World Womens Boxing Championship
-
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Womens World Boxing Championship 2023:‘డబుల్’ గోల్డెన్ పంచ్
ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్‌నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్ విభాగంలో ఇది తొలి టైటిల్ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత. న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్ అల్టాన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్ బరిలోకి దిగుతారు. ఏకపక్షంగా... భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్లో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. లుట్‌సైఖన్ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్ అటాక్‌తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్ పెనాల్టీ కూడా విధించారు. దాంతో రెండో రౌండ్ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన లుట్‌సైఖన్‌పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్ కాంస్యపతక విజేత విజేందర్ సింగ్ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు. అటాక్...డిఫెన్స్... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన వాంగ్ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్‌లు ప్రభావం చూపలేదు. వాంగ్ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్‌లు సరిగ్గా వాంగ్‌ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్ పంచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్‌పై వాంగ్ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్ఎల్ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు. 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ దీపక్ నివాస్ హుడా ఆమె భర్త. -
నిఖత్‌పైనే దృష్టి
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ‘పసిడి పంచ్’ కొట్టాలనే లక్ష్యంతో భారత స్టార్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. బుధవారం ప్రారంభోత్సవ వేడుకలు జరగ్గా... నేటి నుంచి బౌట్లు మొదలవుతాయి. 50 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ తొలి రౌండ్లో అనాఖానిమ్ ఇస్మేలియోవా (అజర్బైజాన్)తో తలపడుతుంది. నిఖత్‌తోపాటు సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) తొలి రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. గాయం కారణంగా భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. 70 కేజీల విభాగంలో సనామాచ చాను స్థానంలో శ్రుతి యాదవ్ జట్టులోకి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు)కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. 65 దేశాల నుంచి 324 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. -
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
World Boxing Championship: ప్రతికూలతలను బద్దలు కొట్టి...
సాధారణ మధ్యతరగతి, సాంప్రదాయ కుటుంబం... నలుగురు కూతుళ్లలో ఒకరిగా పెరిగిన వాతావరణం...ఇలాంటి నేపథ్యంనుంచి వచ్చిన ఆ అమ్మాయి అన్ని అడ్డంకులను ఛేదించింది. భారత క్రీడల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుంది. బాక్సింగ్‌లో పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ ఘనత అసమానం. (సాక్షి క్రీడా విభాగం) అటాక్...అటాక్...అటాక్...ఇప్పుడు రింగ్‌లో నిఖత్ జరీన్ పఠిస్తున్న మంత్రం ఇదొక్కటే! కొన్నాళ్ల క్రితం వరకు కూడా నిఖత్ బ్యాక్‌ఫుట్ బాక్సర్. కానీ ఆమె తన ఆటను మార్చుకుంది. ఒక పంచ్ విసరడంతో పాటు వెంటనే మరో కౌంటర్ పంచ్‌తో సిద్ధమైపోయే ఫ్రంట్‌ఫుట్ ఆటతో నిఖత్ ఆట ఇప్పుడు ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపింది. సరిగ్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ట్రయల్స్‌తో మేరీకోమ్‌తో తలపడి వివాదంలో భాగంగా మారిన తర్వాతినుంచి ఆమె ‘కొత్త కెరీర్’ను మొదలుపెట్టింది. సీనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తే తప్ప జూనియర్‌గా సాధించిన విజయా లకు విలువ, గుర్తింపు లేదని గుర్తించిన నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. కుటుంబం అండదండలతో... నిఖత్ స్వస్థలం నిజామాబాద్. ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్ అహ్మద్ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది. కీలక విజయాలు... ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్ 2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది. అవరోధాలని దాటి... ‘నిఖత్ జరీన్ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దిగ్గజ బాక్సర్తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి. అలాంటి స్థితినుంచి ఆమె మళ్లీ పట్టుదలగా పైకి లేచింది. అంతకు ముందు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైంది. కోలుకొని మళ్లీ ఎలా ఆడగలనో అనే భయం ఉన్నా... ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని తత్వంతో దూసుకొచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయంతో పాటు స్ట్రా్టండ్జా టోర్నీని మరోసారి గెలిచిన నిఖత్...ఇప్పుడు నేరుగా వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. మరో సవాల్... పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. తెలంగాణ సీఎం అభినందనలు ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని అన్నారు. మా ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఇన్నేళ్ల మా శ్రమ ఫలితాన్నిచ్చింది. భావోద్వేగాలను నిలువరించలేకపోతున్నాం. నిఖత్ పెద్ద విజయం సాధించాలని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాం. ఇప్పుడు మా ప్రార్థనలు ఫలించాయి. మున్ముందు మా అమ్మాయి మరిన్ని విజయాలు అందుకోవాలి’ –నిఖత్ తల్లిదండ్రులు జమీల్, పర్వీన్ -
భారత బాక్సర్ లవ్లీనాకు చుక్కెదురు
టర్కీలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగియగా... పూజా రాణి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలోని ఫెయిర్ చాన్స్ టీమ్ బాక్సర్ సిండీ విన్నర్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 1–4తో ఓడింది. పూజ 5–0తో టిమియా నాగీ (హంగేరి)పై గెలిచింది. -
పసిడి పోరుకు మంజు రాణి
ఉలన్ ఉడే (రష్యా): ఆడుతున్న తొలి ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనే భారత యువ మహిళా బాక్సర్ మంజు రాణి అదరగొట్టింది. 2001లో మేరీకోమ్ తర్వాత బరిలోకి దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఫైనల్‌కు చేరిన తొలి భారత బాక్సర్‌గా గుర్తింపు పొందింది. శనివారం జరిగిన 48 కేజీల సెమీఫైనల్లో మంజు 4–1తో చుఠామట్ రక్సత్ (థాయ్‌లాండ్)పై ఘన విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో్ల ఎకతెరీనా పల్త్‌సెవా (రష్యా)తో మంజు రాణి తలపడుతుంది. మేరీకోమ్‌కు షాక్... రికార్డు స్థాయిలో ఏడో పసిడి పతకంపై గురిపెట్టిన భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన పోరాటాన్ని సెమీస్‌తో ముగించింది. దీంతో ఆమె ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన సెమీస్ బౌట్లో ఆమె 1–4తో రెండో సీడ్ బుసెంజ కకిరోగ్లు (టర్కీ) చేతిలో ఓడింది. 54 కేజీల విభాగంలో జమునా బోరో 0–5తో టాప్‌సీడ్ హుయాంగ్ హ్సియావో వెన్ (చైనీస్ తైపీ) చేతిలో, లవ్లీనా 2–3తో యాంగ్ లియు (చైనా) చేతిలో ఓడి కాంస్యాలతో సంతృప్తి చెందారు. -
సర్జుబాల, స్వీటీలకు రజతాలు
జిజు (కొరియా): ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. 48 కేజీల విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి సర్జుబాల... ప్రపంచ మూడో ర్యాంకర్ నేజిమ్ కజిబేవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడింది. 81 కేజీల విభాగం ఫైనల్లో స్వీటీ... యాంగ్ జియోలి (చైనా) చేతిలో ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కేవలం ఒక్క కాంస్యం మాత్రమే లభించింది. ఈసారి రెండు రజతాలు లభించడం భారత్‌కు మెరుగైన ప్రదర్శన. ఈ సారి భారత్ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచింది.