమ్ తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా మౌన్ మరో సంచలనం నమోదు చేసింది. 54 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ దీనా జాలమన్ (కజకిస్తాన్)తో జరిగిన బౌట్లో మనీషా 5–0తో గెలుపొందింది. ఈ ఏడాది దీనాపై మనీషాకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. పోలాండ్‌లో ఇటీవలే జరిగిన సిలెసియాన్ టోర్నీలోనూ మనీషా చేతిలో దీనా ఓడిపోయింది. ‘ఒకసారి రింగ్‌లో అడుగుపెడితే నా ప్రత్యర్థి ప్రపంచ చాంపియనా? రజత పతక విజేతా? లాంటి విషయాలు అస్సలు పట్టించుకోను. ( భాగ్యవతి ,లవ్లీనా,మనీషా,సరితా దేవి ) క్వార్టర్ ఫైనల్లో్లనూ దూకుడుగానే ఆడతా’ అని మనీషా వ్యాఖ్యానించింది. ఇతర బౌట్లలో లవ్లీనా 5–0తో 2014 ప్రపంచ చాంపియన్ అథెనా బైలాన్ (పనామా)పై... భాగ్యవతి 4–1తో నికొలెటా షోన్బర్గర్ (జర్మనీ)పై గెలుపొందారు. మరో బౌట్లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 2–3తో కెలీ హారింగ్టన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఫలితంపై సరితా దేవి అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మూడు రౌండ్లలోనూ ఆధిపత్యం చలాయించాను. కానీ జడ్జిల నిర్ణయంతో నిరాశ చెందాను. అయితే వారి నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. 2014 ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న వివాదం కారణంగా నాపై ఏడాదిపాటు నిషేధం విధించారు. జడ్జిలను విమర్శించి మరోసారి వివాదంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’ అని 36 ఏళ్ల సరితా దేవి వ్యాఖ్యానించింది. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టోకా పెట్రోవా (బల్గేరియా)తో మనీషా; స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా; పాలో జెస్సికా (కొలంబియా)తో భాగ్యవతి తలపడతారు. -
ఆశల పల్లకిలో...
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు దేశ రాజధాని వేదికగా రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 24 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. మొత్తం 10 విభాగాల్లో కలిపి 73 దేశాలకు చెందిన 300కు పైగా బాక్సర్లు ఈ ప్రతిష్టాత్మక పోరులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత్ నుంచి కూడా ఒక్కో విభాగంలో ఒకరు చొప్పున 10 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 2001 నుంచి తొమ్మిది సార్లు మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహించగా... 2006లో నాలుగో వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత ఢిల్లీలో మళ్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ జరుగుతోంది. స్కాట్లాండ్, మాల్టా, బంగ్లాదేశ్, కేమన్ ఐలాండ్స్, డీఆర్ కాంగో, మొజాంబిక్, సియరా లియోన్, సోమాలియా దేశాలు తొలిసారి విశ్వ వేదికపై తలపడనుండటం ఈ పదో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో విశేషం. 2001 నుంచి 2010 మధ్య ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ జరిగితే తొలిసారి (2వ స్థానం) మినహా ఆ తర్వాత వరుసగా ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత స్టార్ మేరీకోమ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి మేరీకోమ్‌కు యువ బాక్సర్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చు. 2006లో ఇదే వేదికపై స్వర్ణం సాధించిన మరో భారత బాక్సర్ సరితా దేవిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. భారత్ ఒక స్వర్ణం సహా కనీసం మూడు పతకాలు గెలుచుకునే అవకాశం ఉందని జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు: మేరీకోమ్ (48 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు), సవీటీ బూరా (75 కేజీలు), భాగ్యవతి కచారీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు). -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్‌కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
క్రీడాగ్రామంలో మన జెండా ఎగిరె...
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత అథ్లెట్లు సోమవారం క్రీడాగ్రామంలో జెండా వందనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అథ్లెట్లందరూ త్రివర్ణ పతకానికి గౌరవ వందనం చేశారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా అందరూ ఆహ్లాదంగా గడిపారు. జాతి గర్వించే నినాదాలు చేశారు. క్రీడా గ్రామంలో భారత బృందం బస చేసిన భవనం సమీపంలో సిరంజీలు బయట పడిన ఘటనపై స్పందించేందుకు భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా నిరాకరించారు. భారత బాక్సర్లపైనే డేగ కన్ను! ప్రతిష్టాత్మక గేమ్స్‌కు ముందు కలకలం రేపిన సిరంజీల ఘటనతో నిర్వాహకులు, దర్యాప్తు కమిటీ భారత బాక్సర్లపై కన్నేసినట్లుంది. అయితే ఉప్పందించిన పాపానికి తమపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల భారత వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ‘సీజీఎఫ్ నియమించిన మెడికల్ కమిషన్ ముందు హాజరు కావాలని కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ భారత బాక్సర్లకు సమన్లు జారీ చేసింది’ అని సీజీఎఫ్ సీఈఓ గ్రీవెన్బర్గ్ తెలిపారు. అయితే ఈ సిరంజీలను మరీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదని... మల్టీ విటమిన్స్ ఇంజెక్షన్లకు కూడా వినియోగించవచ్చని భారత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి భారత బాక్సర్లకు డోప్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 25 వేల కండోమ్స్ అథ్లెట్లు... ఆడండి, గెలవండి. చల్లని ఐస్‌క్రీమ్‌లు తినండి... వెచ్చని కోర్కెలు తీర్చుకోండనే విధంగా కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ఏర్పాట్లు చేసింది. నిష్ణాతులైన 300 మంది చెఫ్‌ల ఆధ్వర్యంలోని పాకశాస్త్ర బృందం 24 గంటలపాటు తినుబండారాలను ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేయిస్తోంది. క్రీడాగ్రామంలో బస చేసిన 6,600 మంది అథ్లెట్ల కోసం రుచికరమైన ఫ్లేవర్లలో ఐస్ క్రీమ్‌లు చేయిస్తున్న నిర్వాహకులు 2 లక్షల 25 వేల కండోమ్లనూ అందుబాటులో ఉంచారు. సురక్షిత శృంగారం కోసం సగటు లెక్కలేసుకొని మరీ వీటిని ఉంచడం గమనార్హం. ఆరువేల పైచిలుకున్న అథ్లెట్లకు 11 రోజుల పాటు 34 కండోమ్‌ల చొప్పున... 2.25 లక్షల కండోమ్‌లను సిద్ధంగా ఉంచింది. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 1.10 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా పంచారు. అదే రియో ఒలింపిక్స్ సమయంలో ‘జికా’ వైరస్ కలకలం రేగడంతో ఏకంగా 4.50 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా ఇచ్చారు. -
అతివ లోక విజయం
అమ్మలో ఆప్యాయతని చూశాం. సోదరిలో అనురాగబంధాన్ని చూశాం. భార్యలో బాధ్యతను చూశాం. బిడ్డలో మమకారాన్ని చవిచూశాం. ఏ రకంగా చూసినా... వారిలో కనిపించేది మాధుర్యమే. అంతులేని ప్రేమాభిమానాలే. నాణేనికి ఇ వైపులా ఆత్మీయతే కనబడుతుంది. వారు సుకుమారులు, సున్నిత మనస్కులే కాదు... జయ విజయ అజేయులు కూడా! ఇక్కడ నాణేనికి ఇరువైపులా చూస్తే సరిపోదు... కనిపించని నాలుగో సింహాన్ని చూడాలి... చూస్తున్నాం కూడా... బరిలో గెలిచేందుకు పోరాడుతున్నారు... పతకం తేచ్చేందుకు శ్రమిస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. బ్యాట్ పట్టినా... పరుగు పెట్టినా... పంచ్ విసిరినా... గన్‌తో గురి చూసినా...పట్టుతో ప్రత్యర్థుల భరతం పట్టినా... ఎవరైతే నాకేంటి అంటున్నారు.ఎందాకైనా పయనిస్తామంటున్నారు... ఎవరు... ఎవరు... అంటే ఇంకా తెలియదా! అయితే తెలుసుకోండి...! ఒక్క పట్టుతో... ‘ఫోగాట్ సిస్టర్స్’ గీత, బబిత, వినేశ్ విజయాలు ఓవైపు... సాక్షి మలిక్ ‘రియో ఒలింపిక్’ కాంస్య ప్రదర్శన మరోవైపు... అయినా ఒకే ఒక్క విజయంతో వీరితో సమానంగా పేరు సంపాదించింది పంజాబ్ మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్. 28 ఏళ్ల నవజ్యోత్ గతవారం కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 65 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అమృత్సర్ సమీపంలోని తరన్ తారన్ పట్టణానికి చెందిన నవజ్యోత్‌కు గత రెండేళ్లు ఏమాత్రం కలిసిరాలేదు. వెన్నునొప్పి కారణంగా ఆమె కొంతకాలం ఆటకు దూరమైంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన ఆమె వచ్చే నెలలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా ఎంపిక కాలేకపోయింది. అయితేనేం తాజా పసిడి ప్రదర్శన నవజ్యోత్‌కు ఒక్కసారిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. గతాన్ని మరచి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. పరుగెడితే పతకం... నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు కామన్వెల్త్ గేమ్స్ గురించి అవగాహన లేదు. తెలిసిందల్లా ఫుట్‌బాల్ మాత్రమే. అయితే ఫుట్‌బాల్‌లో కెరీర్ గొప్పగా ఉండదని పాఠశాల వ్యాయామవిద్యా ఉపాధ్యాయుడు సలహా ఇచ్చారు. వ్యక్తిగత క్రీడాంశం అథ్లెటిక్స్‌లో అడుగు పెట్టాలని సూచించారు. ఆయన సలహా మేరకు అథ్లెటిక్స్‌లో అడుగు పెట్టిన ఆమె రెండేళ్లలో నిలకడగా రాణించి ఇపుడు కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆ అమ్మాయే అస్సాంకు చెందిన 18 ఏళ్ల హిమా దాస్. పాటియాలాలో జరుగుతున్న ఫెడరేషన్ కప్‌లో హిమా దాస్ అందరి అంచనాలను తారుమారు చేసి 400 మీటర్ల ఫైనల్లో 51.97 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణాన్ని సాధించింది. దాంతోపాటు కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని (52 సెకన్లు) అందుకుంది. యువ సంచలనం.. భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ మినహాయిస్తే మిగతా సమయంలో వారికి అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువే. అయినప్పటికీ మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలాంటి మేటి మహిళా క్రికెటర్ల విజయాలతో అమ్మాయిలు ఈ ఆటవైపు వస్తున్నారు. అందులో తాజా సంచలనం ముంబైకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్. గత ఏడాది నవంబర్‌లో సౌరాష్ట్రతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ (202 పరుగులు) కొట్టి వార్తల్లో నిలిచిన జెమీమా ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌పై 179 పరుగులు సాధించింది. ఈ ప్రదర్శన జెమీమాకు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పాల్గొనే భారత సీనియర్ జట్టులో చోటు దక్కేలా చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌కు జతగా జెమీమా (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలకదశలో రాణించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ‘పంచ్’ పడిందంటే... మేరీకోమ్ విజయాలతో ఎంతోమంది అమ్మాయిలు మహిళల బాక్సింగ్‌లో అడుగు పెట్టారు. విశ్వవేదికపై తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ కోవలోకే వస్తుంది అంకుశిత బోరో. అస్సాంకు చెందిన 17 ఏళ్ల ఈ గిరిజన అమ్మాయి గతేడాది ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 64 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. క్రీడా నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చిన అంకుశిత భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొని అందులో ప్రవేశం పొందింది. సహజ నైపుణ్యానికి తోడు కోచ్‌ల మార్గదర్శనంలో ఆమె ముందుకు దూసుకెళ్లింది. అహ్మెట్ కామెట్ (టర్కీ) టోర్నీ, బాల్కన్ టోర్నీ (బల్గేరియా) అంతర్జాతీయ టోర్నీల్లో రజతాలు నెగ్గిన అంకుశిత ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. నయా చరిత్ర... పురుషుల షూటింగ్‌తో పోలిస్తే మహిళల షూటింగ్లో భారత్‌కు గొప్ప రికార్డు లేదు. కానీ ఏడాదిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జూనియర్ స్థాయిలో పతకాల పంట పండించిన హరియాణా షూటర్ మను భాకర్, బెంగాలీ అమ్మాయి మెహులీ ఘోష్ సీనియర్ స్థాయిలో అందరికీ ఆశ్చర్యం కలిగే ప్రదర్శన చేశారు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో 16 ఏళ్ల మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత్ తరఫున స్వర్ణాలు నెగ్గిన పిన్న వయస్కురాలిగా కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు 17 ఏళ్ల మెహులీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో, మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యాలు గెలిచింది. రెండేళ్ల క్రితమే షూటింగ్లో అడుగు పెట్టిన మను అంతకుముందు మార్షల్ ఆర్ట్స్, స్కేటింగ్, క్రికెట్, బాక్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించింది. బాక్సింగ్‌లో కంటికి గాయం కావడంతో ఆమె తల్లి సలహాతో షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన మను పతకాల పంట పండిస్తూ భారత మహిళల షూటింగ్‌కు భరోసా కల్పించింది. -
అమిత్ ‘పసిడి’ పంచ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ఫైనల్లో సయీద్ మొర్దాజీ (మొరాకో)పై అమిత్ విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో సెవ్దా అసెనోవా (బల్గేరియా) చేతిలో మేరీకోమ్... అనా ఇవనోవా (రష్యా) చేతిలో సీమా ఓడిపోయారు. మహిళల విభాగంలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు లభించాయి. మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
భారత్ ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ చాటుకున్నారు. గురువారం ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మన బాక్సర్లు మొత్తం 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు. పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0–5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీకోమ్ 4–1తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్)ను ఓడించింది. మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), పూజ (69 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో దినేశ్ (69 కేజీలు), దేవాన్‡్ష జైస్వాల్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), సల్మాన్ షేక్ (52 కేజీలు) రజత పతకాలు గెలుపొందారు.