నిఖత్‌ జరీన్‌కు షాక్‌! | Boxer Nikhat shunted from World championship trials | Sakshi
Sakshi News home page

నిఖత్‌ జరీన్‌కు షాక్‌!

Published Thu, Aug 8 2019 4:54 AM | Last Updated on Thu, Aug 8 2019 4:54 AM

Boxer Nikhat shunted from World championship trials - Sakshi

మేరీకోమ్‌, నిఖత్‌ జరీన్‌

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ పెద్ద టోర్నీలలో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఆశలపై భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) పంచ్‌ విసిరింది. వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్న ఆమెను ఊహించని విధంగా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో నిఖత్‌ పాల్గొనకుండా స్వయానా చీఫ్‌ సెలక్టర్‌ రాజేశ్‌ భండారి నిరోధించారు. నిఖత్‌ ఈవెంట్‌ అయిన 51 కేజీల విభాగంలో భారత స్టార్‌ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్‌ను బీఎఫ్‌ఐ ఎంపిక చేసింది.

ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మేరీకోమ్‌ను ఎంపిక చేసినట్లు బీఎఫ్‌ఐ ప్రకటించింది. మేరీకోమ్‌ ఈ ఏడాది ఇండియన్‌ ఓపెన్‌తో పాటు ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో కూడా విజేతగా నిలిచింది. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం జరిగిన ట్రయల్స్‌లో వన్‌లాల్‌ దువాతితో నిఖత్‌ తలపడాల్సి ఉంది. అయితే బౌట్‌ ఆరంభానికి కొద్దిసేపు ముందు ఈ పోరు జరగడం లేదని ఆమెకు భండారి చెప్పారు. బుధవారం జరగవచ్చని ఆశించినా... జాబితాలో ఆమె పేరు, కేటగిరీలే కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఈ నిజామాబాద్‌ బాక్సర్‌ దిగ్భ్రాంతికి గురైంది.  

ట్రయల్స్‌ నిర్వహించండి...
తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ మాజీ జూనియర్‌ చాంపియన్‌ నిఖత్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ రజత, సీనియర్‌ ఆసియా కాంస్య పతక విజేత అయిన ఆమె తన సమస్యను, బాధను వెల్లడిస్తూ బాక్సింగ్‌ సమాఖ్యకు లేఖ రాసింది. ఇటీవలే నిఖత్‌ థాయ్‌లాండ్‌లో జరిగిన టోర్నీలో కూడా రజతం సాధించింది. ‘ఇది చాలా ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. చిన్న వయసులోనే నేను ప్రపంచ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగకుండా రక్షిస్తున్నామని, మంచి భవిష్యత్తు కోసం నా మేలు కోరుతున్నామని సెలక్టర్లు నాతో చెప్పారు.

అయితే 2016లోనే ఈ టోర్నీలో పాల్గొన్న నేను ఇప్పుడు చిన్నదాన్ని ఎలా అవుతాను. కాబట్టి నన్ను ఆపేందుకు వయసు మాత్రమే కారణం కాదు. మీ ఆధ్వర్వంలో పారదర్శకంగా ట్రయల్స్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక నిబంధన నిజంగా ఉంటే అది బాక్సర్ల స్థాయి, ఘనతను బట్టి కాకుండా అందరికీ వర్తింపజేయాలి. బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించవద్దు. అందుకే మీ జోక్యం కోరుతున్నాను’ అని 23 ఏళ్ల నిఖత్‌ ఆ లేఖలో పేర్కొంది.  

సరైన నిర్ణయమే: భండారి  
నిఖత్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్‌ భండారి సమర్థించుకున్నారు. భారత్‌ పతకావకాశాలు మెరుగ్గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బీఎఫ్‌ఐ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ను ఎంపిక చేశాం. ఆమె కోచ్‌ కూడా మాకు ఒక అభ్యర్థన పంపారు. దానిని పరిశీలించిన తర్వాత ట్రయల్స్‌ లేకుండానే ఎంపికయ్యేందుకు మేరీకోమ్‌కు అర్హత ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇటీవల ఇండియా ఓపెన్‌లో నిఖత్‌ను కూడా ఆమె ఓడించింది. జాతీయ శిబిరంలో కూడా అందరికంటే మెరుగ్గా కనిపించింది. నిఖత్‌ కూడా చాలా మంచి బాక్సర్‌. భవిష్యత్తులో ఆమెకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రదర్శన, అనుభవంపైనే మేరీకోమ్‌ని ఎంపిక చేశాం’ అని భండారి వివరించారు.  

మేరీకోమ్‌గీనిఖత్‌
మే నెలలో గువాహటిలో జరిగిన ఇండియా ఓపెన్‌ సెమీఫైనల్లో నిఖత్‌పై మేరీకోమ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ‘నాకు స్ఫూర్తిగా      నిలిచిన బాక్సర్‌తో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆమె వ్యూహాలను పసిగట్టి గట్టి పోటీనిస్తా’ అని నిఖత్‌ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అంత వివాదం ఏమీ లేదు. కానీ ఎందుకో మేరీకోమ్‌ అహం దెబ్బతిన్నట్లుంది! లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం తనకంటే ఎంతో జూనియర్‌ అయిన నిఖత్‌పై మ్యాచ్‌ తర్వాత ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ‘ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను చా లా ఏళ్లుగా ఆడుతున్నాను. నన్ను ఆమె సవాల్‌ చేస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చింది.

నాకు ఆశ్చర్యంతో పాటు చికాకు కలిగింది. ముందు నిన్ను నువ్వు రింగ్‌లో నిరూపించుకో. ఆ తర్వాత నాపై వ్యాఖ్యలు చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయి లో ఒక్క పతకం గెలిచిన ఆమెకు ఇంత అహం అవసరమా? నాతో పోటీ పడటం ఆమె అదృష్టం’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిఖత్‌ కెరీర్‌ ఆరంభం నుంచి 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతోంది. మొదటి నుంచి 48 కేజీల విభా గంలో ఆడిన మేరీ కోమ్‌ దానిని ఒలింపిక్స్‌ నుంచి తప్పించడంతో ఇండియా ఓపెన్‌తోనే 51 కేజీలకు మారింది. దాంతో నిఖత్‌ అవకాశాలు దెబ్బతింటున్నాయి. నాటి ఘటనకు, ఇప్పుడు నిఖత్‌ను అడ్డుకోవడానికి సంబంధం ఉండవచ్చని బాక్సింగ్‌ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement