
బ్యాంకాక్: వరుసగా నాలుగోసారి ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించే దిశగా భారత స్టార్ బాక్సర్ శివ థాపా మరో అడుగు ముందుకేశాడు. 2013, 2015, 2017లలో పతకాలు సాధించిన అతను ఈసారీ శుభారంభం చేశాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగం బౌట్‌లో శివ థాపా 4–1తో కిమ్ వన్‌హో (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెత్‌బెక్ ఉలు (కిర్గిజిస్తాన్)తో నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో శివ గెలిస్తే అతనికి కనీసం కాంస్యం ఖాయమవుతుంది.
శివ థాపాతోపాటు దీపక్ (49 కేజీలు), కవీందర్ బిష్త్ (56 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు), ఆశిష్ (69 కేజీలు)... మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్స్‌లో దీపక్ 5–0తో ముతునాక (శ్రీలంక)పై, రోహిత్ 5–0తో నూరిస్తాని (అఫ్గానిస్తాన్)పై, కవీందర్ 5–0తో సుబారు మురాటా (జపాన్)పై, ఆశిష్ 3–2తో తంగ్లాతిహాన్ (చైనా)పై గెలిచారు. లవ్లీనా 5–0తో త్రాన్ తి లిన్ (వియత్నాం)పై, మనీషా 5–0తో డో నా యుయెన్ (వియత్నాం)పై నెగ్గారు. మరో బౌట్‌లో నీతూ 1–4తో పిన్ మెంగ్ చెయి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment