‘లెజెండ్’ మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ–ఐబా) ఆమెకు ‘లెజెండ్’ హోదాతో గౌరవించింది. స్విట్జర్లాండ్‌లోని మోంట్రెక్స్‌లో జరిగిన ఏఐబీఏ వార్షిక సదస్సులో మేరీకోమ్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో మేరీకోమ్‌తోపాటు ఒలింపిక్ మాజీ చాంపియన్స్ వ్లాదిమిర్ క్లిచ్‌కో (ఉక్రెయిన్), ఫెలిక్స్ సవాన్ (క్యూబా), బ్రహిమ్ అస్లూమ్ (ఫ్రాన్స్)లకు కూడా ‘లెజెండ్’ పురస్కారంతో గౌరవించారు. మణిపూర్‌కు చెందిన 33 ఏళ్ల మేరీకోమ్ గత 15 ఏళ్లలో అమెచ్యూర్ బాక్సింగ్‌లో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణించింది. వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... నాలుగుసార్లు ఆసియా విజేతగా నిలిచింది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గత నాలుగేళ్లుగా 51 కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్ తాజాగా 48 కేజీ విభాగానికి మారాలని నిర్ణయించుకుంది. వచ్చే టోక్యో ఒలింపిక్స్ (2020)లో మహిళల విభాగంలో ఈ కేటగిరీకి అవకాశం ఉండటంతో ఆమె 48 కేజీల విభాగానికి మారింది. మరోవైపు ఇదే కార్యక్రమంలో భారత్‌కే చెందిన వికాస్ క్రిషన్‌కు ‘ఐబా’ ప్రొ బాక్సింగ్‌లో ‘ఉత్తమ బాక్సర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఏడాది వికాస్ ‘ఐబా’ ఆధ్వర్యంలో రెండు ప్రొఫెషనల్ బౌట్‌లలో తలపడి విజయం సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు.