Telangana Boxer nikhat
-
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. -
Nikhat Zareen: ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనాతో పాటు మన అమ్మాయి కూడా
Asian Games- Telangana Boxer Nikhat Zareen- న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ కోసం నిర్వహించిన ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (51 కేజీల విభాగం) 7–0 తేడాతో మంజురాణిపై ఘన విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాండ్జా మెమోరియన్ టోర్నీలో విజేతగా నిలిచిన నిఖత్... ఏషియాడ్‌లోనూ సత్తా చాటుతానని నమ్మకంతో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 వరకు చైనాలోనూ హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), జాస్మీన్ (60 కేజీ), మనీశా (57 కేజీ), సవీటీ బూరా (75 కేజీ) కూడా ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు. స్వర్ణపతకంతో తిరిగి రావాలి ఏషియాడ్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి... ఆమె స్వర్ణపతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ -
నిఖత్ ‘పసిడి’ పంచ్
సాక్షి, హైదరాబాద్: స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకంతో అదరగొట్టింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో నిఖత్ 4–1తో తెతియానా కోబ్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తద్వారా 73 ఏళ్ల చరిత్ర కలిగిన స్ట్రాండ్జా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్ గుర్తింపు పొందింది. 2019లోనూ నిఖత్ బంగారు పతకం సాధించింది. ఇదే టోర్నీలో మహిళల 48 కేజీల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. హరియాణాకు చెందిన నీతూ ఫైనల్లో 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై గెలిచింది. పసిడి పతకాలు నెగ్గిన నిఖత్, నీతూలకు 4 వేల డాలర్ల (రూ. 3 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. స్వర్ణం నెగ్గిన నిఖత్‌ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. నన్ను స్ట్రాండ్జా టోర్నీ రాణి అని పిలవచ్చు. రెండోసారి స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈసారి పసిడి పతకం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బుసెనాజ్ సాకిరోగ్లు (టర్కీ)ను ఓడించాను. ఈ ఏడాది మూడు ప్రముఖ ఈవెంట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు ఉన్నాయి. తాజా విజయం ఈ మెగా ఈవెంట్స్‌కు ముందు నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహంలేదు. –నిఖత్ జరీన్ -
ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌కు షాకిచ్చిన తెలంగాణ బాక్సర్
Nikhat Zareen Enters Finals Of Strandja Memorial Boxing: బల్గేరియా వేదికగా జరుగుతున్న 73వ ఎడిషన్ స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (25) పంజా విసిరింది. శుక్రవారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం సెమీస్‌లో టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ బుసె నాజ్ కకిరోగ్లు (టర్కీ)పై 4-1 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ పోరులో ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్.. తనదైన పంచ్‌లతో విరుచుకుపడి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ చివరిసారిగా 2019లో ఈ టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో నీతు గంగాస్ (హర్యానా) కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. నీతు.. సెమీస్‌లో ఉక్రెయిన్ బాక్సర్, 2018 వరల్డ్ ఛాంపియన్షిప్స్ రజత పతక విజేత హన్నా ఒఖోతాను చిత్తుగా ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. నీతు పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి రెండో రౌండ్లో కుప్పకూలిపోయింది. ఇక ఇదే టోర్నీలో యూత్ ప్రపంచ ఛాంపియన్ అరుంధతి చౌదరీ (70 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)లకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో అరుంధతి 1-4తో ఒలింపిక్ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో, పర్వీన్ 2-3తో నటాలియా (రష్యా) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం -
గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం
స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు (52 కేజీలు) తొలి రౌండ్లో ‘బై’ లభించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్లో బరిలోకి దిగుతుంది. ఈ బౌట్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం లభిస్తుంది. 2019లో ఈ టోర్నీలో నిఖత్ స్వర్ణం సాధించింది. ఈనెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి 17 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో మంజు బసుమతిరి (అస్సాం)పై నెగ్గింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ బౌట్లో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత మంజు రాణి 5–0తో మీనాక్షి (పంజాబ్)పై గెలిచింది. -
నిఖత్ జరీన్‌కు షాక్!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ పెద్ద టోర్నీలలో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశలపై భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పంచ్ విసిరింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్న ఆమెను ఊహించని విధంగా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో నిఖత్ పాల్గొనకుండా స్వయానా చీఫ్ సెలక్టర్ రాజేశ్ భండారి నిరోధించారు. నిఖత్ ఈవెంట్ అయిన 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్‌ను బీఎఫ్ఐ ఎంపిక చేసింది. ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మేరీకోమ్‌ను ఎంపిక చేసినట్లు బీఎఫ్ఐ ప్రకటించింది. మేరీకోమ్ ఈ ఏడాది ఇండియన్ ఓపెన్‌తో పాటు ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరిగిన ట్రయల్స్‌లో వన్లాల్ దువాతితో నిఖత్ తలపడాల్సి ఉంది. అయితే బౌట్ ఆరంభానికి కొద్దిసేపు ముందు ఈ పోరు జరగడం లేదని ఆమెకు భండారి చెప్పారు. బుధవారం జరగవచ్చని ఆశించినా... జాబితాలో ఆమె పేరు, కేటగిరీలే కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఈ నిజామాబాద్ బాక్సర్ దిగ్భ్రాంతికి గురైంది. ట్రయల్స్ నిర్వహించండి... తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ నిఖత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ యూత్ బాక్సింగ్ రజత, సీనియర్ ఆసియా కాంస్య పతక విజేత అయిన ఆమె తన సమస్యను, బాధను వెల్లడిస్తూ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. ఇటీవలే నిఖత్ థాయ్‌లాండ్‌లో జరిగిన టోర్నీలో కూడా రజతం సాధించింది. ‘ఇది చాలా ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. చిన్న వయసులోనే నేను ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగకుండా రక్షిస్తున్నామని, మంచి భవిష్యత్తు కోసం నా మేలు కోరుతున్నామని సెలక్టర్లు నాతో చెప్పారు. అయితే 2016లోనే ఈ టోర్నీలో పాల్గొన్న నేను ఇప్పుడు చిన్నదాన్ని ఎలా అవుతాను. కాబట్టి నన్ను ఆపేందుకు వయసు మాత్రమే కారణం కాదు. మీ ఆధ్వర్వంలో పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక నిబంధన నిజంగా ఉంటే అది బాక్సర్ల స్థాయి, ఘనతను బట్టి కాకుండా అందరికీ వర్తింపజేయాలి. బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించవద్దు. అందుకే మీ జోక్యం కోరుతున్నాను’ అని 23 ఏళ్ల నిఖత్ ఆ లేఖలో పేర్కొంది. సరైన నిర్ణయమే: భండారి నిఖత్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ భండారి సమర్థించుకున్నారు. భారత్ పతకావకాశాలు మెరుగ్గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బీఎఫ్ఐ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ను ఎంపిక చేశాం. ఆమె కోచ్ కూడా మాకు ఒక అభ్యర్థన పంపారు. దానిని పరిశీలించిన తర్వాత ట్రయల్స్ లేకుండానే ఎంపికయ్యేందుకు మేరీకోమ్‌కు అర్హత ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇటీవల ఇండియా ఓపెన్‌లో నిఖత్‌ను కూడా ఆమె ఓడించింది. జాతీయ శిబిరంలో కూడా అందరికంటే మెరుగ్గా కనిపించింది. నిఖత్ కూడా చాలా మంచి బాక్సర్. భవిష్యత్తులో ఆమెకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రదర్శన, అనుభవంపైనే మేరీకోమ్‌ని ఎంపిక చేశాం’ అని భండారి వివరించారు. మేరీకోమ్గీనిఖత్ మే నెలలో గువాహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో నిఖత్‌పై మేరీకోమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ‘నాకు స్ఫూర్తిగా నిలిచిన బాక్సర్తో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆమె వ్యూహాలను పసిగట్టి గట్టి పోటీనిస్తా’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అంత వివాదం ఏమీ లేదు. కానీ ఎందుకో మేరీకోమ్ అహం దెబ్బతిన్నట్లుంది! లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం తనకంటే ఎంతో జూనియర్ అయిన నిఖత్‌పై మ్యాచ్ తర్వాత ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ‘ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను చా లా ఏళ్లుగా ఆడుతున్నాను. నన్ను ఆమె సవాల్ చేస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చింది. నాకు ఆశ్చర్యంతో పాటు చికాకు కలిగింది. ముందు నిన్ను నువ్వు రింగ్‌లో నిరూపించుకో. ఆ తర్వాత నాపై వ్యాఖ్యలు చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయి లో ఒక్క పతకం గెలిచిన ఆమెకు ఇంత అహం అవసరమా? నాతో పోటీ పడటం ఆమె అదృష్టం’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిఖత్ కెరీర్ ఆరంభం నుంచి 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతోంది. మొదటి నుంచి 48 కేజీల విభా గంలో ఆడిన మేరీ కోమ్ దానిని ఒలింపిక్స్ నుంచి తప్పించడంతో ఇండియా ఓపెన్‌తోనే 51 కేజీలకు మారింది. దాంతో నిఖత్ అవకాశాలు దెబ్బతింటున్నాయి. నాటి ఘటనకు, ఇప్పుడు నిఖత్‌ను అడ్డుకోవడానికి సంబంధం ఉండవచ్చని బాక్సింగ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. -
క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్
ప్రపంచ మహిళల బాక్సింగ్ టోర్నీ అస్తానా (కజకిస్తాన్): సీనియర్ స్థాయిలో తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. మంగళవారం జరిగిన 54 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 0-3తో పియాపియో (చైనా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాతెర్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోగా... సవీటి బోరా (81 కేజీలు), సర్జూబాలా దేవి (48 కేజీలు), సీమా పూనియా(+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు. సోనియా 3-0తో అనెతా రిగిల్స్కా (పోలండ్)పై విజయం సాధించగా... సవీటి 0-3తో ఎలిఫ్ గునెరి (టర్కీ) చేతిలో, సర్జూబాలా 0-3తో నజిమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో, సీమా 0-3తో లజత్ కుంగ్బయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.