Nikhat Zarin
-
పారిస్‌కు మన లేడీస్..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ వేదికపై మరోసారి హైదరాబాదీ అమ్మాయిలు దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నారు. పారిస్‌లో జరగనున్న 2024 ఒలింపిక్ పోటీలు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ భారత క్రీడాకారుల బృందంలో 47 మంది మహిళా అథ్లెట్లు ఉండగా.. అందులో నలుగురు హైదరాబాదీలే ఉండటం గమనార్హం.ముఖ్యంగా ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించలేదు. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి ఒలింపిక్స్ వెళ్లిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని శ్రీజ ఆకులపై అంచనాలు పెరిగాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీజ ఆకుల, శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం 2016, 2020 ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలను సాధించిపెట్టి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పీవీ సింధు కచి్చతంగా పతకంతోనే తిరిగొస్తుందని దేశమంతా దీమాగా ఉంది.రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన మరో అథ్లెట్ నిఖత్ జరీన్ భారతీయ బృందంలో స్టార్ ప్లేయర్‌గా పారిస్ వెళ్లింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఇదే ఏడాది ఏషియన్ గేమ్స్‌లోనూ కాంస్యం సాధించింది. 13 ఏళ్ల వయస్సులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరిలో నేషనల్ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌పై కూడా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఏషియన్‌గేమ్స్‌లో రజత పతకంతో రాణించిన ఇషా ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని ఖాయం చేస్తుందని క్రీడా ప్రముఖులు అభిలాíÙస్తున్నారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మాజీ ఒలింపిక్స్ పతక విజేత, హైదరాబాదీ పీవీ సింధూనే ఫ్లాగ్ బేరర్స్‌గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో మన క్రీడాకారులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
నిఖత్ శుభారంభం స్ట్రాండ్జా స్మారక బాక్సింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 51 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ 5–0తో యాస్మీన్ ముతాకి (మొరాకో)పై ఘనవిజయం సాధించింది. ఇదే టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగంలో భారత బాక్సర్ శివ థాపాకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మరోవైపు సెర్బియాలో ముగిసిన నేషన్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోరీ్నలో భారత్‌కు నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మీనా కుమారి (54 కేజీలు), రితూ గ్రెవాల్ (51 కేజీలు), మోనిక (48 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు నెగ్గగా... సెమీస్‌లో ఓడిన బసుమతారి (64 కేజీలు), పవిత్ర (60 కేజీలు) కాంస్యాలు సాధించారు. -
మేరీనే క్వాలిఫయర్స్‌కు...
ఆమె ఒక దిగ్గజ బాక్సర్. ఒకట్రెండు సార్లు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... ఐదుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచింది. అంతేనా... భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మహిళల బాక్సింగ్‌కు మణిపూస లాంటిది. రాష్ట్రపతి స్వయంగా ఎగువసభకు నామినేట్ చేసిన ఎంపీ కూడా! అంతటి మేటి బాక్సర్ ఏకపక్ష విజయం సాధించడం వరకు బాగానే ఉన్నా... అనుభవరీత్యా తనకంటే ఎంతో జూనియర్ అయిన ప్రత్యర్థితో తలపడుతున్నపుడు... విజయానంతరం ఆమె వ్యవహరించిన తీరు క్రీడాలోకాన్ని విస్మయపరిచింది. ఇంతకాలం తన పంచ్‌లతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ మేటి బాక్సర్ మేరీకోమ్ కాగా... ఈ మణిపూర్ బాక్సర్‌కు సవాల్ విసిరిన క్రీడాకారిణి తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. కొన్ని నెలలుగా ఎంతో ఉత్కంఠరేపిన మహిళల బాక్సింగ్ ట్రయల్స్ శనివారంతో ముగియగా... భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి వెళ్లే ఐదుగురు బాక్సర్లు కూడా ఖరారయ్యారు. న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత పొందింది. మహిళల 51 కేజీల ట్రయల్ ఫైనల్ బౌట్లో ఆమె 9–1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను ఓడించింది. దీంతో ఈ కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో మేరీ పోటీపడనుంది. మిగతా ట్రయల్స్ పోటీల్లో 57 కేజీల్లో రెండుసార్లు ప్రపంచ రజత పతక విజేత అయిన సోనియా లాథర్‌కు చుక్కెదురైంది. సాక్షి చౌదరి ధాటికి ఆమె ఓడిపోయింది. 60 కేజీల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్ సరితా దేవి కూడా జాతీయ చాంపియన్ సిమ్రన్‌జీత్ కౌర్ చేతిలో కంగుతింది. 69 కేజీల విభాగంలో లలితాపై లవ్లీనా బొర్గొహైన్... 75 కేజీల విభాగంలో నుపుర్‌పై పూజా రాణి గెలిచి క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదించారు. ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ పోటీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు చైనాలో జరుగుతాయి. ఇందులో రాణించిన బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తారు. హోరాహోరీ అనుకున్నా... తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. తనకూ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ అవకాశమివ్వాలంటూ పట్టుపట్టి మరీ ట్రయల్స్ పెట్టాలంది. ఒలింపిక్స్ అర్హతే లక్ష్యంగా పగలూ రాత్రి కష్టపడిన ఆమె... మేరీతో దీటుగా తలపడే అవకాశముందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) కూడా భావించింది. అందుకే ఆమె ప్రతిభకు వెన్నంటే నిలిచింది. నిఖత్‌కు మద్దతు తెలిపేందుకు ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డితోపాటు తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే తీరా పోటీదగ్గరకొచ్చేసరికీ ఏకపక్షమవుతుందని ఎవరూ ఊహించలేదు. 36 ఏళ్ల మణిపూర్ వెటరన్ దిగ్గజాన్ని ఢీకొట్టడం అంత సులువు కాదని బౌట్ మొదలైన కాసేపటికే తెలంగాణ అమ్మాయికి తెలిసొచ్చింది. స్పష్టమైన పంచ్ లతో మేరీకోమ్ విజృంభిస్తుంటే నిఖత్ వద్ద సమాధానం లేకపోయింది. ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ సంధించిన పంచ్‌లు బౌట్‌ను పర్యవేక్షించిన జడ్జిలను ఆకట్టుకోలేకపోయాయి. కేవలం ఒక్కరు మాత్రమే నిఖత్‌కు పాయింట్ ఇవ్వగా... మిగతా తొమ్మిది మంది మేరీకోమ్ పైచేయి సాధించిందని భావించారు. అయితే విజయగర్వంతో ప్రత్యరి్థకి కనీస గౌరవం ఇవ్వకుండా మేరీకోమ్ రింగ్ నుంచి బయటికి రావడం పలు విమర్శలకు తావిచ్చింది. తనతో పోరాడిన ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ బాక్సర్‌కు మేరీలాంటి దిగ్గజం కరచాలనం చేయకపోవడం దారుణమని క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి. అసలేమైంది... ఏమిటీ వివాదం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ తీసుకున్న నిర్ణయం ట్రయల్స్ వివాదాన్ని రేపింది. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్íÙప్లో మేరీ కాంస్యం గెలిచింది. దీంతో ఆయన పతక విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయర్ బెర్త్‌లని ప్రకటించారు. అంటే ట్రయల్స్‌లో పాల్గొనకుండా మేరీకి మినహాయింపు ఇవ్వడం ఏంటని ఆ కేటగిరీ (51 కేజీలు)లో ఉన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రశి్నంచింది. బీఎఫ్ఐ తీరుపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా కేంద్ర క్రీడాశాఖకు లేఖ రాసింది. ట్రయల్స్ పోటీల ద్వారానే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బెర్త్‌లు ఖరారు చేయాలని కోరింది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రాలాంటి ఆటగాళ్లు ఆమె ట్రయల్స్ కోరడాన్ని సమరి్థంచారు. దీనిపై స్పందించిన ఆ శాఖ ట్రయల్స్ నిర్వహించాలంటూ బీఎఫ్ఐను ఆదేశించింది. దీంతో నేరుగా చైనా (క్వాలిఫయర్స్) వెళ్లే అవకాశాన్ని పోటీదాకా తెచ్చిన నిఖత్ జరీన్‌పై మేరీ కోపం పెంచుకుంది. అందుకేనేమో బౌట్ ముగిశాక చేయి కలపలేదు. ప్రత్యర్థితో ఏ మాత్రం హుందాగా ప్రవర్తించకుండా తన మానాన తాను వెళ్లిపోయింది. -
నిఖత్ x మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు సమయం వచ్చేసింది. నేడు జరిగే బౌట్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌తో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తలపడనుంది. 51 కేజీల విభాగంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా ఈ ముఖాముఖీ జరగనుంది. ఇందులో గెలిచే బాక్సర్‌కే ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుక్రవారం జరిగిన తమ తొలి రౌండ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించి వీరిద్దరు తుది పోరుకు సన్నద్ధమయ్యారు. నిఖత్ 10–0తో ప్రస్తుత జాతీయ చాంపియన్ జ్యోతి గులియాను, మేరీకోమ్ 10–0తో రితు గ్రేవాల్‌ను ఓడించారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఒక దశలో ఎంతో సీనియర్ అయిన మేరీకోమ్ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరక ర వ్యాఖ్యలు చేసింది. బాక్సింగ్ వర్గాల్లో ఎక్కువ మం ది నిఖత్కే అం డగా నిలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్రయల్స్‌కు సమాఖ్య ఒప్పుకుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
ట్రయల్స్‌కు బాక్సర్ నిఖత్ అర్హత
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్‌కు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ అర్హత సాధించింది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్, జ్యోతి గులియా, రితూ గ్రేవాల్‌లతో పాటు నిఖత్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ నెల 27, 28 తేదీల్లో ట్రయల్స్ జరుగుతాయి. ఈ నలుగురు బాక్సర్లకు ర్యాంకింగ్స్ కేటాయించగా మేరీకోమ్ మొదటి, నిఖత్ రెండో స్థానంలో ఉన్నారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నిబంధనల ప్రకారం తొలి స్థానంలో ఉన్న మేరీకోమ్, నాలుగో స్థానంలో ఉన్న రితూతో తలపడుతుంది. జ్యోతిని నిఖత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు బౌట్లలో గెలిచిన వారి మధ్య ఫైనల్ బౌట్ ఉంటుంది. మేరీ, నిఖత్ తమ తొలి బౌట్లలో విజయం సాధిస్తే వారిద్దరు ఫైనల్లో తలపడతారు. తుది విజేతకు మాత్రమే ఫిబ్రవరిలో చైనాలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం ఉంటుంది. -
జరీన్ ఎవరు.. అభినవ్ నీకు రూల్స్ తెలుసా?
న్యూఢిల్లీ: దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. బీఎఫ్ఐ స్వయం ప్రతిపత్తిగల సంస్థ కావడంతో దానికే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. దీనికి జరీన్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. వెంటనే స్పందించినందకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నానని జరీన్ తన సమాధానంలో పేర్కొన్నారు. కాకపోతే ఇలా కిరణ్ రిజ్జు వరకూ ఈ వివాదాన్ని తీసుకు రావడంతో మేరీకోమ్ మండిపడ్డారు. ‘ అసలు ఆమె ఎవరు.. ఆమె గురించి నాకు అస్సలు తెలియదు’ అంటూనే కాస్త ఘాటుగా స్పందించారు. ‘ ఈ వివాదాన్ని తెరపైకి తెవడంతో నేను షాక్ అయ్యా. నేను ఎనిమిది వరల్డ్ చాంపియన్స్ పతకాలు గెలిచా. అందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఎవర్నీ పంపాలో బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. అటువంటప్పుడు నీ ఏడుపు ఏమిటి. భారత బాక్సింగ్ జట్టులో చోటు కోసం లాబీయింగ్ చేయకు’ అంటూ మేరీకోమ్ ఎదురుదాడికి దిగారు. అదే సమయంలో జరీన్‌కు మద్దతుగా నిలిచిన భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రాపై మేరీకోమ్ నోరు పారేసుకున్నారు ‘నీ పని నువ్వు చూసుకో. బాక్సింగ్‌లో దూరకు. నీకు బాక్సింగ్ గురించి కానీ రూల్స్ కానీ తెలియదు. నేను ఏమైనా షూటింగ్ గురించి మాట్లాడానా. నీకు బాక్సింగ్ పాయింట్ల విధానం తెలుసా’ అంటూ మండిపడ్డారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మేరీకోమ్ ఎంతటి చాంపియన్ అయినా కానీ ఇలా మాట్లాడటం తగదంటున్నారు అభిమానులు. దేనికైనా హుందాగా సమాధానం చెబితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. కొందరు మేరీకోమ్ అతి చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. మేరీకోమ్-జరీన్‌లు 51 కేజీల వెయిట్ కేటగిరీలో ఉండటంతోనే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెలక్షన్ ట్రయల్స్ బౌట్ వివాదం పెద్దదిగా మారింది. -
నేను జోక్యం చేసుకోలేను!
న్యూఢిల్లీ: బాక్సర్లు మేరీకోమ్, నిఖత్ జరీన్ (51 కేజీలు) ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెలక్షన్ ట్రయల్స్ బౌట్ వివాదంలో తాను నేరుగా జోక్యం చేసుకోలేనని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే దేశానికి మేలు జరిగే నిర్ణయాన్ని తీసుకోవాలని మాత్రం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు సూచిస్తానని ఆయన తెలిపారు. ‘దేశానికి, క్రీడలకు, క్రీడాకారులకు మేలు జరిగే నిర్ణయం తీసుకోవాలని భారత బాక్సింగ్ సమాఖ్యకు నేను కచ్చితంగా సూచిస్తాను. అయితే ఒలింపిక్ చార్టర్ నిబంధనల ప్రకారం స్వయం ప్రతిపత్తిగల క్రీడా సమాఖ్యల సెలక్షన్ నిర్ణయాల్లో ప్రభుత్వ మంత్రులు జోక్యం చేసుకోరాదు’ అని కిరణ్ రిజిజు ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘తక్షణమే స్పందించినందుకు ధన్యవాదాలు సర్. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నాను’ అని క్రీడల మంత్రి స్పందనకు నిఖత్ సమాధానం ఇచి్చంది. -
'నాకు న్యాయం కావాలి'
రెండు నెలల వ్యవధిలో రెండో సారి ఒక దిగ్గజ బాక్సర్తో మరో యువ బాక్సర్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి! అయితే అది బాక్సింగ్ రింగ్‌లో మాత్రం కాదు. నిబంధనలకు విరుద్ధంగా సమాఖ్య ఏకపక్ష నిర్ణయాలతో స్టార్ క్రీడాకారిణికి మద్దతు పలుకుతుంటే తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఒక వర్ధమాన ప్లేయర్ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి. వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్ సమయంలో మేరీ కోమ్ పక్షాన నిలిచిన ఫెడరేషన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్ విషయంలో కూడా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అన్యాయం చేసింది. దాంతో తన బాధను ఆమె మంత్రి ముందుంచింది. మేరీకోమ్ స్థాయి ఎంత పెద్దదైనా... ఈ విషయంలో జరీన్‌కు క్రీడా ప్రముఖులనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం. న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌తో తనకు సెలక్షన్ పోటీలు పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది. వెటరన్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకి లబ్ది చేకూర్చేలా భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వ్యవహరిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నపళంగా రద్దు చేసి భారత బాక్సింగ్ జట్టులో మణిపూర్ సీనియర్ బాక్సర్ మేరీకి చోటు కలి్పంచారు. ఆ పోటీల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇప్పుడు ‘పతక విజేత’ అనే కారణం చూపి చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో యువ బాక్సర్ నిఖత్‌కు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. మేరీ పోటీపడే 51 కేజీల వెయిట్కేటగిరే ఆమె పాలిట శాపమవుతోంది. ఆగస్టులో జరిగిన నష్టానికి అసంతృప్తి వ్యక్తం చేసి మిన్నకుండిన ఆమె... ఇప్పుడు తన ఒలింపిక్స్ ప్రయణాన్ని ఇలా అడ్డుకోవడాన్ని సహించలేకపోయింది. ప్రత్యర్థుల కంటే ముందు బాక్సింగ్ సమాఖ్య, క్రీడా పాలకులతోనే పోరాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ‘సర్, క్రీడల్లో మూల సూత్రం నిజాయితీగా పోటీపడటమే. ప్రతీసారి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తలపడాల్సిందే. ఒలింపిక్ స్వర్ణ విజేత అయినా కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మళ్లీ అర్హత సాధించాల్సిందే. ఓ మేటి బాక్సింగ్ దిగ్గజమైన మేరీకోమ్ అంటే నాకెంతో గౌరవం. నా టీనేజ్‌లో ఆమెను చూసే నేను స్ఫూర్తి పొందా. అయితే అలాంటి బాక్సర్‌ను ట్రయల్స్ నుంచి దాచాల్సిన అవసరమేముంది? ఆమె ఒలింపిక్స్ అర్హతను నిలబెట్టుకోలేదా’ అని తన వాదనను లేఖలో వివరించింది. ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా సెలక్షన్ ట్రయల్స్ తర్వాతే ఎంపిక చేయండని, అదే సరైన ప్రాతిపదిక అని ఆమె కోరింది. దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా) 23 సార్లు ఒలింపిక్ స్వర్ణాలతో రికార్డు సృష్టించినా కూడా ఒలింపిక్స్ కోసం మళ్లీ అర్హత పోటీల్లో తలపడిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు స్వర్ణ, రజత విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ అవకాశమని బీఎఫ్ఐ చెప్పింది. ఇప్పుడేమో కాంస్యం గెలిచిన మేరీకోసం మరోసారి మాటమార్చింది. ఆమెకు క్వాలిఫయింగ్ బెర్తు కట్టబెట్టింది. నిఖత్ డిమాండ్ సబబే: బింద్రా భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా బాక్సర్ నిఖత్ జరీన్ డిమాండ్‌ను సమర్దించాడు. క్వాలిఫయింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ముందుగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అన్నాడు. ‘నాకు మేరీ అంటే ఎనలేని గౌరవం. అయితే ఒక అథ్లెట్ కెరీర్లో అన్ని సవాళ్లే... అన్నింటికీ నిరూపించుకోవాల్సిందే. నిన్నటి కంటే నేడు గొప్ప అని ఎప్పటికప్పుడు చాటుకోవాలి. క్రీడల్లో గత విజయాలెప్పుడు భవిష్యత్ అర్హతలకు సరిపోవు. మళ్లీ పోటీపడాలి... అర్హత సాధించాలి’ అని బింద్రా అన్నాడు. -
అయ్యో... నిఖత్!
