Shiva Thapa
-
ఫైనల్లో శివ థాపా, తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్
హిస్సార్: జాతీయ సీనియర్ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో స్టార్ ఆటగాడు శివ థాపా ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న థాపా (63.5 కేజీల విభాగం) సెమీ ఫైనల్లో 5–0తో మనీశ్ కౌశిక్ (సర్వీసెస్)ను చిత్తు చేశాడు. ఫైనల్లో అంకిత్ నర్వాల్ (రైల్వేస్)తో థాపా తలపడతాడు. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కూడా 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరాడు. సర్వీసెస్ తరఫున బరిలోకి దిగిన హుసాముద్దీన్ సెమీస్‌లో 5–0తో ఆశిష్ కుమార్ (హిమాచల్ ప్రదేశ్)పై ఘన విజయం సాధించాడు. ఇతర కేటగిరీల్లో సంజీత్, నరేందర్, సాగర్ కూడా తుది పోరుకు అర్హత సాధించారు. -
సుమీత్ నగాల్ అవుట్...
పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిలిప్ క్రజినోవిచ్ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్‌పై విజయం సాధించాడు. 2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్ కార్డ్’ సుమీత్ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్ 8 ఏస్‌లు కొట్టగా, నగాల్ 3 ఏస్‌లు నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మైకేల్ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్ ధమ్నేపై విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా జాతీయ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జస్వీందర్ సింగ్ (ఢిల్లీ)ని తన నాకౌట్ పంచ్‌తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్ టోకస్ (రైల్వేస్) కూడా 5–0తో జై సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై ఘన విజయం సాధించాడు. -
సూపర్ సంజీత్...
దుబాయ్: ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా తన పంచ్ పవర్‌తో భారత హెవీవెయిట్ బాక్సర్ సంజీత్ సత్తా చాటుకున్నాడు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పురుషుల 91 కేజీల విభాగంలో సంజీత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 91 కేజీల ఫైనల్లో సంజీత్ 4–1తో 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, మూడుసార్లు ఆసియా చాంపియన్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించాడు. ► మరోవైపు 52 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్... 64 కేజీల విభాగంలో శివ థాపాలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తీవ్రంగా పోరాడినా చివరకు రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 2–3తో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ షఖోబిదిన్ జోయ్‌రోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... శివ థాపా 2–3తో బాతర్సుఖ్ చిన్‌జోరిగ్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. ► 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ జోయ్‌రోవ్ చేతిలో ఓడిన అమిత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చాడు. ఇద్దరూ ఎక్కడా జోరు తగ్గించుకోకుండా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అమిత్ ఆటతీరు చూశాక విజయం అతడినే వరిస్తుందనిపించినా... బౌట్ జడ్జిలు మాత్రం జోయ్‌రోవ్ ఆధిపత్యం చలాయించాడని భావించారు. తుది ఫలితంపై భారత బృందం జ్యూరీకి అప్పీల్ చేసింది. అయితే భారత అప్పీల్‌ను జ్యూరీ తోసిపుచ్చింది. దాంతో జోయ్రోవ్కే స్వర్ణం ఖాయమైంది. ► ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... మహిళల విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2019లో భారత్ అత్యధికంగా 13 పతకాలు సాధించింది. అమిత్, శివ థాపా -
