international boxing association
-
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంపై వేటు
International Boxing Association: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సర్లకు ఏ ఇబ్బంది లేకుండా పోటీ పడే అవకాశమిచ్చారు. కొన్నేళ్లుగా ఐబీఏ వివాదాలతో వార్తల్లో నిలిచింది. సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఐఓసీ ఎన్ని సార్లు సూచించినా ఐబీఏ మాత్రం పెడచెవిన పెట్టింది. దీంతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఐబీఏను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్, ముంబా మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్, గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్లు గెలుపొందాయి. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ 10–4 పాయింట్లతో చింగారి గల్ఫ్ టైటాన్స్‌పై, ముంబా మాస్టర్స్ 8–7 పాయింట్లతో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుపై విజయం సాధించాయి. ముంబా మాస్టర్స్‌కు ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. -
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
Boxing World Championships 2023: స్వర్ణ పతకం సాధిస్తే రూ. కోటీ 63 లక్షలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరగనున్న పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ప్రకటించారు. మే 1 నుంచి 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌ను మొత్తం 52 లక్షల డాలర్ల (రూ. 425 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నామని సోమవారం ఇక్కడ నిర్వహించి మీడియా సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన బాక్సర్‌కు 2 లక్షల డాలర్లు (రూ. కోటీ 63 లక్షలు), రజతం నెగ్గిన బాక్సర్‌కు 1 లక్ష డాలర్లు (రూ. 81 లక్షలు), కాంస్యం సొంతం చేసుకున్న ఇద్దరు బాక్సర్లకు 50 వేల డాలర్ల (రూ. 40 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన క్రెమ్లెవ్ ఒకవేళ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్‌ను తొలగిస్తే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. -
‘లెజెండ్’ మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ–ఐబా) ఆమెకు ‘లెజెండ్’ హోదాతో గౌరవించింది. స్విట్జర్లాండ్‌లోని మోంట్రెక్స్లో జరిగిన ఏఐబీఏ వార్షిక సదస్సులో మేరీకోమ్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో మేరీకోమ్‌తోపాటు ఒలింపిక్ మాజీ చాంపియన్స్ వ్లాదిమిర్ క్లిచ్కో (ఉక్రెయిన్), ఫెలిక్స్ సవాన్ (క్యూబా), బ్రహిమ్ అస్లూమ్ (ఫ్రాన్స్)లకు కూడా ‘లెజెండ్’ పురస్కారంతో గౌరవించారు. మణిపూర్‌కు చెందిన 33 ఏళ్ల మేరీకోమ్ గత 15 ఏళ్లలో అమెచ్యూర్ బాక్సింగ్‌లో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణించింది. వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... నాలుగుసార్లు ఆసియా విజేతగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గత నాలుగేళ్లుగా 51 కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్ తాజాగా 48 కేజీ విభాగానికి మారాలని నిర్ణయించుకుంది. వచ్చే టోక్యో ఒలింపిక్స్ (2020)లో మహిళల విభాగంలో ఈ కేటగిరీకి అవకాశం ఉండటంతో ఆమె 48 కేజీల విభాగానికి మారింది. మరోవైపు ఇదే కార్యక్రమంలో భారత్‌కే చెందిన వికాస్ క్రిషన్కు ‘ఐబా’ ప్రొ బాక్సింగ్‌లో ‘ఉత్తమ బాక్సర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఏడాది వికాస్ ‘ఐబా’ ఆధ్వర్యంలో రెండు ప్రొఫెషనల్ బౌట్లలో తలపడి విజయం సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
బెస్ట్ బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ‘ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్’గా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) వికాస్‌ను ఎంపిక చేసింది. వచ్చే నెల 20న జరిగే ‘ఐబా’ సమావేశంలో ఈ అవార్డును వికాస్‌కు అందజేస్తారు. భారత్ నుంచి ఓ బాక్సర్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ‘నాకిది గొప్ప గౌరవం. అరుుతే నేనంతగా ఆనందంగా లేను. ఎందుకంటే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆశించిన నాకు నిరాశే మిగిలింది’ అని ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో శిక్షణ తీసుకుంటున్న వికాస్ వ్యాఖ్యానించాడు. -
సరితా దేవిపై సస్పెన్షన్
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అనూహ్య నిర్ణయం న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన అదిలి జె సుమారివాలాపై కూడా సస్పెన్షన్ విధించింది. వీరందరూ ఎలాంటి టోర్నమెంట్లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది నిర్ధారించలేదు. ఈ కేసును సమీక్షించాలని ఏఐబీఏ తమ క్రమశిక్షణ కమిటీని కోరడంతో... కొరియాలో జరగనున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరెవరూ పాల్గొనేందుకు వీలులేకుండా పోయింది. జరుగుతున్న పరిణామాలు తన దృష్టికి రాలేదని సరిత వెల్లడించింది. ఏఐబీఏ నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకుంటానని తెలిపింది. మరోవైపు ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని కోచ్ సంధు అన్నారు. ‘ఏఐబీఏ నుంచి నోటీసు వచ్చింది. ఏడు రోజుల్లో దీనికి సమాధానం ఇవ్వాలి. దీని కోసం సిద్ధమవుతున్నాం’ అని సంధు పేర్కొన్నారు. నేపథ్యమిది మహిళల 60 కేజీల సెమీస్ బౌట్లో అద్భుతమైన ప్రదర్శన చూపిన సరితను కాకుండా జీ నా పార్క్ (కొరియా)ను రిఫరీలు విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై కలత చెందిన భారత బాక్సర్ పొడియం వద్ద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. మొదట తనకు లభించిన కాంస్య పతకాన్ని మెడలో వేసుకునేందుకు అంగీకరించని ఆమె... దాన్ని చేతితో తీసుకొని కన్నీళ్ల పర్యంతమవుతూ పార్క్ మెడలో వేసి వచ్చింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ మొత్తం ఉదంతంపై సరిత ఏఐబీఏకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పింది. నిషేధం ఎత్తి వేసేలా చర్యలు తీసుకోండి: శర్బానంద బాక్సర్ సరితా దేవిపై విధించిన నిషేధం ఎత్తి వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్... భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) ఆదేశించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఫోరం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘బాక్సర్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించా. సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఎంతవరకైనా వెళ్లండని చెప్పా’ అని మంత్రి పేర్కొన్నారు. -
భారత బాక్సింగ్ బాధ్యతలు స్పాన్సర్లకు
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య గుర్తింపును గత మార్చిలో రద్దు చేసిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ), దేశంలో బాక్సింగ్ నిర్వహణ బాధ్యతల్ని తాజాగా రెండు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించింది. దీర్ఘకాలంగా భారత బాక్సింగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న మోనెట్ ఇస్పాత్ లిమిటెడ్ సీఎండీ సందీప్ జజోడియా, భారత వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ (డబ్ల్యూఎస్బీ) ఫ్రాంచైజీ యజమాని ఉదిత్ సేథ్‌లను తాత్కాలిక ప్రతినిధులుగా ఏఐబీఏ నిర్ణయించింది. ఎన్నికలు నిర్వహించి, కొత్త సమాఖ్యను ఏర్పాటు చేసే వరకు వీరు ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. తాత్కాలిక బాధ్యతల్ని చేపట్టి, సమాఖ్య ఏర్పాటుకు చర్యలు తీసుకునే వారికోసం ఏఐబీఏ ఏప్రిల్ 28న దరఖాస్తులు కోరగా.. ఈ రెండు సంస్థలు బాక్సింగ్ ఇండియా పేరిట ఓ గ్రూపుగా ఏర్పడి తమ ప్రణాళికను వివరించాయి. ‘రింగ్ బయట బౌట్’ పేరుతో తాము ఇచ్చిన ప్రజెంటేషన్, భారత బాక్సింగ్ భవిష్యత్తుపై తమకు గల దూరదృష్టికి సంతృప్తి చెందిన ఏఐబీఏ ఈ బాధ్యతల్ని తమకు అప్పగించినట్లు బాక్సింగ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.