Free gift
-
బహుమతి పుచ్చుకుంటున్నారా..?
పెళ్లి, నామకరణం.. వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కానుకలు అందిస్తుంటాయి. నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండొచ్చు. ఇలాంటి బహుమతులన్నీ ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్దం చేసుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఆదాయపన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది. బహుమానం ఎవరి నుంచి వచ్చిందన్న దానితో సంబంధం లేదు. దాని విలువ రూ.50,000కు మించకుండా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ ఈ బహుమానం స్నేహితులు, లేదా ఇతరుల నుంచి అందుకుంటే, దాని విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ మొత్తంపై తప్పకుండా పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ బహుమానం విలువ రూ.50,000కు మించి ఉన్నా సరే.. దాన్ని సమీప బంధువుల నుంచి అందుకుంటే ఎలాంటి పన్ను వర్తించదని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరానికే పరిమితం. అంటే ఒకే సారి కాకుండా, ఏటా రూ.50,000 విలువకు మించకుండా బంధువులు కాని వారి నుంచి బహుమతి స్వీకరించడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రత్యేక మినహాయింపులు పెళ్లి సందర్భంగా బంధు మిత్రుల నుంచి వివిధ రూపాల్లో కానుకలు వస్తుంటాయి. విలువతో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తాయి. బంగారం, వ్రస్తాలు, ప్రాపర్టిలు, షేర్లు, బాండ్లు.. ఇలా బహుమతి ఏదైనా, ఎంత విలువ అయినా పెళ్లి సమయంలో అందుకుంటే పన్ను పడదు. వీలునామా ద్వారా సంక్రమించిన కానుకలు (ఆస్తులు/మరేవైనా) లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైనా లేదా ఒకరి మరణంతో దానంగా సంక్రమించే వాటికి కూడా బహుమతి పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్‌ను మొట్టమొదటగా 1958 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని 1998లో రద్దు చేశారు. అనంతరం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) కింద బహుమతి పన్నును ప్రవేశపెట్టారు. విలువతో కూడిన ఏ బహుమానం అయినా, అది ఏ రూపంలో ఉన్నా ఈ సెక్షన్ కింద పన్ను పరిధిలోకి వస్తుంది. బహుమతి స్వీకరించిన వారికే పన్ను బాధ్యత. ఇచ్చిన వారిపై ఉండదు. తప్పకుండా వెల్లడించాల్సిందే.. సమీప బంధువులు, బంధువులు కాని వారి నుంచి బహమతులు అందుకున్నా కానీ, ఈ వివరాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. ‘ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ షెడ్యూల్ కింద వివరాలు తెలియజేయాలి. ఉచిత బహుమతులే అయినప్పటికీ, వీటిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను బాధ్యత ఎదురవుతుంది. కనుక బహుమతుల స్వీకరణను ఐటీఆర్‌లో తప్పకుండా వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు గిఫ్ట్ స్వీకరణకు సంబంధించి ఆధారాలను సైతం జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి ఉంటుంది. విలువైన, ఖరీదైన బహమతుల విషయంలో స్టాంప్ పేపర్‌పై గిఫ్ట్ డీడ్ రాసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయపన్ను శాఖ అదికారుల నుంచి పిలుపు వస్తే నిరూపించుకునేందుకు ఆధారంగా పనికొస్తుంది. ‘‘పన్ను పరిధిలోకి రాని బహుమతుల వివరాలు వెల్లడించేందుకు ప్రస్తుత ఐటీఆర్ షెడ్యూల్స్‌లో నిబంధనల్లేవు. అయినా కానీ, రక్షణాత్మక ధోరణితో వాటిని ‘షెడ్యూల్ ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ కింద వెల్లడించడం సూచనీయం’’అని ఇండస్ లా పార్ట్నర్ శృతి కె.పి సూచించారు. అన్ని ఐటీఆర్ పత్రాల్లోనూ షెడ్యూల్ ఈఐ ఉంటుంది. కనుక ఆదాయ వనరుల ఆధారంగా ఐటీఆర్‌ను ఎంపిక చేసుకుని, అందులో బహమతుల వివరాలు వెల్లడించాలి. తల్లిదండ్రుల నుంచి బహుమతి తీసుకున్నప్పుడు, వారి ఆదాయ వనరుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సమీప బంధువులు ఎవరు? చట్టంలో ‘రిలేటివ్’ (బంధువు)కు వివరణ ఉంది. భార్య లేదా భర్త; తల్లి దండ్రులు; అమ్మ వైపు అమ్మమ్మ, తాతయ్య; నాన్న వైపు నాయనమ్మ, తాతయ్య; భార్య లేదా భర్త వైపు సహోదరులు; తల్లి, తండ్రి తోడబుట్టిన వారు.. వీరంతా బంధువు కిందకే వస్తారు. సెక్షన్ 56 ప్రకారం మరింత వివరంగా చెప్పుకోవాలంటే..? భార్యకు భర్త, భర్తకు భార్య బంధువే. వీరిలో ఒకరి సోదరులు, సోదరీమణులు మరొకరికి బంధువే అవుతారు. సోదరుడు, సోదరుడి భార్య, అలాగే సోదరి, సోదరి భర్తను కూడా చుట్టంగానే చట్టం పరిగణిస్తోంది. తండ్రి లేదా తల్లి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు సైతం (అత్త, మామ, బాబాయి, పిన్ని) బంధువులే అవుతారు. అలాగే భార్య తన భర్త తండ్రి (మామ), తల్లి (అత్త) నుంచి, ఆ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి తీసుకునే కానుకలు.. ఇదే మాదిరి భర్త తన భార్య తల్లిదండ్రులు (అత్త, మామ), ఈ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి పొందే కానుకల విలువ ఎంత ఉన్నా చట్టం పరిధిలో పన్ను చెల్లించక్కర్లేదు. కానుకలు అన్నీ ఒక్కటేనా? ఉచితంగా ఇచ్చేవి ఏవైనా సరే కానుకల కిందకే వస్తాయి. వాస్తవ విలువలో కొంత మొత్తాన్ని తీసుకుని ఇచ్చినా చట్ట పరిధిలో బహుమతి అవుతుంది. బంగారం కావచ్చు. లేదా భూమి, ఫ్లాట్, ఆభరణాలు, కళాకృతులు (స్థిర, చరాస్తులు), గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఏవైనా సరే చట్టం పరిధిలో బహుమతే అవుతుంది. నగదు రూపంలో వచ్చే బహుమానం విషయంలో, విలువ ఎంతన్న దానిపై గందరగోళం ఉండదు. కానీ, బంగారం లేదా షేర్లు, లేదా భూములు తదితర కానుకల విలువ నిర్ణయించే విషయంలో నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వీటికి చట్టపరిధిలో విలువను ఖరారు చేయాలి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే బహుమతి ఇచ్చే నాటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. భూమి, ఫ్లాట్, ప్లాట్ తదితర స్థిరాస్తిని రూపాయి కూడా తీసుకోకుండా బహుమతి కింద ఇస్తే.. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ స్థిరాస్తిని (భూమి/భవనం) ఉచితంగా కాకుండా, మార్కెట్ విలువ కంటే తక్కువకు బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. అటువంటప్పుడు స్వీకర్త చెల్లించిన మొత్తం, స్టాంప్ డ్యూటీ విలువ నుంచి తీసివేసిన తర్వాత, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొత్తం స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రూ.10 లక్షల ప్రాపర్టీని రూ. 5లక్షలు తీసుకుని బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.8 లక్షలు ఉంది. ఈ కేసులో మార్కెట్ విలువ రూ.8 లక్షల నుంచి, స్వీకర్త చెల్లించిన రూ.5 లక్షలు మినహాయించగా, మిగిలిన రూ.3లక్షలు.. రూ.50,000 పరిమితిని దాటింది. కనుక ఈ కేసులో స్టాంప్ ట్యూటీ విలువ రూ.8 లక్షల్లో 10 శాతం అంటే.. రూ.80,000పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆభరణాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు తదితర చరాస్తులను బహమతిగా పొందినప్పుడు, వాటి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ (సహేతుక మార్కెట్ ధర) రూ.50,000 మించితే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ సహేతుక మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తానికి కానుకగా పొందారనుకుంటే.. అప్పుడు సహేతుక మార్కెట్ ధర నుంచి, చెల్లించిన ధర తీసివేయగా మిగిలిన వ్యత్యాసంపై పన్ను చెల్లించాలి. స్థిరాస్తిని రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత బహమతిగా పొందితే, విడిగా ప్రతి లావాదేవీకి రూ.50,000 పరిమితి వర్తిస్తుందని ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఎఫ్ఏక్యూ స్పష్టం చేస్తుంది. దీని ఆధారంగా ఎక్స్ అనే వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు స్థిరాస్తులను బహమతిగా స్వీకరించాడని అనుకుందాం. విడిగా ప్రతి ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.50,000 మించి లేదు. ఇలాంటప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడదు. హెచ్‌యూఎఫ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. గిఫ్ట్ ద్వారా ఆదాయం..