Amit Panghal, Shiva Thapa: అమిత్, శివ జోరు
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), మాజీ విజేత శివ థాపా (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో అమిత్ 5–0తో బిబోసినోవ్ (కజకిస్తాన్)పై... శివ 4–0తో బఖోదుర్ ఉస్మనోవ్ (తజికిస్తాన్)పై ఘనవిజయం సాధించారు. అమిత్ 2019లో స్వర్ణం నెగ్గగా... శివ థాపా 2013లో పసిడి పతకం సాధించి, ఆ తర్వాత 2017లో రజతం... 2015, 2019లో కాంస్యాలు గెలిచాడు. మరోవైపు భారత్‌కే చెందిన వరీందర్ (60 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. వరీందర్ 2–3తో షాబ„Š (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. బతురోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన బౌట్లో వికాస్ కంటి గాయం తిరగబెట్టడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి బతురోవ్ను విజేతగా ప్రకటించారు. మహిళల విభాగంలో సాక్షి (54 కేజీలు)–దీనా (కజకిస్తాన్) సెమీఫైనల్ బౌట్ ఫలితాన్ని మార్చారు. గురువారం రాత్రి జరిగిన బౌట్లో సాక్షి 3–2తో దీనాను ఓడించింది. అయితే ఈ ఫలితంపై కజకిస్తాన్ బాక్సర్ సమీక్ష కోరగా... రీప్లేలు పరిశీలించిన జ్యూరీ కజకిస్తాన్ బాక్సర్ గెలిచినట్లు ప్రకటించింది. దాంతో సాక్షికి కాంస్యం ఖాయమైంది. -
Boxer Shiva Thapa: వరుసగా ఐదో పతకం
దుబాయ్: భారత బాక్సర్ శివ థాపా వరుసగా ఐదోసారి ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పతకం సాధించాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో శివ థాపా 64 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అస్సాంకు చెందిన శివ 5–0తో నాదిర్ (కువైట్)పై గెలిచాడు. కాగా ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో శివ థాపా 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో 1–4తో ప్రస్తుత ప్రపంచ, ఆసియా చాంపియన్ మిరాజిజ్‌బెక్ మిర్జాహలిలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Telangana Boxer: హుసాముద్దీన్ శుభారంభం -
బాక్సింగ్‌లో ‘పసిడి’ పంట
టోక్యో: ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు శివ థాపా, పూజా రాణి బంగారు పతకాలు సాధించారు. ఫైనల్లో ఓడిన ఆశిష్ రజతంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 63 కేజీల టైటిల్ బౌట్లో నాలుగు సార్లు ఆసియా చాంపియన్ అయిన శివ 5–0తో ఆసియా కాంస్య విజేత సనతలి టోల్తయెవ్ (కజకిస్తాన్)పై ఎదురులేని విజయం సాధించాడు. 69 కేజీల తుదిపోరులో ఆశిష్‌కు 1–4తో జపాన్ బాక్సర్ సెవొన్ ఒకజవా చేతిలో పరాజయం ఎదురైంది. మహిళల 75 కేజీల కేటగిరీ ఫైనల్లో ఆసియా క్రీడల కాంస్య విజేత పూజా రాణి 4–1తో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌పై విజయం సాధించింది. ఈ టెస్టు ఈవెంట్లో భారత్ మొత్తం ఏడు పతకాల్ని చేజిక్కించుకుంది. సెమీస్‌లో ఓడిపోవడంతో తెలంగాణ రెజ్లర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (91 కేజీలు), వహ్లిమ్‌పుయా (75 కేజీలు) కాంస్య పతకాలతో తృప్తిపడ్డారు. -
పసిడికి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నిఖత్, సిమ్రన్‌జిత్, సుమీత్ సాంగ్వాన్, వహ్లిమ్‌పుయా సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకోగా... ముగ్గురు బాక్సర్లు శివ థాపా (63 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లో సనా కవానో (జపాన్) చేతిలో... 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ కజకిస్తాన్ బాక్సర్ రిమ్మా వొలోసెంకో చేతిలో ఓడిపోయారు.పురుషుల విభాగం 91 కేజీల సెమీఫైనల్స్‌లో ఐబెక్ ఒరాల్‌బే (కజకిస్తాన్) చేతిలో సుమీత్ సాంగ్వాన్... 75 కేజీల విభాగంలో యుటో మొరివాకా (జపాన్) చేతిలో వహ్లిమ్‌పుయా ఓటమి చవిచూశారు. ఇతర సెమీఫైనల్స్‌లో దైసుకె నరిమత్సు (జపాన్)పై శివ థాపా; బీట్రిజ్ సోరెస్ (బ్రెజిల్)పై పూజా రాణి; హిరోయాకి కిన్‌జియో (జపాన్)పై ఆశిష్ గెలిచి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. -
శివ థాపా పసిడి పంచ్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్ శివ థాపా కజకిస్తాన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్ (కజకిస్తాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్ లభించింది. స్వర్ణం ఖాయమైంది. పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన దుర్యోధన్ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు. -
క్వార్టర్స్‌లో శివ
బ్యాంకాక్: వరుసగా నాలుగోసారి ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించే దిశగా భారత స్టార్ బాక్సర్ శివ థాపా మరో అడుగు ముందుకేశాడు. 2013, 2015, 2017లలో పతకాలు సాధించిన అతను ఈసారీ శుభారంభం చేశాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగం బౌట్లో శివ థాపా 4–1తో కిమ్ వన్హో (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెత్‌బెక్ ఉలు (కిర్గిజిస్తాన్)తో నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో శివ గెలిస్తే అతనికి కనీసం కాంస్యం ఖాయమవుతుంది. శివ థాపాతోపాటు దీపక్ (49 కేజీలు), కవీందర్ బిష్త్ (56 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు), ఆశిష్ (69 కేజీలు)... మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్స్‌లో దీపక్ 5–0తో ముతునాక (శ్రీలంక)పై, రోహిత్ 5–0తో నూరిస్తాని (అఫ్గానిస్తాన్)పై, కవీందర్ 5–0తో సుబారు మురాటా (జపాన్)పై, ఆశిష్ 3–2తో తంగ్లాతిహాన్ (చైనా)పై గెలిచారు. లవ్లీనా 5–0తో త్రాన్ తి లిన్ (వియత్నాం)పై, మనీషా 5–0తో డో నా యుయెన్ (వియత్నాం)పై నెగ్గారు. మరో బౌట్లో నీతూ 1–4తో పిన్ మెంగ్ చెయి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. -
శివ, సుమీత్... రజతాలతో సరి!
ఫైనల్లో ఓడిన భారత బాక్సర్లు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): పసిడి పతకాలు సాధించాలని ఆశించిన భారత బాక్సర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్లకు నిరాశ ఎదురైంది. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో శివ థాపా (60 కేజీలు) తొలి రౌండ్ ముగియకముందే గాయం కారణంగా వైదొలగగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) 0–5తో టాప్ సీడ్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో శివ థాపాకిది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2013లో స్వర్ణం నెగ్గిన శివ... 2015లో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా వరుసగా మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. ఎల్నూర్ అబ్దురైమోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో మూడు నిమిషాల నిడివిగల తొలి రౌండ్ చివరి సెకన్లలో శివ కుడి కంటి పైభాగానికి గాయం అయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి అబ్దురైమోవ్ను విజేతగా ప్రకటించారు. ‘నా రెండు లక్ష్యాలు పూర్తయ్యాయి. పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్‌ను దక్కించుకున్నాను’ అని శివ థాపా వ్యాఖ్యానించాడు. మరోవైపు గౌరవ్ బిధురి (56 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ‘బాక్స్ ఆఫ్’ బౌట్లలో రైమీ తనకా (జపాన్) చేతిలో గౌరవ్... అవైజ్ అలీఖాన్ (పాకిస్తాన్) చేతిలో మనీశ్ ఓడిపోయారు. ఈ టోర్నమెంట్‌లోని ఆయా కేటగిరీలలో టాప్–6లో నిలిచిన బాక్సర్లు ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. -
తొలి రౌండ్లోనే ముగిసిన శివ థాపా పోరాటం
