పురస్కార రత్నాలు
♦ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఎంపిక
♦ జర్నలిజంలో విశేషకృషి చేసిన అఖిలేశ్వరికి కూడా..
♦ మహిళా దినోత్సవం రోజు రూ. ఒక లక్షతో నగదు అవార్డు
నిఖత్ జరీన్‌కు పురస్కారం
నిజామాబాద్ స్పోర్ట్స్ : బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయస్థాయికి ఎదిగిన జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష నగదు పురస్కారంతో సన్మానించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఘనంగా సత్కరించనుంది. అందులో జరీన్‌కు చోటు లభించడంపై జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన నిఖత్ జరీన్ తండ్రి జలీల్ మధ్యతరగతి కుటుంబానికి చెందివారు. నిఖత్ చిన్నవయస్సు నుంచే బాక్సింగ్ కోచ్ తన గురువు శంషొద్దీన్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం జిందాల్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా నిఖత్‌కు ఢిల్లీలో కఠోర శిక్షణ తీసుకుంటోంది. ఇదివరకే జరీన్ రూ. 50 లక్షల నజరానాను అందుకుంది.
మహిళా జర్నలిస్టు అఖిలేశ్వరికి సన్మానం
నిజామాబాద్ అర్బన్ : జర్నలిజంలో విశేష సేవలందించిన జిల్లా కేంద్రంలోని నర్సాగౌడ్ వీధికి చెందిన అఖిలేశ్వరిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. ఆమెకు రూ. లక్ష నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ఆఖిలేశ్వరి ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1977 సంవత్సరంలో ఈమె జర్నలిజంలోకి అగుడు పెట్టారు. ఆనాడు జర్నలిజంలో మహిళలు అరుదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో చైన పర్యటన, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం వెంబడి వివిధ దేశాల పర్యటనకు జర్నలిస్టు ప్రతినిధిగా అఖిలేశ్వరి వెళ్లారు. నిజామాబాద్‌లోని నర్సాగౌడ్ వీధికి చెందిన నర్సాగౌడ్ అఖిలేశ్వరి తాత.