→ నామకరణం, ఇతర సందర్భాల్లో పిల్లల పేరిట కూడా బహమతులు సంక్రమిస్తుంటాయి. అ లాంటి బహుమతులపై వచ్చే ఆదాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. → కొంత మంది పన్ను భారం తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ప్రాపర్టిపై తమకు వస్తున్న అద్దె ఆదాయాన్ని తమ పిల్లలు లేదా మనవళ్లు/మనవరాళ్లకు (బంధువులు) ఏ నెలకానెల బహుమతి కింద ఇచ్చేస్తుంటారు. చట్టం దీన్ని బహుమతిగానే పరిగణిస్తుంది. కానీ, దీనికంటే ముందు బహుమతిగా ఇస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయానికి అద్దె ఆదాయం కలుస్తుందని మర్చిపోవద్దు. అంటే చట్ట ప్రకారం సంబంధిత అద్దె ఆదాయాన్ని తమ వార్షిక రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సిందే. → తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. కానీ, ఇలా మైనర్ పేరిట చేసిన డిపాజిట్‌పై వచ్చే ఆదాయం సంబంధిత తల్లితండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డిపాజిట్‌ను బహమతిగా చూపించినప్పటికీ.. చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. వారికి ఏ విధమైన ఆదాయం ఉండదు. కనుక ఆ బహమ తులపై ఆదాయం వారి తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. → ఒకవేళ ప్రత్యేక నైపుణ్యాలు, మరేదైనా స్టార్టప్ రూపంలో చిన్నారులు సంపాదిస్తుంటే వారి వ్యక్తిగత ఆదాయమే అవుతుంది. అలాంటి కేసుల్లో చిన్నారుల తరఫున తల్లిదండ్రులు రిటర్నులు వేసి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయానికి కలిసే విషయంలో.. దంపతులు ఇద్దరూ సంపాదనా పరులైతే వారి లో ఎక్కువ ఆర్జించే వారికి ఇది కలుస్తుంది. → ఉదాహరణకు షేర్లను పిల్లలకు గిఫ్ట్‌గా ఇస్తే, వాటిపై వచ్చే డివిడెండ్ తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. యాజమాన్యం నుంచి బహమతులు మన దేశంలో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బహమతులు ఇస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే బహుమతుల విలువ రూ.5,000 మించకపోతే, దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. నగదు, గిఫ్ట్ వోచర్, ఈ–వోచర్, ప్రీపెయిడ్కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా, వాటి విలువ రూ.5,000 మించితే ఆ మొత్తం వేతన ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం చెల్లించే అన్ని రకాల బహుమతుల విలువ రూ.5,000 మించితే అది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది’’అని బీడీవో ఇండియా పార్ట్నర్ (ట్యాక్స్) ప్రీతి శర్మ తెలిపారు. ఎంత పన్ను చెల్లించాలి? ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపుల్లేని కేసుల్లో.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న కానుకల విలువను ఇతర ఆదాయం (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) కింద చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయానికి ఇది తోడవుతుంది. శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు (పాత విధానంలో రూ.2.5 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) పరిధిలోనే ఉండి, బహుమానం విలువ కలిపిన తర్వాత కూడా బేసిక్ పరిమితి దాటకపోతే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఒక్కో బహుమతికి విడిగా రూ.50,000 పరిమితి వర్తించదని, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు (నిబంధనల మేరకు) రూ.50,000 పరిమితి వర్తిస్తుందని మనీఎడ్యుసూ్కల్ వ్యవస్థాపకుడు ఆర్ణవ్ పాండా తెలిపారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
‘బంగారానికి వెండి ఉచితం’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల బరువుకు సమానమైన వెండిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై ప్రతి క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్‌కట్ డైమండ్స్‌పై క్యారెట్‌కు 2 గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాల బరువుకు సమానమైన వెండి ఉచితంగా పొందవచ్చు. అలాగే వెండి వస్తువుల మేకింగ్ చార్జీలపై 25% తగ్గింపు, వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ గరిష్ట విక్రయ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూమ్‌ల్లో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ సీజన్లో ‘బంగారానికి వెండి ఉచితం’ ఆఫర్ కస్టమర్లకు మరింత ఆనందాన్ని అందిస్తుందని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
ఆన్లైన్ ఆఫర్ల పేరిట బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పండుగల ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్లైన్ యాప్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్ఫ్రైజ్ గిప్ట్ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్లోని నంబర్లను మేం చెప్పిన నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్‌లను మొబైల్ ఫోన్లు, వాట్సాప్‌లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఈ లాజిక్ మిస్సవ్వొద్దు..షాపింగ్ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్ మాల్ కూడా గిఫ్ట్ కూపన్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్‌లకు వచ్చే మెసేజ్‌లలోని అనుమానా స్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే ఫోన్లోకి మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ కావడంతోపాటు ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..⇒ ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లను పోలినట్లుగా ఫేక్ వెబ్సైట్లు సృష్టించి మోసాలు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ ఆఫర్ మెసేజ్‌లు.⇒ ఫ్రీ గిప్ట్‌లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్ ఫోన్ కాల్స్‌తో, ఎస్ఎంఎస్లతో మోసాలు. ⇒ ఫిషింగ్ మెయిల్స్ పంపి అందులోని లింక్‌లపై క్లిక్ చేయాలని సూచనలు. ⇒ పండుగ సీజన్లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం తాము పంపే ఆన్లైన్ గేమ్స్ ఆడి పాయింట్స్ గెలవాలంటూ నకిలీ ఆన్లైన్ గేమ్స్ లింక్‌లతో సందేశాలు. -
ఇస్మార్ట్ ఆఫర్ డ్యాన్స్ జెయ్యాలే... ఫ్రీగా ఐస్‌క్రీమ్ తినాలే!
‘డ్యాన్స్ చేయండి. ఐస్‌క్రీమ్ ఫ్రీగా తినండి’ అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎంత బాగుంటుంది! ఎవరో ఎందుకు సాక్షాత్తూ ఒక ఐస్‌క్రీమ్ కంపెనీ ఇలాంటి ఆఫర్‌ను కస్టమర్లకు ఇచ్చింది. ‘ఐస్‌క్రీమ్ డే’ను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ‘కార్నర్ హౌజ్ ఐస్‌క్రీమ్స్’ అనే ఐస్‌క్రీమ్ కంపెనీ షాప్ ముందు నుంచి కౌంటర్ వరకు డ్యాన్స్ చేస్తూ వచ్చే వాళ్లకు ఫ్రీ ఐస్‌క్రీమ్ ఆఫర్ ఇచ్చింది. ఇక డ్యాన్సులే డ్యాన్సులు! కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ‘ఫ్రీ ఐస్‌క్రీమ్ మాటేమిటోగానీ ఎంతోమంది డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూసే అవకాశం వచ్చింది’ ‘డ్యాన్స్ చేస్తే ఫ్రీగా టమాటాల ఆఫర్ ఎవరైనా ఇస్తే బాగుండేది’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. -
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
బీరు, బిరియానీ ప్లేస్‌లో మాస్క్, శానిటైజర్..!
హైదరాబాద్: ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తుంటాయి. ఓటుకింత ముట్టజెప్పడమే కాకుండా బీరు.. బిరియానీ.. ఖరీదైన బహుమతులతో ‘ప్రచారం’ చేస్తుంటాయి. అతిత్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు. అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అప్పుడే ప్రచారాన్ని కూడా షురూ చేసేశాయి. కానీ.. ఇది ‘కరోనా సీజన్’ కావడంతో కాస్త ప్లాన్ మార్చారు ఆయా పార్టీల నేతలు. బీరు, బిరియానీల స్థానంలో మాస్క్, శానిటైజర్లను ఉచితంగా అందజేస్తూ ఓటర్ల ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ వలంటీర్లను ఓటర్ల ఇళ్లకు పంపించి తమకు చేతనైనంతలో బహుమతులు ఇవ్వడం తమకు అలవాటని టికెట్ ఆశిస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. ఈసారి ఆ వలంటీర్లతోనే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, విటమిన్ గోళీలను ఇంటింటికీ పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతల పంపిణీ ముగిసిందని, ఎన్నికలు పూర్తయ్యేలోపు మరోసారి పంపిస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారీ అభ్యర్థులు. మాస్కులు, శాటిటైజర్లు, మందులతోపాటు వలంటీర్లకు కూడా రాజకీయ పార్టీలు భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఒక్కో వలంటీర్‌కు 6 గంటలు పనిచేస్తే 600.. 12 గంటలు పనిచేస్తే 1200 ముట్టుజెపుతున్నారట పోటీలో ఉన్న అభ్యర్థులు. (చదవండి: అమాంతం పెరిగిన చికెన్ ధర) -
కానుక కష్టాలు
‘చంద్రన్న సంక్రాంతి కానుక’ తెల్లకార్డుదారులందరికీ అందే అవకాశాలు కనిపించడం లేదు. ఒక పక్క పథకం ఓ కొలిక్కి రాకముందే పంపిణీ తేదీలను ఖరారు చేస్తుండడంతో అందరిలోనూ అయోమయం నెలకొంది. పథకంపై అధికారుల్లో కూడా స్పష్టత లేకపోవడంతో రేషన్ డీలర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ‘సంక్రాంతి కానుక’ కొంతమందికే పరిమితమవుతోంది. మరో వైపు రేషన్ డీలర్లపై పరోక్షంగా రూ.20.18 లక్షల భారాన్ని కూడా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -ఒంగోలు * సంక్రాంతి గిఫ్ట్బాక్సుకు వచ్చిన తిప్పలు * నేటికీ కొలిక్కిరాని కసరత్తు * అధికారుల్లోనే లేని స్పష్టత ప్యాక్ చేయడానికి సరుకులే లేవు ప్యాక్ సరే... సరుకులే లేవంటున్నారు సంబంధితాధికారులు. శనివారం నాటికి జిల్లా నుంచి 9,172 క్వింటాళ్ళ శనగలను ఇతర జిల్లాలకు పంపించారు. మరో 1800 క్వింటాళ్ళను పంపించాల్సి ఉంది. ఇక జిల్లాకు వచ్చే సరుకులను పరిశీలిస్తే కందిపప్పును వినుకొండ నుంచి తెప్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖ నుంచి నెయ్యి వస్తున్నట్లు సమాచారం. మిగతా సరుకుల పరిస్థితి ఎక్కడ నుంచి వస్తాయనే సమాచారం ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం వద్దే లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 10వ తేదీలోగా గిఫ్టు స్కీముకు సంబంధించి జిల్లాకు పంపాల్సిన మొత్తాన్ని తరలిస్తామని స్పష్టం చేస్తూ శనివారం జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపారు. డీలర్లపై రూ.21.18 లక్షల భారం... సాధారణంగా సరుకులను ఒక్కో లారీ ద్వారా రేషన్ షాపులకు తరలించాలంటే ప్రతి మండలానికి కనీసం రెండు రోజులు పడుతుంది. మరో వైపు ప్రస్తుతం ఎం.ఎల్.ఎస్.పాయింట్ల నుంచి రేషన్ సరుకులను తరలించే వాహనాలను పరిశీలిస్తే బియ్యం పూర్తిస్థాయిలో రేషన్ డీలర్లకు చేరలేదు. అదనంగా వచ్చే గిఫ్టుప్యాక్లను తరలించాలంటే అదనపు వాహనాలు అవసరం. వీటిని సమకూర్చుకోవడం జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారనుంది. ఈ గిఫ్టుస్కీముకు కొత్త భాష్యం చెప్పారు. రేషన్ డీలర్లు సరుకులను నేరుగా మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్ పాయింట్లు) నుంచి తెచ్చుకోవాలని సూచించారు. తరలింపునకు అయ్యే ఖర్చులు సంగతేమిటని ప్రశ్నిస్తే మాత్రం అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఇలా కేటాయించిన మొత్తం సరుకులను తరలించుకోవాలంటే రేషన్ డీలర్‌కు సరాసరిన వెయ్యి రూపాయలు అదనపు భారం పడుతుంది. జిల్లాలో మొత్తం 2,118 షాపులున్నాయి. అంటే రూ.21.18 లక్షల భారం మోయక తప్పని పరిస్థితి డీలర్లకు ఏర్పడింది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సరుకుల భారం మాత్రం మాపై వేయడం న్యాయమా అని డీలర్ల సంఘం ప్రశ్నిస్తోంది. 13వ తేదీనాటికి పంపిణీ పూర్తి సాధ్యమేనా... ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 13వ తేదీ నాటికి తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అందించాలి. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా అందాయి. ఒక రేషన్ షాపు పరిధిలో కనీసం వెయ్యి కార్డులున్నాయనుకుంటే రోజుకు 300 మంది చొప్పున మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చు. కానీ ప్రభుత్వం సూచించినట్లుగా ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకులు ఈ నెల 10వ తేదీనాటికి చేరితే వాటిని డీలర్లు తీసుకువెళ్ళేసరికి మరో రెండు రోజులు కనీసంగా పడుతుంది. అంతా సక్రమంగా..అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 12వ తేదీనాటికి సరుకులు రేషన్ షాపులకు చేరగలుగుతాయి. ఇక వాటి పంపిణీకి సంబంధించి ఒకే రోజు పూర్తిచేయడమంటే సాధ్యమయ్యే అవకాశం లేదు. దానికితోడు జిల్లాలో 226 రేషన్ షాపులకు డీలర్లు లేరు. వాటి బాధ్యతలను ఇతర డీలర్లకు అప్పగించారు. మరి..వారి పరిధిలో కనీసంగా 2 వేల కార్డులుండే అవకాశం ఉంటుంది.తక్కువ వ్యవధిలో సరుకులు పంపిణీ పూర్తి చేయడమెలా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మరో సమస్య... హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇంటిల్లిపాది నిర్వహించుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈనెల 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకోనున్నారు. ఈ పెద్ద పండుగకు పిల్లల పాఠశాలలకు శెలవులు రావడం, దూరాభార ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉన్నవారు కనీసం స్వగ్రామానికి వెళ్ళి రావాలనుకోవడం సహజం. దీంతో ఈ ఉచిత గిఫ్టులు ఎంతమందికి అందుతాయో అనుమానమే.