తల్లి పర్వీన్‌కు స్వీట్ తినిపిస్తున్న నిఖత్ సోదరీమణులు
సాధారణ మధ్యతరగతి, సాంప్రదాయ కుటుంబం... నలుగురు కూతుళ్లలో ఒకరిగా పెరిగిన వాతావరణం...ఇలాంటి నేపథ్యంనుంచి వచ్చిన ఆ అమ్మాయి అన్ని అడ్డంకులను ఛేదించింది. భారత క్రీడల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుంది. బాక్సింగ్‌లో పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ ఘనత అసమానం.
(సాక్షి క్రీడా విభాగం)
అటాక్...అటాక్...అటాక్...ఇప్పుడు రింగ్‌లో నిఖత్ జరీన్ పఠిస్తున్న మంత్రం ఇదొక్కటే! కొన్నాళ్ల క్రితం వరకు కూడా నిఖత్ బ్యాక్‌ఫుట్ బాక్సర్. కానీ ఆమె తన ఆటను మార్చుకుంది. ఒక పంచ్ విసరడంతో పాటు వెంటనే మరో కౌంటర్ పంచ్‌తో సిద్ధమైపోయే ఫ్రంట్‌ఫుట్ ఆటతో నిఖత్ ఆట ఇప్పుడు ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపింది.
సరిగ్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ట్రయల్స్‌తో మేరీకోమ్‌తో తలపడి వివాదంలో భాగంగా మారిన తర్వాతినుంచి ఆమె ‘కొత్త కెరీర్’ను మొదలుపెట్టింది. సీనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తే తప్ప జూనియర్‌గా సాధించిన విజయా లకు విలువ, గుర్తింపు లేదని గుర్తించిన నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది.
కుటుంబం అండదండలతో...
నిఖత్ స్వస్థలం నిజామాబాద్. ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్ అహ్మద్ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు.
దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది.
కీలక విజయాలు...
ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్ 2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్‌లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది.
అవరోధాలని దాటి...
‘నిఖత్ జరీన్ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది.
దిగ్గజ బాక్సర్‌తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి. అలాంటి స్థితినుంచి ఆమె మళ్లీ పట్టుదలగా పైకి లేచింది. అంతకు ముందు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైంది. కోలుకొని మళ్లీ ఎలా ఆడగలనో అనే భయం ఉన్నా... ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని తత్వంతో దూసుకొచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయంతో పాటు స్ట్రా్టండ్జా టోర్నీని మరోసారి గెలిచిన నిఖత్...ఇప్పుడు నేరుగా వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.
మరో సవాల్...
పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది.
తెలంగాణ సీఎం అభినందనలు
ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని అన్నారు.
మా ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఇన్నేళ్ల మా శ్రమ ఫలితాన్నిచ్చింది. భావోద్వేగాలను నిలువరించలేకపోతున్నాం. నిఖత్ పెద్ద విజయం సాధించాలని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాం. ఇప్పుడు మా ప్రార్థనలు ఫలించాయి. మున్ముందు మా అమ్మాయి మరిన్ని విజయాలు అందుకోవాలి’
–నిఖత్ తల్లిదండ్రులు జమీల్, పర్వీన్
Comments
Please login to add a commentAdd a comment