‘రియో’ ఒలింపిక్స్‌కు శివ థాపా అర్హత
మేరీకోమ్ పరాజయం దేవేంద్రోకు మరో అవకాశం
కియానన్ (చైనా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ బాక్సర్ శివ థాపా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో శివ థాపా 56 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని ‘రియో’ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో శివ థాపా 3-0తో (29-28, 30-27, 30-27) కైరాత్ యెరలియేవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన శివ థాపా శుక్రవారం జరిగే ఫైనల్లో చాట్‌చాయ్ బుట్‌డీ (థాయ్‌లాండ్)తో తలపడతాడు.
భారత్‌కే చెందిన మరో బాక్సర్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లో 0-3తో (26-30, 26-30, 26-30) టాప్ సీడ్ రోగెన్ లాడాన్ (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి చెందాడు. శుక్రవారం జరిగే ‘బాక్స్ ఆఫ్’ బౌట్‌లో గాన్‌ఖుయాగ్ (మంగోలియా)పై గెలిస్తే దేవేంద్రో రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు.
మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు) ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమై ఈ టోర్నీ ద్వారా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది. సెమీస్‌లో మేరీకోమ్ 0-3తో (36-40, 37-39, 37-39) తన చిరకాల ప్రత్యర్థి రెన్ కాన్‌కాన్ (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా మేరీకోమ్‌కు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం మిగిలి ఉంది.