సెమీస్‌లో మేరీకోమ్
కియానన్ (చైనా): మరో బౌట్‌లో గెలిస్తే భారత్‌కు చెందిన ముగ్గురు బాక్సర్లు మేరీకోమ్, శివ థాపా, దేవేంద్రో సింగ్‌లు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు)... పురుషుల విభాగంలో శివ థాపా (56 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మరోవైపు భారత్‌కే చెందిన లైష్రామ్ సరితా దేవి (60 కేజీలు), ధీరజ్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో మేరీకోమ్ 3-0తో నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)పై, శివ థాపా 2-1తో అరాషి మొరిసాకా (జపాన్)పై, దేవేంద్రో 3-0తో పో వీ తు (చైనీస్ తైపీ)పై గెలిచారు. సరితా దేవి 1-2తో లూ దుయెన్ (వియత్నాం) చేతిలో, ధీరజ్ 0-3తో చార్లీ స్యురెజ్ (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయారు. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన బాక్సర్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.