న్యూఢిల్లీ: మరోసారి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నుంచి నిరాశే ఎదురైంది. సెలక్షన్ ట్రయల్స్‌ను పక్కనబెట్టి మళ్లీ పతక విజేతలకు బీఎఫ్ఐ జైకొట్టడంతో నిఖత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు దూరమైంది. ఈ ఆగస్టులోచాంపియన్షిప్కు ముందు కూడా ఇలాంటి నిర్ణయంతో నిఖత్ జరీన్ ఇంటికే పరిమితమైంది. మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ కూడా నిఖత్ వెయిట్ కేటగిరీ (51 కేజీలు) కావడం తెలంగాణ బాక్సర్‌కు శాపమైంది. మేటి బాక్సర్‌ను కాదనలేక, షెడ్యూలు ప్రకారం ట్రయల్స్ నిర్వహించకుండానే మేరీని బీఎఫ్ఐ ఖరారు చేసింది. ఇప్పుడు నిఖత్ ఒలింపిక్స్ ఆశల్ని క్వాలిఫయింగ్‌కు ముందే తుంచేసింది. వచ్చే ఫిబ్రవరిలో ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగనున్నాయి. ఈ ఈవెంట్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన విజేతల్ని బీఎఫ్ఐ ఎంపిక చేసింది. అక్కడ కాంస్యాలు నెగ్గిన మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) సెలక్షన్ ట్రయల్స్‌తో నిమిత్తం లేకుండానే చైనా ఈవెంట్‌కు అర్హత పొందారు. దీంతో 51 కేజీల కేటగిరీలో ఉన్న నిఖత్ సెలక్షన్ బరిలోకి దిగకుండానే బీఎఫ్ఐ చేతిలో నాకౌట్ అయ్యింది. బాక్సింగ్ సమాఖ్య నిర్ణయంపై మేరీ సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. పతక విజేతనైనా నాకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో పాల్గొనే అవకాశమిచి్చన బీఎఫ్ఐకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని పేర్కొంది. -
నిఖత్ జరీన్‌కు షాక్!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ పెద్ద టోర్నీలలో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశలపై భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పంచ్ విసిరింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్న ఆమెను ఊహించని విధంగా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో నిఖత్ పాల్గొనకుండా స్వయానా చీఫ్ సెలక్టర్ రాజేశ్ భండారి నిరోధించారు. నిఖత్ ఈవెంట్ అయిన 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్‌ను బీఎఫ్ఐ ఎంపిక చేసింది. ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మేరీకోమ్‌ను ఎంపిక చేసినట్లు బీఎఫ్ఐ ప్రకటించింది. మేరీకోమ్ ఈ ఏడాది ఇండియన్ ఓపెన్‌తో పాటు ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరిగిన ట్రయల్స్‌లో వన్లాల్ దువాతితో నిఖత్ తలపడాల్సి ఉంది. అయితే బౌట్ ఆరంభానికి కొద్దిసేపు ముందు ఈ పోరు జరగడం లేదని ఆమెకు భండారి చెప్పారు. బుధవారం జరగవచ్చని ఆశించినా... జాబితాలో ఆమె పేరు, కేటగిరీలే కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఈ నిజామాబాద్ బాక్సర్ దిగ్భ్రాంతికి గురైంది. ట్రయల్స్ నిర్వహించండి... తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ నిఖత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ యూత్ బాక్సింగ్ రజత, సీనియర్ ఆసియా కాంస్య పతక విజేత అయిన ఆమె తన సమస్యను, బాధను వెల్లడిస్తూ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. ఇటీవలే నిఖత్ థాయ్‌లాండ్‌లో జరిగిన టోర్నీలో కూడా రజతం సాధించింది. ‘ఇది చాలా ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. చిన్న వయసులోనే నేను ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగకుండా రక్షిస్తున్నామని, మంచి భవిష్యత్తు కోసం నా మేలు కోరుతున్నామని సెలక్టర్లు నాతో చెప్పారు. అయితే 2016లోనే ఈ టోర్నీలో పాల్గొన్న నేను ఇప్పుడు చిన్నదాన్ని ఎలా అవుతాను. కాబట్టి నన్ను ఆపేందుకు వయసు మాత్రమే కారణం కాదు. మీ ఆధ్వర్వంలో పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక నిబంధన నిజంగా ఉంటే అది బాక్సర్ల స్థాయి, ఘనతను బట్టి కాకుండా అందరికీ వర్తింపజేయాలి. బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించవద్దు. అందుకే మీ జోక్యం కోరుతున్నాను’ అని 23 ఏళ్ల నిఖత్ ఆ లేఖలో పేర్కొంది. సరైన నిర్ణయమే: భండారి నిఖత్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ భండారి సమర్థించుకున్నారు. భారత్ పతకావకాశాలు మెరుగ్గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బీఎఫ్ఐ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ను ఎంపిక చేశాం. ఆమె కోచ్ కూడా మాకు ఒక అభ్యర్థన పంపారు. దానిని పరిశీలించిన తర్వాత ట్రయల్స్ లేకుండానే ఎంపికయ్యేందుకు మేరీకోమ్‌కు అర్హత ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇటీవల ఇండియా ఓపెన్‌లో నిఖత్‌ను కూడా ఆమె ఓడించింది. జాతీయ శిబిరంలో కూడా అందరికంటే మెరుగ్గా కనిపించింది. నిఖత్ కూడా చాలా మంచి బాక్సర్. భవిష్యత్తులో ఆమెకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రదర్శన, అనుభవంపైనే మేరీకోమ్‌ని ఎంపిక చేశాం’ అని భండారి వివరించారు. మేరీకోమ్గీనిఖత్ మే నెలలో గువాహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో నిఖత్‌పై మేరీకోమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ‘నాకు స్ఫూర్తిగా నిలిచిన బాక్సర్తో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆమె వ్యూహాలను పసిగట్టి గట్టి పోటీనిస్తా’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అంత వివాదం ఏమీ లేదు. కానీ ఎందుకో మేరీకోమ్ అహం దెబ్బతిన్నట్లుంది! లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం తనకంటే ఎంతో జూనియర్ అయిన నిఖత్‌పై మ్యాచ్ తర్వాత ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ‘ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను చా లా ఏళ్లుగా ఆడుతున్నాను. నన్ను ఆమె సవాల్ చేస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చింది. నాకు ఆశ్చర్యంతో పాటు చికాకు కలిగింది. ముందు నిన్ను నువ్వు రింగ్‌లో నిరూపించుకో. ఆ తర్వాత నాపై వ్యాఖ్యలు చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయి లో ఒక్క పతకం గెలిచిన ఆమెకు ఇంత అహం అవసరమా? నాతో పోటీ పడటం ఆమె అదృష్టం’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిఖత్ కెరీర్ ఆరంభం నుంచి 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతోంది. మొదటి నుంచి 48 కేజీల విభా గంలో ఆడిన మేరీ కోమ్ దానిని ఒలింపిక్స్ నుంచి తప్పించడంతో ఇండియా ఓపెన్‌తోనే 51 కేజీలకు మారింది. దాంతో నిఖత్ అవకాశాలు దెబ్బతింటున్నాయి. నాటి ఘటనకు, ఇప్పుడు నిఖత్‌ను అడ్డుకోవడానికి సంబంధం ఉండవచ్చని బాక్సింగ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. -
ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్
న్యూఢిల్లీ: బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, హుసాముద్దీన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన జరీన్ 4–1తో జుతమస్ జిత్పోంగ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించగా... మరో తెలంగాణ బాక్సర్, కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత హుసాముద్దీన్ పురుషుల 56 కేజీల విభాగంలో 3–2తో అమ్మరిట్ యోదమ్ (థాయ్‌లాండ్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. వీరితో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత దీపక్ సింగ్ (49 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), బ్రిజేష్ యాదవ్ (81 కేజీలు)లు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మంజు రాణి (48 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
క్వార్టర్స్‌లో నిఖత్
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) శుభారంభం చేశారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరగా... హుసాముద్దీన్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన నిఖత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–0తో తస్మీన్ బెన్నీ (న్యూజిలాండ్)పై గెలిచింది. హుసాముద్దీన్ తొలి రౌండ్లో 4–1తో యుతాపోంగ్ థోంగ్డి (థాయ్‌లాండ్)ను ఓడించాడు. -
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి నిఖత్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బల్గేరియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 20న మొదలయ్యే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టును ప్రకటించారు. మహిళల విభాగంలో ఐదుగురు, పురుషుల విభాగంలో పదిమంది బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో పోటీపడుతుంది. మీనా కుమారి (54 కేజీలు), ప్రీతి బెనివాల్ (60 కేజీలు), జ్యోతి (64 కేజీలు), మోనికా సౌన్ (75 కేజీలు) మిగతా సభ్యులుగా ఉన్నారు. పురుషుల విభాగంలో గువాహటిలో గత నెలలో జరిగిన సీనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిని ఈ టోర్నీకి ఎంపిక చేశారు. పది మందితో కూడిన జట్టులో రియో ఒలింపియన్స్ శివ థాపా (60 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు) ఉన్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో నిఖత్
అస్తానా (కజకిస్తాన్ ): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన 54 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 2-1తో బియాంకా ఎల్ మీర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎరికా అడ్జీ (కెనడా)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో పూజా రాణి, 57 కేజీల విభాగంలో సోనియా లాథెర్ కూడా శుభారంభం చేశారు. మరియా బొరుత్సా (ఉక్రెయిన్)పై పూజా రాణి... గెండెగ్మా మ్యాగ్మార్ (మంగోలియా)పై సోనియా గెలుపొందారు. -
పురస్కార రత్నాలు
♦ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఎంపిక ♦ జర్నలిజంలో విశేషకృషి చేసిన అఖిలేశ్వరికి కూడా.. ♦ మహిళా దినోత్సవం రోజు రూ. ఒక లక్షతో నగదు అవార్డు నిఖత్ జరీన్‌కు పురస్కారం నిజామాబాద్ స్పోర్ట్స్ : బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయస్థాయికి ఎదిగిన జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష నగదు పురస్కారంతో సన్మానించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఘనంగా సత్కరించనుంది. అందులో జరీన్‌కు చోటు లభించడంపై జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన నిఖత్ జరీన్ తండ్రి జలీల్ మధ్యతరగతి కుటుంబానికి చెందివారు. నిఖత్ చిన్నవయస్సు నుంచే బాక్సింగ్ కోచ్ తన గురువు శంషొద్దీన్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం జిందాల్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా నిఖత్‌కు ఢిల్లీలో కఠోర శిక్షణ తీసుకుంటోంది. ఇదివరకే జరీన్ రూ. 50 లక్షల నజరానాను అందుకుంది. మహిళా జర్నలిస్టు అఖిలేశ్వరికి సన్మానం నిజామాబాద్ అర్బన్ : జర్నలిజంలో విశేష సేవలందించిన జిల్లా కేంద్రంలోని నర్సాగౌడ్ వీధికి చెందిన అఖిలేశ్వరిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. ఆమెకు రూ. లక్ష నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ఆఖిలేశ్వరి ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1977 సంవత్సరంలో ఈమె జర్నలిజంలోకి అగుడు పెట్టారు. ఆనాడు జర్నలిజంలో మహిళలు అరుదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో చైన పర్యటన, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం వెంబడి వివిధ దేశాల పర్యటనకు జర్నలిస్టు ప్రతినిధిగా అఖిలేశ్వరి వెళ్లారు. నిజామాబాద్‌లోని నర్సాగౌడ్ వీధికి చెందిన నర్సాగౌడ్ అఖిలేశ్వరి తాత. -
మన మేరీకోమ్
లండన్ ఒలంపిక్స్ రింగ్‌లో పతకం సాధించి తెచ్చిన బాక్సర్ మేరీకోమ్‌తో.. తలపడతానంటోంది మన హైదరాబాదీ నిఖత్ జరీన్. ఇటీవల జలంధర్‌లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్.. 2016 రియో ఒలంపిక్స్ రింగ్‌లో అడుగుపెట్టాలంటే మేరీ కోమ్‌ను ఢీ కొట్టి.. ఆమెను ఓడించాల్సి ఉంది. ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అంటున్న నిఖత్.. మేరీపై పై చేయి సాధిస్తానని చెబుతోంది. 13 ఏళ్లకే బాక్సింగ్‌లోకి ప్రవేశించి.. సీనియర్ క్యాంప్‌లో దూసుకుపోతూ.. ప్రస్తుతం దోమలగూడ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఈ యంగ్ పంచ్ చెబుతున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే.. ..:: నిఖితా నెల్లుట్ల నాన్న జమీల్ అహ్మద్ అథ్లెట్ కావడంతో చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ అంటే ఆసక్తి. స్కూల్ డేస్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను. అదే సమయంలో మా పీటీ సార్ సలహా మేరకు బాక్సింగ్ వైపు మొగ్గు చూపాను. బాక్సింగ్ అనగానే ముఖంపై గాయాలవుతాయని అందరూ భయపెట్టారు. నాన్న ప్రోత్సాహంతో ముందుకుసాగాను. ఒక్కసారి రింగ్‌లోకి దిగాక.. ఆ పంచుల్లో కిక్ ఏంటో తెలిసొచ్చింది. 2009లో నేను బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాను. 2011లో టర్కీలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో ‘బెస్ట్ జూనియర్ బాక్సర్’ అవార్డు వచ్చింది. నాన్నే తోడు.. నా కోసం నాన్న ఎంతో కష్టపడుతున్నారు. కాలేజీకి, ప్రాక్టీస్‌కి.. ఎక్కడికి వెళ్లినా నా తోడుంటారు. మా స్వస్థలం నిజామాబాద్. అక్కడే పుట్టి పెరిగాను. గతేడాది ఆగస్టులో నా కోసమే మా కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు వచ్చేసింది. మా తల్లిదండ్రులకు మేం నలుగురం అమ్మాయిలం. నేను మూడో అమ్మాయిని. మా ఇద్దరక్కలూ ఫిజియోథెరఫిస్టులు. దెబ్బలతో ఇంటికె ళ్తే చికిత్స చేసేది వాళ్లే. ఇక మా అమ్మ ఫర్వీన్ సుల్తానా నాకు మంచి సపోర్ట్. మొదట్లో నాకు గాయాలయినప్పుడు చాలా బాధపడేది, ఏడ్చేది. ఒక్కోసారి దెబ్బలు తగిలి ఇంటికొచ్చినప్పుడు.. ‘ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అనేది అమ్మ. ‘నువ్వే చూస్తుండు.. నా కోసం క్యూ కడతారు’ అని నవ్వుతూ అనేదాన్ని. ఆమెను పడగొడితేనే.. ప్రస్తుతం దోమలగూడలోని ఏవీ కాలేజ్‌లో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇటీవల జలంధర్‌లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాల్గొని బంగారు పతకం సాధించా. 2016 ఒలంపిక్స్ కోసం 51 కిలోల కేటగిరీ క్యాంప్‌లో ఎంపికయ్యాను. ఒలంపిక్స్‌కి అర్హత సాధించాలంటే నేను ఎంతగానో అభిమానించే మేరీకోమ్‌తో తలపడాలి. ఆమెను ఓడించాలి. అప్పుడే ఒలంపిక్స్‌లోకి నేరుగా ప్రవేశించేందుకు అర్హత లభిస్తుంది. నేను ఆరాధించే మేరీకోమ్ ఇప్పుడు నా ప్రధాన ప్రత్యర్థి. ఆమెను ఓడించాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఆహారం నుంచి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేషనల్ బాక్సింగ్ ఎక్స్ కోచ్ చిరంజీవిగారి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను. రోజూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ప్రాక్టీస్. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిలో నేనొక్కదాణ్నే అమ్మాయిని. అబ్బాయిలతోనే స్పారింగ్ చేస్తున్నాను. దీనివల్ల అమ్మాయిలతో తలపడటం సులువవుతుంది. ప్రస్తుతం ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరపడింది. పరీక్షలు కాస్తా పూర్తయితే.. నా దృష్టంతా ఒలంపిక్స్‌పైనే. ప్రతిష్ట పెంచాలి.. విజేతలను పోడియంపై నిల్చోబెట్టి పతకం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ క్రీడాకారుని దేశ జాతీయ గీతం ప్లే చేస్తారు. నేను గెలిచినప్పుడు కూడా మన ‘జనగణమన’ ప్లే చేశారు. అప్పుడే నిర్ణయించుకున్నాను మన దేశ ప్రతిష్టను పెంచేందుకు నా వంతు కృషి చేయాలని. కచ్చితంగా ఒలంపిక్స్ బంగారు పతకం సాధించి దేశ గౌరవం, అలాగే తెలంగాణ పరువు నిలుపుతానన్న నమ్మకం ఉంది. ఇటీవ లే సీఎం కేసీఆర్ నన్నుఅభినందిస్తూ రూ.50 లక్షలు అందజేశారు. ఆయనే వస్తారు.. చిన్నప్పటి నుంచి నాకు సల్మాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన అన్ని సినిమాలు చూశాను. ఇప్పటికీ సమయం దొరికితే సల్మాన్ పాత చిత్రాలు చూస్తూ ఉంటాను. ఆయనను ఒక్కసారైనా కలవాలి. అయితే మిగిలిన ఫ్యాన్స్‌లా కాదు.. ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొడితే ఆయనే నన్ను కలవడానికి వస్తారు! -
నిఖత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూని వర్సిటీ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటుకుంది. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో పసిడి పంచ్‌తో మెరిసింది. పంజాబ్‌లోని జలంధర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం మహిళల 51 కేజీల కేటగిరీలో పోటీపడిన ఆమె 3-0తో మహర్షి దయానంద్ యూనివర్షిటీ (రోహ్తక్)కి చెందిన రీతుపై విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ బౌట్లో నిఖత్ జోరుకు ప్రత్యర్థి ఏ దశలోనూ బదులివ్వలేకపోయింది.