న్యూఢిల్లీ: భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన రిటైర్మెంట్ ప్రణాళికలను గురువారం వెల్లడించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఈ 36 ఏళ్ల మణిపురీ బాక్సర్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాతే ఆటకు గుడ్‌బై చెబుతానని ప్రకటించింది. ‘2020 టోక్యో ఒలింపిక్స్ అనంతరం రిటైర్మెంట్ తీసుకుంటా. అంతకన్నా ముందు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే నా దృష్టి ఉంది’ అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ తెలిపింది. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మేరీకోమ్ ఎన్నో ఘనతలు సాధించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్స్‌లో కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు పతకాలను దక్కించుకుంది.
రింగ్‌లో దిగిన ప్రతీసారి పతకం సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది. ‘దేశానికి పతకం అందించేందుకు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. కచ్చితంగా స్వర్ణం గెలవడమే లక్ష్యంగా బరిలో దిగుతా. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నా’ అని మేరీకోమ్ పేర్కొంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగనుండటంతో క్వాలిఫయర్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి మే వరకు క్వాలిఫయింగ్ పోటీలు జరుగనున్నాయి. అర్హత పోటీలను వచ్చే ఏడాది నిర్వహించడం పట్ల మేరీకోమ్ హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment