
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ‘పసిడి పంచ్’ కొట్టాలనే లక్ష్యంతో భారత స్టార్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. బుధవారం ప్రారంభోత్సవ వేడుకలు జరగ్గా... నేటి నుంచి బౌట్‌లు మొదలవుతాయి. 50 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ తొలి రౌండ్‌లో అనాఖానిమ్ ఇస్మేలియోవా (అజర్‌బైజాన్)తో తలపడుతుంది.
నిఖత్‌తోపాటు సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) తొలి రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. గాయం కారణంగా భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. 70 కేజీల విభాగంలో సనామాచ చాను స్థానంలో శ్రుతి యాదవ్ జట్టులోకి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు)కు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. 65 దేశాల నుంచి 324 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment