కానుక కష్టాలు
‘చంద్రన్న సంక్రాంతి కానుక’ తెల్లకార్డుదారులందరికీ అందే అవకాశాలు కనిపించడం లేదు. ఒక పక్క పథకం ఓ కొలిక్కి రాకముందే పంపిణీ తేదీలను ఖరారు చేస్తుండడంతో అందరిలోనూ అయోమయం నెలకొంది. పథకంపై అధికారుల్లో కూడా స్పష్టత లేకపోవడంతో రేషన్ డీలర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ‘సంక్రాంతి కానుక’ కొంతమందికే పరిమితమవుతోంది. మరో వైపు రేషన్ డీలర్లపై పరోక్షంగా రూ.20.18 లక్షల భారాన్ని కూడా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -ఒంగోలు
* సంక్రాంతి గిఫ్ట్‌బాక్సుకు వచ్చిన తిప్పలు
* నేటికీ కొలిక్కిరాని కసరత్తు
* అధికారుల్లోనే లేని స్పష్టత
ప్యాక్ చేయడానికి సరుకులే లేవు
ప్యాక్ సరే... సరుకులే లేవంటున్నారు సంబంధితాధికారులు. శనివారం నాటికి జిల్లా నుంచి 9,172 క్వింటాళ్ళ శనగలను ఇతర జిల్లాలకు పంపించారు. మరో 1800 క్వింటాళ్ళను పంపించాల్సి ఉంది. ఇక జిల్లాకు వచ్చే సరుకులను పరిశీలిస్తే కందిపప్పును వినుకొండ నుంచి తెప్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విశాఖ నుంచి నెయ్యి వస్తున్నట్లు సమాచారం. మిగతా సరుకుల పరిస్థితి ఎక్కడ నుంచి వస్తాయనే సమాచారం ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం వద్దే లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 10వ తేదీలోగా గిఫ్టు స్కీముకు సంబంధించి జిల్లాకు పంపాల్సిన మొత్తాన్ని తరలిస్తామని స్పష్టం చేస్తూ శనివారం జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపారు.
డీలర్లపై రూ.21.18 లక్షల భారం...
సాధారణంగా సరుకులను ఒక్కో లారీ ద్వారా రేషన్ షాపులకు తరలించాలంటే ప్రతి మండలానికి కనీసం రెండు రోజులు పడుతుంది. మరో వైపు ప్రస్తుతం ఎం.ఎల్.ఎస్.పాయింట్ల నుంచి రేషన్ సరుకులను తరలించే వాహనాలను పరిశీలిస్తే బియ్యం పూర్తిస్థాయిలో రేషన్ డీలర్లకు చేరలేదు. అదనంగా వచ్చే గిఫ్టుప్యాక్‌లను తరలించాలంటే అదనపు వాహనాలు అవసరం. వీటిని సమకూర్చుకోవడం జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారనుంది. ఈ గిఫ్టుస్కీముకు కొత్త భాష్యం చెప్పారు.
రేషన్ డీలర్లు సరుకులను నేరుగా మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్‌ఎస్ పాయింట్లు) నుంచి తెచ్చుకోవాలని సూచించారు. తరలింపునకు అయ్యే ఖర్చులు సంగతేమిటని ప్రశ్నిస్తే మాత్రం అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఇలా కేటాయించిన మొత్తం సరుకులను తరలించుకోవాలంటే రేషన్ డీలర్‌కు సరాసరిన వెయ్యి రూపాయలు అదనపు భారం పడుతుంది. జిల్లాలో మొత్తం 2,118 షాపులున్నాయి. అంటే రూ.21.18 లక్షల భారం మోయక తప్పని పరిస్థితి డీలర్లకు ఏర్పడింది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సరుకుల భారం మాత్రం మాపై వేయడం న్యాయమా అని డీలర్ల సంఘం ప్రశ్నిస్తోంది.
13వ తేదీనాటికి పంపిణీ పూర్తి సాధ్యమేనా...
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 13వ తేదీ నాటికి తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అందించాలి. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా అందాయి. ఒక రేషన్ షాపు పరిధిలో కనీసం వెయ్యి కార్డులున్నాయనుకుంటే రోజుకు 300 మంది చొప్పున మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చు. కానీ ప్రభుత్వం సూచించినట్లుగా ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరుకులు ఈ నెల 10వ తేదీనాటికి చేరితే వాటిని డీలర్లు తీసుకువెళ్ళేసరికి మరో రెండు రోజులు కనీసంగా పడుతుంది.
అంతా సక్రమంగా..అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 12వ తేదీనాటికి సరుకులు రేషన్ షాపులకు చేరగలుగుతాయి. ఇక వాటి పంపిణీకి సంబంధించి ఒకే రోజు పూర్తిచేయడమంటే సాధ్యమయ్యే అవకాశం లేదు. దానికితోడు జిల్లాలో 226 రేషన్ షాపులకు డీలర్లు లేరు. వాటి బాధ్యతలను ఇతర డీలర్లకు అప్పగించారు. మరి..వారి పరిధిలో కనీసంగా 2 వేల కార్డులుండే అవకాశం ఉంటుంది.తక్కువ వ్యవధిలో సరుకులు పంపిణీ పూర్తి చేయడమెలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇది మరో సమస్య...
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇంటిల్లిపాది నిర్వహించుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈనెల 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకోనున్నారు. ఈ పెద్ద పండుగకు పిల్లల పాఠశాలలకు శెలవులు రావడం, దూరాభార ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉన్నవారు కనీసం స్వగ్రామానికి వెళ్ళి రావాలనుకోవడం సహజం. దీంతో ఈ ఉచిత గిఫ్టులు ఎంతమందికి అందుతాయో అనుమానమే.