మన మేరీకోమ్ | our mary kom | Sakshi
Sakshi News home page

మన మేరీకోమ్

Published Sat, Mar 21 2015 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

మన మేరీకోమ్

మన మేరీకోమ్

లండన్ ఒలంపిక్స్ రింగ్‌లో పతకం సాధించి తెచ్చిన బాక్సర్ మేరీకోమ్‌తో.. తలపడతానంటోంది మన హైదరాబాదీ నిఖత్ జరీన్. ఇటీవల జలంధర్‌లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్.. 2016 రియో ఒలంపిక్స్ రింగ్‌లో అడుగుపెట్టాలంటే మేరీ కోమ్‌ను ఢీ కొట్టి.. ఆమెను ఓడించాల్సి ఉంది. ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అంటున్న నిఖత్.. మేరీపై పై చేయి సాధిస్తానని చెబుతోంది. 13 ఏళ్లకే బాక్సింగ్‌లోకి ప్రవేశించి.. సీనియర్ క్యాంప్‌లో దూసుకుపోతూ.. ప్రస్తుతం దోమలగూడ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఈ యంగ్ పంచ్ చెబుతున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే..    
 ..:: నిఖితా నెల్లుట్ల
 
నాన్న జమీల్ అహ్మద్ అథ్లెట్ కావడంతో చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ అంటే ఆసక్తి. స్కూల్ డేస్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను. అదే సమయంలో మా పీటీ సార్ సలహా మేరకు బాక్సింగ్ వైపు మొగ్గు చూపాను. బాక్సింగ్ అనగానే ముఖంపై గాయాలవుతాయని అందరూ భయపెట్టారు. నాన్న ప్రోత్సాహంతో ముందుకుసాగాను. ఒక్కసారి రింగ్‌లోకి దిగాక.. ఆ పంచుల్లో కిక్ ఏంటో తెలిసొచ్చింది. 2009లో నేను బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాను. 2011లో టర్కీలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో ‘బెస్ట్ జూనియర్ బాక్సర్’ అవార్డు వచ్చింది.
 
నాన్నే తోడు..
నా కోసం నాన్న ఎంతో కష్టపడుతున్నారు. కాలేజీకి, ప్రాక్టీస్‌కి.. ఎక్కడికి వెళ్లినా నా తోడుంటారు. మా స్వస్థలం నిజామాబాద్. అక్కడే పుట్టి పెరిగాను. గతేడాది ఆగస్టులో నా కోసమే మా కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు వచ్చేసింది. మా తల్లిదండ్రులకు మేం నలుగురం అమ్మాయిలం. నేను మూడో అమ్మాయిని. మా ఇద్దరక్కలూ ఫిజియోథెరఫిస్టులు.

దెబ్బలతో ఇంటికె ళ్తే చికిత్స చేసేది వాళ్లే. ఇక మా అమ్మ ఫర్వీన్ సుల్తానా నాకు మంచి సపోర్ట్. మొదట్లో నాకు గాయాలయినప్పుడు చాలా బాధపడేది, ఏడ్చేది. ఒక్కోసారి దెబ్బలు తగిలి ఇంటికొచ్చినప్పుడు.. ‘ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అనేది అమ్మ. ‘నువ్వే చూస్తుండు.. నా కోసం క్యూ కడతారు’ అని నవ్వుతూ అనేదాన్ని.
 
ఆమెను పడగొడితేనే..
ప్రస్తుతం దోమలగూడలోని ఏవీ కాలేజ్‌లో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇటీవల జలంధర్‌లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాల్గొని బంగారు పతకం సాధించా. 2016 ఒలంపిక్స్ కోసం 51 కిలోల కేటగిరీ క్యాంప్‌లో ఎంపికయ్యాను. ఒలంపిక్స్‌కి అర్హత సాధించాలంటే నేను ఎంతగానో అభిమానించే మేరీకోమ్‌తో తలపడాలి. ఆమెను ఓడించాలి. అప్పుడే ఒలంపిక్స్‌లోకి నేరుగా ప్రవేశించేందుకు అర్హత లభిస్తుంది. నేను ఆరాధించే మేరీకోమ్ ఇప్పుడు నా ప్రధాన ప్రత్యర్థి. ఆమెను ఓడించాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి.

ఆహారం నుంచి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేషనల్ బాక్సింగ్ ఎక్స్ కోచ్ చిరంజీవిగారి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను. రోజూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ప్రాక్టీస్. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిలో నేనొక్కదాణ్నే అమ్మాయిని. అబ్బాయిలతోనే స్పారింగ్ చేస్తున్నాను. దీనివల్ల అమ్మాయిలతో తలపడటం సులువవుతుంది. ప్రస్తుతం ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరపడింది. పరీక్షలు కాస్తా పూర్తయితే.. నా దృష్టంతా ఒలంపిక్స్‌పైనే.
 
ప్రతిష్ట పెంచాలి..
విజేతలను పోడియంపై నిల్చోబెట్టి పతకం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ క్రీడాకారుని దేశ జాతీయ గీతం ప్లే చేస్తారు. నేను గెలిచినప్పుడు కూడా మన ‘జనగణమన’ ప్లే చేశారు. అప్పుడే నిర్ణయించుకున్నాను మన దేశ ప్రతిష్టను పెంచేందుకు నా వంతు కృషి చేయాలని. కచ్చితంగా ఒలంపిక్స్ బంగారు పతకం సాధించి దేశ గౌరవం, అలాగే తెలంగాణ పరువు నిలుపుతానన్న నమ్మకం ఉంది. ఇటీవ లే సీఎం కేసీఆర్ నన్నుఅభినందిస్తూ రూ.50 లక్షలు అందజేశారు.
 
ఆయనే వస్తారు..
చిన్నప్పటి నుంచి నాకు సల్మాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన అన్ని సినిమాలు చూశాను. ఇప్పటికీ సమయం దొరికితే సల్మాన్ పాత చిత్రాలు చూస్తూ ఉంటాను.
 ఆయనను ఒక్కసారైనా కలవాలి. అయితే మిగిలిన ఫ్యాన్స్‌లా కాదు.. ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొడితే ఆయనే నన్ను కలవడానికి వస్తారు!     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement