సరితా దేవిపై సస్పెన్షన్
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన అదిలి జె సుమారివాలాపై కూడా సస్పెన్షన్ విధించింది. వీరందరూ ఎలాంటి టోర్నమెంట్‌లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది నిర్ధారించలేదు. ఈ కేసును సమీక్షించాలని ఏఐబీఏ తమ క్రమశిక్షణ కమిటీని కోరడంతో... కొరియాలో జరగనున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరెవరూ పాల్గొనేందుకు వీలులేకుండా పోయింది. జరుగుతున్న పరిణామాలు తన దృష్టికి రాలేదని సరిత వెల్లడించింది. ఏఐబీఏ నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకుంటానని తెలిపింది. మరోవైపు ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని కోచ్ సంధు అన్నారు. ‘ఏఐబీఏ నుంచి నోటీసు వచ్చింది. ఏడు రోజుల్లో దీనికి సమాధానం ఇవ్వాలి. దీని కోసం సిద్ధమవుతున్నాం’ అని సంధు పేర్కొన్నారు.
నేపథ్యమిది
మహిళల 60 కేజీల సెమీస్ బౌట్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపిన సరితను కాకుండా జీ నా పార్క్ (కొరియా)ను రిఫరీలు విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై కలత చెందిన భారత బాక్సర్ పొడియం వద్ద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. మొదట తనకు లభించిన కాంస్య పతకాన్ని మెడలో వేసుకునేందుకు అంగీకరించని ఆమె... దాన్ని చేతితో తీసుకొని కన్నీళ్ల పర్యంతమవుతూ పార్క్ మెడలో వేసి వచ్చింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ మొత్తం ఉదంతంపై సరిత ఏఐబీఏకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పింది.
నిషేధం ఎత్తి వేసేలా చర్యలు తీసుకోండి: శర్బానంద
బాక్సర్ సరితా దేవిపై విధించిన నిషేధం ఎత్తి వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్... భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) ఆదేశించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఫోరం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ‘బాక్సర్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించా. సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఎంతవరకైనా వెళ్లండని చెప్పా’ అని మంత్రి పేర్కొన్నారు.