రియో డి జనీరో: డ్రెస్ కోడ్(జెర్సీ) వివాదం ముగిసిన తర్వాత జరిగిన బౌట్ లో భారత బాక్సర్ శివ థాపా నిరాశపరిచాడు. 56 కేజీల విభాగంలో క్యూబా బాక్సర్ రొబిసీ రమిరేజ్ కరజానాతో జరిగిన బౌట్ లో భారత బాక్సర్ శివ థాపా ఓటమి పాలయ్యాడు. మూడు రౌండ్లలోనూ భారత బాక్సర్ పై కరజానాదే ఆధిపత్యం. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ మాజీ చాంపియన్ అయిన ప్రత్యర్థి రొబిసీ రమిరేజ్ పంచ్ లకు దీటుగా బదులివ్వకపోవడంతో 3-0 తేడాతో శివ థాపా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. -
మేమంతా నీతోనే: సచిన్
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో రజత పతకం సాధించి రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత బాక్సర్ శివ థాపాకు మాస్టర్ బ్టాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది. 'రియోకు అర్హత సాధించిన నీకు అంతా మంచే జరగాలి. మేమంతా నీతోనే ఉన్నాం. మా నుంచి నీకు పూర్తి సహకారం ఉంటుంది. రియో పోరులో ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు. లక్ష్యంపైనే గురి పెట్టు. ఫలితం అదే వస్తుంది' అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు. బరిలో దిగేటప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలని సచిన్ సూచించాడు. ఒక బిగ్ ఈవెంట్ లో పాల్గొంటున్నప్పుడు ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుందని, దాన్ని అధిగమించడానికి కృషి చేయమని శివ థాపాకు విజ్ఞప్తి చేశాడు. టీమిండియా వన్డే వరల్డ్ కప్ ను గెలిచినప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించారంటూ థాపా ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు సచిన్ పై విధంగా బదులిచ్చాడు. -
శివ థాపాకు రజతం
కియానన్ (చైనా): రియో ఒలింపిక్స్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత యువ బాక్సర్ శివ థాపా ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను రజతంతో ముగించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం ఫైనల్లో శివ థాపా 0-3తో (27-30, 27-30, 27-30) చాట్‌చాయ్ బుట్డీ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు పురుషుల 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో ఓటమి చవిచూశాడు. దేవేంద్రో 0-3తో (28-29, 27-30, 27-30) గాన్ ఎర్డెన్ గాన్ఖుయాగ్ (మంగోలియా) చేతిలో పరాజయం పాల య్యాడు. దాంతో ఈ టోర్నీ ద్వారా దేవేంద్రో రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు. ఇప్పటివరకు భారత్ నుంచి శివ థాపా ఒక్కడే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు భారత పురుషుల బాక్సర్లకు మరో రెండు అవకాశాలు ఉన్నాయి. మహిళా బాక్సర్లకు మాత్రం ఏకైక అవకాశం ఉంది. మే 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు కేటగిరిల్లో సెమీఫైనల్‌కు చేరిన నలుగురు బాక్సర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
‘రియో’ ఒలింపిక్స్‌కు శివ థాపా అర్హత
మేరీకోమ్ పరాజయం దేవేంద్రోకు మరో అవకాశం కియానన్ (చైనా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ బాక్సర్ శివ థాపా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో శివ థాపా 56 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని ‘రియో’ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో శివ థాపా 3-0తో (29-28, 30-27, 30-27) కైరాత్ యెరలియేవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన శివ థాపా శుక్రవారం జరిగే ఫైనల్లో చాట్‌చాయ్ బుట్డీ (థాయ్‌లాండ్)తో తలపడతాడు. భారత్‌కే చెందిన మరో బాక్సర్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లో 0-3తో (26-30, 26-30, 26-30) టాప్ సీడ్ రోగెన్ లాడాన్ (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి చెందాడు. శుక్రవారం జరిగే ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో గాన్ఖుయాగ్ (మంగోలియా)పై గెలిస్తే దేవేంద్రో రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు. మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు) ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమై ఈ టోర్నీ ద్వారా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది. సెమీస్‌లో మేరీకోమ్ 0-3తో (36-40, 37-39, 37-39) తన చిరకాల ప్రత్యర్థి రెన్ కాన్‌కాన్ (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా మేరీకోమ్‌కు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం మిగిలి ఉంది. -
సెమీస్‌లో మేరీకోమ్
కియానన్ (చైనా): మరో బౌట్లో గెలిస్తే భారత్‌కు చెందిన ముగ్గురు బాక్సర్లు మేరీకోమ్, శివ థాపా, దేవేంద్రో సింగ్‌లు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు)... పురుషుల విభాగంలో శివ థాపా (56 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మరోవైపు భారత్‌కే చెందిన లైష్రామ్ సరితా దేవి (60 కేజీలు), ధీరజ్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో మేరీకోమ్ 3-0తో నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)పై, శివ థాపా 2-1తో అరాషి మొరిసాకా (జపాన్)పై, దేవేంద్రో 3-0తో పో వీ తు (చైనీస్ తైపీ)పై గెలిచారు. సరితా దేవి 1-2తో లూ దుయెన్ (వియత్నాం) చేతిలో, ధీరజ్ 0-3తో చార్లీ స్యురెజ్ (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయారు. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన బాక్సర్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
క్వార్టర్స్‌లో శివ థాపా, దేవేంద్రో
కియానన్ (చైనా): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు శివ థాపా (56 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన బౌట్లలో శివ థాపా 3-0తో మైయోంగ్‌క్వాన్ లీ (కొరియా)పై గెలుపొందగా... దేవేంద్రో 3-0తో మొహమ్మద్ ఫువాద్ (మలేసియా)ను ఓడించాడు. అయితే భారత్‌కే చెందిన గౌరవ్ బిధురి (52 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు) మాత్రం ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో వికాస్, శివ
దోహా: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. వికాస్ కృషణ్ (75 కేజీ), శివ తాపా (56 కేజీ)లు క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వికాస్ 2-1తో నాలుగోసీడ్ తోమస్ జబ్లనోస్కి (పోలెండ్)పై నెగ్గాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో ప్రత్యర్థి అటాకింగ్‌కు దిగినా వికాస్ అప్పర్ కట్స్, రైట్ హుక్స్‌తో సమర్థంగా నిలువరించాడు. మరో బౌట్లో శివ... ఆఫ్రికా చాంపియన్ మహ్మద్ హమోట్ (మొరాకో)ను ఓడించాడు. కేవలం 26 సెకన్లలోనే ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. రెండు, మూడో రౌండ్లలో శివ కొట్టిన లెఫ్ట్ హుక్‌లు బౌట్కే హైలెట్‌గా నిలిచాయి. నుదురుపై కొట్టిన పంచ్‌లకు హమోట్ దిమ్మతిరిగి పడిపోయాడు. దీంతో ఎనిమిది అంకెలు లెక్కపెట్టాక అత్యవసరంగా వైద్య బృందాన్ని పిలిపించి చికిత్స చేయించారు. -
వికాస్, శివ శుభారంభం
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (56 కేజీలు) శుభారంభం చేయగా... మనోజ్ కుమార్ (64 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. భారత బాక్సింగ్ సంఘంపై నిషేధం ఉన్నందున ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకంపై పోటీపడుతున్నారు. మంగళవారం తొలి రౌండ్లో వికాస్ 3-0తో జోల్టాన్ హర్సా (హంగేరి)పై, శివ థాపా 3-0తో ఖలీల్ లిటిమ్ (అల్జీరియా)పై విజ యం సాధించగా... మనోజ్ కుమార్ 1-2తో అబ్దెల్హక్ అతాక్ని (మొరాకో) చేతిలో, దేవేంద్రో సింగ్ 1-2తో హార్వీ హోర్న్ (బ్రిటన్) చేతిలో ఓడారు. -
సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో దేవేంద్రో 3-0తో కార్నెలిస్ లాంగూ (ఇండోనేసియా)పై, శివ థాపా 2-1తో మాలాబెకోవ్ (కిర్గిజిస్తాన్)పై, వికాస్ 3-0తో దిన్ హోంగ్ త్రువోంగ్ (వియత్నాం)పై గెలిచారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. మనోజ్ 0-3తో ఫజ్లిద్దిన్ గైబనజరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; మన్‌ప్రీత్ 0-3తో తులగనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో శివ, దేవేంద్రో
బ్యాంకాక్ : డిఫెండింగ్ చాంపియన్ శివ థాపా, గతేడాది రజత పతక విజేత దేవేంద్రో సింగ్‌లు... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం జరిగిన 56 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో శివ 3-0తో మహ్మద్ అల్‌వాది (జోర్డాన్)పై నెగ్గగా, దేవేంద్రో 3-0తో హీ జున్జున్ (చైనా)ను చిత్తు చేశాడు. 75 కేజీల విభాగంలో వికాస్ కృషన్ 3-0తో అచిలోవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. అయితే 69 కేజీల బౌట్లో మన్దీప్ జాంగ్రా 1-2తో యుషిరో సుజుకీ (జపాన్) చేతిలో ఓడాడు. జున్జున్తో జరిగిన బౌట్లో తొలి సెకను నుంచే దేవేంద్రో పంచ్ పవర్ చూపించాడు. తొలి రౌండ్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఈ భారత బాక్సర్... మిగతా రౌండ్లలో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. లెఫ్ట్ అప్పర్ కట్స్‌తో పాటు రెగ్యులర్ పంచ్‌లతో హడలెత్తించాడు. -
క్వార్టర్స్‌లో శివ థాపా, మనోజ్
అల్మాటీ (కజకిస్థాన్): మరో విజయం లభిస్తే... ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. 56 కేజీల విభాగంలో భారత రైజింగ్ స్టార్ శివ థాపా... 64 కేజీల విభాగంలో మనోజ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శివ 2-1 (28-29, 29-28, 30-27)తో అల్బెర్టో మెలియన్ (అర్జెంటీనా)పై... మనోజ్ 2-1 (28-29, 29-28, 29-28)తో యువెస్ ఎలిసెస్ (కెనడా)పై విజయం సాధించారు. తొలి రౌండ్‌ను కోల్పోయిన శివ రెండో రౌండ్‌ను పాయింట్ తేడాతో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్‌గా ఉన్న ఈ అస్సాం బాక్సర్ కీలకమైన మూడో రౌండ్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి విజయం నమోదు చేశాడు. శివ థాపా మాదిరిగానే మనోజ్ కూడా తొలి రౌండ్‌ను చేజార్చుకొని తర్వాతి రెండు రౌండ్లలో నెగ్గి ముందంజ వేశాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో జావిద్ చలాబియెవ్ (అజర్బైజాన్)తో శివ; యాస్నియెర్ లోపెజ్ (క్యూబా)తో మనోజ్ పోటీపడతారు. ఈ బౌట్లలో గనుక శివ, మనోజ్‌లు గెలిస్తే వారికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ పోటీల చరిత్రలో విజేందర్ (2009లో), వికాస్ కృషన్ (2011లో) భారత్‌కు కాంస్య పతకాలు అందించారు. ‘అల్బెర్టోతో పోరు చాలా హోరాహోరీగా సాగింది. నా శక్తినంతా ధారపోయాల్సి వచ్చింది. తొలి రౌండ్లో నిదానంగా ఆడటంతో వెనుకబడిపోయాను. అయితే తర్వాతి రెండు రౌండ్లలో దూకుడు పెంచాను’ అని శివ థాపా వ్యాఖ్యానించాడు. మరోవైపు 49 కేజీల విభాగంలో ప్రపంచ క్యాడెట్ మాజీ చాంపియన్ తోక్చమ్ నానో సింగ్... 91 కేజీల విభాగంలో మన్‌ప్రీత్ సింగ్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నానో సింగ్ 0-3 (27-30, 28-29, 28-29)తో ఆంథోనీ రివెరా (ప్యూర్టోరికో) చేతిలో; మన్‌ప్రీత్ 0-3 (27-30, 27-30, 27-30)తో టాప్ సీడ్ తెమూర్ మమదోవ్ (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయారు.