అదరగొట్టిన భారత బాక్సర్లు! | Five time World Champion Mary Kom | Sakshi
Sakshi News home page

పంచ్‌ పవర్‌!

Nov 19 2018 12:33 AM | Updated on Nov 19 2018 9:19 AM

Five time World Champion Mary Kom - Sakshi

న్యూఢిల్లీ: పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన ఐదు విభాగాల బౌట్‌లకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు విజయాలు సాధించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ (48 కేజీలు), మనీషా మౌన్‌ (54 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 2006 చాంపియన్‌ లైష్రామ్‌ సరితా దేవి (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. మరో బౌట్‌లో గెలిచి సెమీస్‌ చేరుకుంటే మేరీకోమ్, మనీషా, లవ్లీనా, భాగ్యవతిలకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి.

రికార్డుస్థాయిలో ఆరో స్వర్ణంపై గురి పెట్టిన భారత మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ ఈ మెగా ఈవెంట్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బరిలోకి దిగిన ఈ మణిపూర్‌ బాక్సర్‌ 5–0తో ఐజెరిమ్‌ కెసెనయేవా (కజకిస్తాన్‌)ను ఓడించింది. తొలి రౌండ్‌లో ఆచితూచి ఆడిన మేరీకోమ్‌ రెండో రౌండ్‌లో అవకాశం దొరికినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌లు విసిరింది. బౌట్‌ను పర్యవేక్షించిన నలుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 30–27 పాయింట్లు ఇవ్వగా... మరోజడ్జి 29–28 పాయింట్లు ఇచ్చారు. ‘తొలి బౌట్‌ కఠినంగానే సాగింది. టోర్నీలో మొదటి బౌట్‌ కావడంతో ఒత్తిడితో పాల్గొన్నా. అయితే     గత 16 ఏళ్లుగా నా అభిమానుల నుంచి ఈ రకమైన ఒత్తిడిని విజయవంతంగా అధిగమిస్తూ వస్తున్నా.

ఈ తరహా ఒత్తిడంటే నాకు ఇష్టమే’ అని 35 ఏళ్ల మేరీకోమ్‌ వ్యాఖ్యానించింది. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో చైనా బాక్సర్‌ వు యుతో మేరీకోమ్‌ తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా మౌన్‌ మరో సంచలనం నమోదు చేసింది. 54 కేజీల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ దీనా జాలమన్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన బౌట్‌లో మనీషా 5–0తో గెలుపొందింది. ఈ ఏడాది దీనాపై మనీషాకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం.   పోలాండ్‌లో ఇటీవలే జరిగిన సిలెసియాన్‌ టోర్నీలోనూ మనీషా చేతిలో దీనా ఓడిపోయింది. ‘ఒకసారి రింగ్‌లో అడుగుపెడితే నా ప్రత్యర్థి ప్రపంచ చాంపియనా? రజత పతక విజేతా? లాంటి విషయాలు అస్సలు పట్టించుకోను.

( భాగ్యవతి ,లవ్లీనా,మనీషా,సరితా దేవి )

క్వార్టర్‌ ఫైనల్లో్లనూ దూకుడుగానే ఆడతా’ అని మనీషా వ్యాఖ్యానించింది. ఇతర బౌట్‌లలో లవ్లీనా 5–0తో 2014 ప్రపంచ చాంపియన్‌ అథెనా బైలాన్‌ (పనామా)పై... భాగ్యవతి 4–1తో నికొలెటా షోన్‌బర్గర్‌ (జర్మనీ)పై గెలుపొందారు. మరో బౌట్‌లో 2006 ప్రపంచ చాంపియన్‌ సరితా దేవి 2–3తో కెలీ హారింగ్టన్‌ (ఐర్లాండ్‌) చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఫలితంపై సరితా దేవి అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మూడు రౌండ్‌లలోనూ ఆధిపత్యం చలాయించాను. కానీ జడ్జిల నిర్ణయంతో నిరాశ చెందాను.

అయితే వారి నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. 2014 ఆసియా క్రీడల్లో చోటు చేసుకున్న వివాదం కారణంగా నాపై ఏడాదిపాటు నిషేధం విధించారు. జడ్జిలను విమర్శించి మరోసారి వివాదంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’ అని 36 ఏళ్ల సరితా దేవి వ్యాఖ్యానించింది. మంగళవారం క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్టోకా పెట్రోవా (బల్గేరియా)తో మనీషా; స్కాట్‌ కయి ఫ్రాన్సెస్‌ (ఆస్ట్రేలియా)తో లవ్లీనా; పాలో జెస్సికా (కొలంబియా)తో  భాగ్యవతి తలపడతారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement