సాక్షి, హైదరాబాద్: స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకంతో అదరగొట్టింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో నిఖత్ 4–1తో తెతియానా కోబ్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తద్వారా 73 ఏళ్ల చరిత్ర కలిగిన స్ట్రాండ్‌జా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్ గుర్తింపు పొందింది.
2019లోనూ నిఖత్ బంగారు పతకం సాధించింది. ఇదే టోర్నీలో మహిళల 48 కేజీల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. హరియాణాకు చెందిన నీతూ ఫైనల్లో 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై గెలిచింది. పసిడి పతకాలు నెగ్గిన నిఖత్, నీతూలకు 4 వేల డాలర్ల (రూ. 3 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. స్వర్ణం నెగ్గిన నిఖత్‌ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు.
నన్ను స్ట్రాండ్‌జా టోర్నీ రాణి అని పిలవచ్చు. రెండోసారి స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈసారి పసిడి పతకం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బుసెనాజ్ సాకిరోగ్లు (టర్కీ)ను ఓడించాను. ఈ ఏడాది మూడు ప్రముఖ ఈవెంట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు ఉన్నాయి. తాజా విజయం ఈ మెగా ఈవెంట్స్‌కు ముందు నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహంలేదు.
–నిఖత్ జరీన్
Comments
Please login to add a commentAdd a comment