న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్‌తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment