Asian Boxing Championship
-
4 స్వర్ణాలు 1 రజతం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. ఒలింపిక్ పతకం తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్ 63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్ 5–0 తేడాతో జపాన్ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది. 81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్జాన్ (కజకిస్తాన్)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన ఇస్లామ్ హుసైలి తొలి రౌండ్లోనే డిస్క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. -
Asian Boxing Championships 2022: స్వర్ణ పతక పోరుకు లవ్లీనా అర్హత
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. జోర్డాన్‌లో బుధవారం జరిగిన సెమీఫైనల్లో లవ్లీనా 5–0తో సెయోంగ్ సుయోన్ (కొరియా)పై గెలిచింది. భారత్‌కే చెందిన అల్ఫియా (ప్లస్ 81 కేజీలు), మీనాక్షి (52 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. అంకుశిత (66 కేజీలు), ప్రీతి (57 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 12వ పతకం ఖాయం చేసిన నరేందర్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 12వ పతకం ఖాయమైంది. పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో నరేందర్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై గెలిచాడు. బుధవారం మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు సెమీఫైనల్ బౌట్లు ఆడనున్నారు. -
సూపర్ సంజీత్...
దుబాయ్: ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా తన పంచ్ పవర్‌తో భారత హెవీవెయిట్ బాక్సర్ సంజీత్ సత్తా చాటుకున్నాడు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పురుషుల 91 కేజీల విభాగంలో సంజీత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 91 కేజీల ఫైనల్లో సంజీత్ 4–1తో 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, మూడుసార్లు ఆసియా చాంపియన్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించాడు. ► మరోవైపు 52 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్... 64 కేజీల విభాగంలో శివ థాపాలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తీవ్రంగా పోరాడినా చివరకు రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 2–3తో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ షఖోబిదిన్ జోయ్‌రోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... శివ థాపా 2–3తో బాతర్సుఖ్ చిన్‌జోరిగ్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. ► 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ జోయ్‌రోవ్ చేతిలో ఓడిన అమిత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చాడు. ఇద్దరూ ఎక్కడా జోరు తగ్గించుకోకుండా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అమిత్ ఆటతీరు చూశాక విజయం అతడినే వరిస్తుందనిపించినా... బౌట్ జడ్జిలు మాత్రం జోయ్‌రోవ్ ఆధిపత్యం చలాయించాడని భావించారు. తుది ఫలితంపై భారత బృందం జ్యూరీకి అప్పీల్ చేసింది. అయితే భారత అప్పీల్‌ను జ్యూరీ తోసిపుచ్చింది. దాంతో జోయ్రోవ్కే స్వర్ణం ఖాయమైంది. ► ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... మహిళల విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2019లో భారత్ అత్యధికంగా 13 పతకాలు సాధించింది. అమిత్, శివ థాపా -
Asian Boxing Championship: పూజా పసిడి పంచ్
దుబాయ్: నాలుగు పసిడి పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో రింగ్‌లోకి అడుగుపెట్టిన భారత మహిళా బాక్సర్లు చివరకు ఒక స్వర్ణ పతకంతో సంతృప్తి పడ్డారు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆదివారం మహిళల విభాగంలో నాలుగు ఫైనల్స్‌లో పోటీపడ్డ భారత బాక్సర్లలో డిఫెండింగ్ చాంపియన్ పూజా రాణి (75 కేజీలు) మళ్లీ స్వర్ణం సొంతం చేసుకోగా... ఐదుసార్లు చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు), తొలిసారి ‘ఆసియా’ టోర్నీ లో ఆడిన లాల్‌బుత్సాహి (64 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ఫైనల్లో పూజా రాణి 5–0తో మవ్లుదా మవ్లోనోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన పూజా రాణికి సెమీఫైనల్లో ‘వాకోవర్’ లభించింది. పూజాకు స్వర్ణ పతకంతోపాటు 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 25 వేలు) లభించింది. ఇతర ఫైనల్స్‌లో మేరీకోమ్ 2–3తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నజీమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో... లాల్‌బుత్సాహి 2–3తో మిలానా సఫ్రనోవా (కజకిస్తాన్) చేతిలో... అనుపమ 2–3తో లజత్ కుంగ్జిబయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మేరీకోమ్, లాల్‌బుత్సాహి, అనుపమాలకు రజత పతకాలతోపాటు 5 వేల డాలర్ల చొప్పున (రూ. 3 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. సెమీఫైనల్లో ఓడిన లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సాక్షి చౌదరీ (64 కేజీలు), మోనిక (48 కేజీలు), సవీటి బురా (81 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. నేడు జరిగే పురుషుల విభాగం ఫైనల్స్‌లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), శివ థాపా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) బరిలోకి దిగనున్నారు. -
Amit Panghal, Shiva Thapa: అమిత్, శివ జోరు
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), మాజీ విజేత శివ థాపా (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో అమిత్ 5–0తో బిబోసినోవ్ (కజకిస్తాన్)పై... శివ 4–0తో బఖోదుర్ ఉస్మనోవ్ (తజికిస్తాన్)పై ఘనవిజయం సాధించారు. అమిత్ 2019లో స్వర్ణం నెగ్గగా... శివ థాపా 2013లో పసిడి పతకం సాధించి, ఆ తర్వాత 2017లో రజతం... 2015, 2019లో కాంస్యాలు గెలిచాడు. మరోవైపు భారత్‌కే చెందిన వరీందర్ (60 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. వరీందర్ 2–3తో షాబ„Š (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. బతురోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన బౌట్లో వికాస్ కంటి గాయం తిరగబెట్టడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి బతురోవ్ను విజేతగా ప్రకటించారు. మహిళల విభాగంలో సాక్షి (54 కేజీలు)–దీనా (కజకిస్తాన్) సెమీఫైనల్ బౌట్ ఫలితాన్ని మార్చారు. గురువారం రాత్రి జరిగిన బౌట్లో సాక్షి 3–2తో దీనాను ఓడించింది. అయితే ఈ ఫలితంపై కజకిస్తాన్ బాక్సర్ సమీక్ష కోరగా... రీప్లేలు పరిశీలించిన జ్యూరీ కజకిస్తాన్ బాక్సర్ గెలిచినట్లు ప్రకటించింది. దాంతో సాక్షికి కాంస్యం ఖాయమైంది. -
Boxer Shiva Thapa: వరుసగా ఐదో పతకం
దుబాయ్: భారత బాక్సర్ శివ థాపా వరుసగా ఐదోసారి ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పతకం సాధించాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో శివ థాపా 64 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అస్సాంకు చెందిన శివ 5–0తో నాదిర్ (కువైట్)పై గెలిచాడు. కాగా ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో శివ థాపా 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో 1–4తో ప్రస్తుత ప్రపంచ, ఆసియా చాంపియన్ మిరాజిజ్‌బెక్ మిర్జాహలిలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Telangana Boxer: హుసాముద్దీన్ శుభారంభం -
Telangana Boxer: క్వార్టర్ ఫైనల్లో హసాముద్దీన్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో 56 కేజీల విభాగంలో హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో రెండుసార్లు ఆసియా యూత్ చాంపియన్‌గా నిలిచిన మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. 64 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన శివ థాపా గెలిచాడు. తొలి రౌండ్లో శివ థాపా 5–0తో దిమిత్రి పుచిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. నిజామాబాద్ బిడ్డ.. బాక్సింగ్ బాదుషా! బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసే హుసాముద్దీన్.. చిన్ననాటి నుంచి తండ్రి శంషామొద్దీన్ శిక్షణలో రాటుదేలాడు. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న అతడు.. 2010 నుంచి ఇప్పటివరకు ఏటా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఇందూరు కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. ఓ వైపు ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవలందిస్తున్న అతడు.. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుసాముద్దీన్.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. ఎన్నెన్నో పతకాలు.. 2015లో కోరియాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, 2016 గౌహతిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించాడు. 2017లో బల్గేరియాలో జరిగిన పోటీల్లో రజత పతకం, మంగోళియాలో కాంస్య పతకం గెలుపొందాడు. 2018లో వరుసగా ఆస్ట్రేలియా, బల్గేరియా, ఢిల్లీలలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2019లో బెంగళూరు, ఖజకిస్తాన్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అతడు.. చైనాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: Asian Boxing Championship: రింగ్‌లోకి దిగకముందే 7 పతకాలు! French Open: సుమిత్ తొలి రౌండ్ ప్రత్యర్థి మార్కోరా -
Asian Boxing Championship: రింగ్‌లోకి దిగకముందే 7 పతకాలు!
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు రింగ్‌లోకి దిగకముందే ఏడు పతకాలను ఖాయం చేసుకున్నారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో కరోనా కారణంగా మహిళల విభాగంలో 10 కేటగిరీల్లో కలిపి మొత్తం 47 మంది బాక్సర్లే పాల్గొంటున్నారు. చిన్నసైజు ‘డ్రా’ కారణంగా భారత్ నుంచి మేరీకోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు), సవీటి బురా (81 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), లాల్బుత్సహి (64 కేజీలు), మోనిక (48 కేజీలు) సెమీస్ చేరారు. కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చదవండి: చైనా మారథాన్‌లో పెను విషాదం -
ఇందూరు బిడ్డ.. బాక్సింగ్ బాదుషా!
సాక్షి, నిజామాబాద్: అంతర్జాతీయ గడ్డపై ఇందూరు బిడ్డ మరోమారు రాణించాడు. ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్‌లు కురిపించి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని మరోమారు చాటాడు. అతడే బాక్సర్ హుస్సాముద్దీన్. శనివారం చైనాలో జరిగిన ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో హుస్సాముద్దీన్ సత్తా చాటాడు. 57 కిలోల విభాగంలో తలపడిన అతడు.. తన పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. ఆర్మీలో సేవలందిస్తూనే, బాక్సింగ్‌లో రాణిస్తున్న అతడు జిల్లా వాసులకు ఆదర్శంగా నిలిచాడు. తండ్రే కోచ్.. బాక్సింగ్‌లో తన కంటు గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసిన హుస్సాముద్దీన్ ఇప్పుడు తన సత్తా చాటుతున్నాడు. చిన్ననాటి నుంచి తండ్రి శంషామొద్దీన్ శిక్షణలో బాక్సింగ్‌లో రాటుదేలాడు. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న హుస్సాముద్దీన్.. అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తున్నాడు. 2010 నుంచి ఇప్పటివరకు ఏటా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఇందూరు కీర్తిని నలువైపులా చాటిచెబుతున్నాడు. ఓ వైపు ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవలందిస్తున్న అతడు.. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుస్సామొద్దీన్.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. సాధించిన పతకాలెన్నో.. 2015లో కోరియాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, 2016 గౌహతిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 2017లో బల్గేరియాలో జరిగిన పోటీల్లో రజత పతకం, మంగోళియాలో కాంస్య పతకం సాధించాడు. 2018లో వరుసగా ఆస్ట్రేలియా, బల్గేరియా, ఢిల్లీలలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2019లో బెంగళూరు, ఖజకిస్తాన్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అతడు.. తాజాగా చైనాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. -
ఫైనల్ పంచ్‌కు ఆరుగురు
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ‘రింగ్’లో మరోసారి తమ పంచ్ పవర్ చాటుకొని ఏకంగా ఆరుగురు భారత బాక్సర్లు ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతక పోరుకు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు), కవిందర్ సింగ్ బిష్త్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), దీపక్ సింగ్ (49 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు)... పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లో పరాజయంపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం ఫైనల్స్ జరుగుతాయి. గురువారం జరిగిన పురుషుల విభాగం సెమీఫైనల్స్‌లో గత ఏడాది ఆసియా క్రీడల చాంపియన్ అమిత్ 4–1తో జియాంగున్ హు (చైనా)పై, కవిందర్ 4–1తో ఎంఖ్ అమర్ ఖర్ఖు (మంగోలియా)పై, ఆశిష్ కుమార్ 3–2తో మౌసవీ సెయెద్‌షాహిన్ (ఇరాన్)పై గెలుపొందగా... దీపక్‌కు తన ప్రత్యర్థి తెమిర్తాస్ జుసుపోవ్ (కజకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో పూజా రాణి 5–0తో ఫరీజా షోల్టే (కజకిస్తాన్)పై, సిమ్రన్‌జిత్ కౌర్ 5–0తో మలియెవా మఫ్తునాఖోన్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. ఇతర సెమీఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 0–5తో ఎన్గుయెన్ థి తామ్ (వియత్నాం) చేతిలో... సరితా దేవి 0–5తో వెన్లు యాంగ్ (చైనా) చేతిలో... మనీషా 2–3తో హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ) చేతిలో... సోనియా చహల్ 2–3తో నిలావన్ టెక్‌సుయెప్ (థాయ్‌లాండ్) చేతిలో; శివ థాపా 1–4తో జకీర్ సఫిలిన్ (కజకిస్తాన్) చేతిలో, ఆశిష్ 0–5తో బోబో ఉస్మాన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. గాయం కారణంగా సతీశ్ కుమార్ బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థి కమ్‌షెయ్‌బెక్ (కజకిస్తాన్)కు వాకోవర్ ఇచ్చాడు. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో 37 ఏళ్ల సరితా దేవికిది ఎనిమిదో పతకం కావడం విశేషం. ఆమె 2001లో రజతం, 2017లో కాంస్యం, 2003, 2005, 2008, 2010, 2012లలో స్వర్ణాలు గెలిచింది. -
క్వార్టర్స్‌లో శివ
బ్యాంకాక్: వరుసగా నాలుగోసారి ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించే దిశగా భారత స్టార్ బాక్సర్ శివ థాపా మరో అడుగు ముందుకేశాడు. 2013, 2015, 2017లలో పతకాలు సాధించిన అతను ఈసారీ శుభారంభం చేశాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగం బౌట్లో శివ థాపా 4–1తో కిమ్ వన్హో (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెత్‌బెక్ ఉలు (కిర్గిజిస్తాన్)తో నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో శివ గెలిస్తే అతనికి కనీసం కాంస్యం ఖాయమవుతుంది. శివ థాపాతోపాటు దీపక్ (49 కేజీలు), కవీందర్ బిష్త్ (56 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు), ఆశిష్ (69 కేజీలు)... మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్స్‌లో దీపక్ 5–0తో ముతునాక (శ్రీలంక)పై, రోహిత్ 5–0తో నూరిస్తాని (అఫ్గానిస్తాన్)పై, కవీందర్ 5–0తో సుబారు మురాటా (జపాన్)పై, ఆశిష్ 3–2తో తంగ్లాతిహాన్ (చైనా)పై గెలిచారు. లవ్లీనా 5–0తో త్రాన్ తి లిన్ (వియత్నాం)పై, మనీషా 5–0తో డో నా యుయెన్ (వియత్నాం)పై నెగ్గారు. మరో బౌట్లో నీతూ 1–4తో పిన్ మెంగ్ చెయి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. -
భారత బాక్సర్ల శుభారంభం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. పోటీల తొలి రోజు శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు బాక్సర్లు కూడా గెలుపొందడం విశేషం. పురుషుల విభాగంలో జాతీయ చాంపియన్ దీపక్ (49 కేజీలు), రోహిత్ టొకాస్ (64 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ఆశిష్ (69 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు) తొలి రౌండ్ బౌట్లలో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచిన భారత బాక్సర్లు సెప్టెంబరులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని భారత బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా తెలిపారు. తొలి రౌండ్ బౌట్లలో దీపక్ 5–0తో లోయ్ బుయ్ కాంగ్‌డాన్ (వియత్నాం)పై, రోహిత్ 5–0తో చు యెన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో సోపోర్స్ (కంబోడియా)పై, సతీశ్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై నెగ్గగా... సోనియా 5–0తో డో నా యువాన్ (వియత్నాం)ను ఓడించింది. మొత్తం 34 దేశాల నుంచి పురుషుల విభాగంలో 198 మంది... మహిళల విభాగంలో 100 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ బౌట్లను స్లో మోషన్లో కూడా రికార్డు చేస్తున్నారు. ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే బౌట్ ముగిసిన నిమిషంలోపు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో పరిశీలించిన తర్వాత అప్పీల్లో నిర్ణేతలు నిర్ణయం సరైనదేనని తేలితే మాత్రం అప్పీల్ చేసిన వారు వెయ్యి డాలర్లు పెనాల్టీగా చెల్లించాలి. -
ఆసియా బాక్సింగ్ పోటీలకు నిఖత్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటుకునేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సిద్ధమైంది. ఈనెల 17 నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు పది మంది సభ్యులుగల భారత మహిళల బృందం సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఆసియా చాంపియన్‌షిప్‌ను సన్నాహకంగా భారత బాక్సర్లు భావిస్తున్నారు. 2001లో మొదలైన ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీ చరిత్రలో భారత మహిళా బాక్సర్లు 19 స్వర్ణాలు, 21 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి మొత్తం 60 పతకాలను సాధించారు. భారత మహిళల బాక్సింగ్ జట్టు: నీతూ (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), మనీషా (54 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), నుపుర్ (75 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు). -
ఆసియా బాక్సింగ్ పోటీలకు నిఖత్
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్థానం సంపాదించింది. ఏప్రిల్ 16 నుంచి 27 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం శనివారం సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ 4–1తో పింకీ రాణి (హరియాణా)పై నెగ్గి జాతీయ జట్టులోకి ఎంపికైంది. మరోవైపు దిగ్గజం మేరీకోమ్ ఆసియా చాంపియ¯Œ షిప్ పోటీలకు దూరమైంది. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. భారత జట్టు: నీతూ (హరియాణా–48 కేజీలు), నిఖత్ జరీన్ (తెలంగాణ–51 కేజీలు), మనీషా (హరియాణా–54 కేజీలు), సోనియా చహల్ (రైల్వేస్–57 కేజీలు), సరితా దేవి (ఆలిండియా పోలీస్–60 కేజీలు), సిమ్రన్ జిత్ కౌర్ (పంజాబ్–64 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం–69 కేజీలు), నుపుర్ (హరియాణా–75 కేజీలు), పూజా రాణి (హరియాణా–81 కేజీలు), సీమా పూనియా (రైల్వేస్–ప్లస్ 81 కేజీలు). -
ఐదో స్వర్ణంపై గురి..!
హో చి మిన్ సిటీ (వియ త్నాం):ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ మీట్ లో భారత బాక్సర్ మేరీకోమ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో భాగంగా 48 కేజీల విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో సుబాసా కొమురా (జపాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో ఈ చాంపియన్ షిప్ లో నాలుగుసార్లు స్వర్ణ పతకాన్ని గెలిచిన మేరీకోమ్.. మరో పసిడి పోరుకు సిద్ధమైంది. ఆసియా చాంపియన్ షిప్ మీట్ లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మేరీకోమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. బౌట్ తరువాత తన ప్రదర్శనపై మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది.. గత కొన్నేళ్లుగా తన దేశం కోసం పోరాడటం ఎంతో అద్భుతమైన అనుభూతిని కల్గిస్తూ ఉందని స్పష్టం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) ప్రెసిడెంట్ అజయ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఆయన సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని మేరీకోమ్ పేర్కొంది. ఇదిలా ఉంచితే, ఫైనల్ కు చేరిన మేరీకోమ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఫైనల్ పోరులో మరింత శక్తితో రాణించాలంటూ సచిన్ ఆకాంక్షించాడు. అంతకుముందు ఆసియా చాంపియన్ షిప్ లో ఐదుసార్లు తలపడిన 34 ఏళ్ల మేరీకోమ్.. నాలుగుసార్లు స్వర్ణం పతకాలు సాధించగా, ఒకసారి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. Way to go, @MangteC. My best wishes to you for the finals. More power to you, Champ. #ASBC2017Women pic.twitter.com/JKjXFUdqCx — sachin tendulkar (@sachin_rt) 7 November 2017 -
బాక్సర్ వికాస్‌కు హెచ్చరికతో సరి
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో సెమీఫైనల్ బౌట్‌కు ముందు ‘వాకోవర్’ ఇచ్చిన భారత బాక్సర్ వికాస్ క్రిషన్‌పై క్రమశిక్షణ కమిటీ విచారణ ముగిసింది. ఈసారికి అతడిని హెచ్చరికతో వదిలేయాలని నిర్ణయించినట్టు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పేర్కొంది. ‘జరిగిన సంఘటనపై అతడిని హెచ్చరించాం. ఇక ఈ విషయం ఇంతటితో ముగిసింది. క్రమశిక్షణ కమిటీ అతడితో మాట్లాడింది. అతడి వాదన విన్నాక హెచ్చరిక సరిపోతుందని భావించారు’ అని బీఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ సెమీస్‌లో కొరియన్ బాక్సర్తో తలపడాల్సి ఉండగా వికాస్ కారణం చెప్పకుండానే బౌట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అదే నెలలో జరిగిన వరల్డ్ సిరీస్ లో అతడికి ఆడే అవకాశం ఇవ్వకుండా, ఈ సంఘటనపై విచారణ కమిటీ నియమించారు. -
శివ, సుమీత్... రజతాలతో సరి!
ఫైనల్లో ఓడిన భారత బాక్సర్లు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): పసిడి పతకాలు సాధించాలని ఆశించిన భారత బాక్సర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్లకు నిరాశ ఎదురైంది. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో శివ థాపా (60 కేజీలు) తొలి రౌండ్ ముగియకముందే గాయం కారణంగా వైదొలగగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) 0–5తో టాప్ సీడ్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో శివ థాపాకిది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2013లో స్వర్ణం నెగ్గిన శివ... 2015లో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా వరుసగా మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. ఎల్నూర్ అబ్దురైమోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో మూడు నిమిషాల నిడివిగల తొలి రౌండ్ చివరి సెకన్లలో శివ కుడి కంటి పైభాగానికి గాయం అయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి అబ్దురైమోవ్ను విజేతగా ప్రకటించారు. ‘నా రెండు లక్ష్యాలు పూర్తయ్యాయి. పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్‌ను దక్కించుకున్నాను’ అని శివ థాపా వ్యాఖ్యానించాడు. మరోవైపు గౌరవ్ బిధురి (56 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ‘బాక్స్ ఆఫ్’ బౌట్లలో రైమీ తనకా (జపాన్) చేతిలో గౌరవ్... అవైజ్ అలీఖాన్ (పాకిస్తాన్) చేతిలో మనీశ్ ఓడిపోయారు. ఈ టోర్నమెంట్‌లోని ఆయా కేటగిరీలలో టాప్–6లో నిలిచిన బాక్సర్లు ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. -
ఆసియా బాక్సింగ్ ఫైనల్లో వికాస్
మరో ముగ్గురికి కాంస్యాలు బ్యాంకాక్ : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఫైనల్లోకి ప్రవేశించగా.. మరో ముగ్గురు కాంస్యాలతో సంతృప్తిపడ్డారు. శుక్రవారం జరిగిన 75 కేజీల సెమీస్ బౌట్లో వికాస్ 3-0తో వహీద్ అబ్దుల్రిదా (ఇరాక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. మామూలుగా డిఫెన్సివ్కు ప్రాధాన్యమిచ్చే వికాస్... ఈ బౌట్లో మాత్రం అటాకింగ్‌తో చెలరేగాడు. పంచ్‌ల్లో వైవిధ్యాన్ని చూపెడుతూ ఇరాక్ బాక్సర్‌ను కట్టిపడేశాడు. +91 కేజీల సెమీస్ బౌట్లో సతీష్ కుమార్ 0-3తో వాంగ్ జిబావో (చైనా) చేతిలో; 49 కేజీల బౌట్లో దేవేంద్రో 1-2తో హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; 56 కేజీల బౌట్లో డిఫెండింగ్ చాంపియన్ శివ తాపా 1-2తో ముర్జోన్ అక్హమదలివ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
క్వార్టర్స్‌లో శివ, దేవేంద్రో
బ్యాంకాక్ : డిఫెండింగ్ చాంపియన్ శివ థాపా, గతేడాది రజత పతక విజేత దేవేంద్రో సింగ్‌లు... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం జరిగిన 56 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో శివ 3-0తో మహ్మద్ అల్‌వాది (జోర్డాన్)పై నెగ్గగా, దేవేంద్రో 3-0తో హీ జున్జున్ (చైనా)ను చిత్తు చేశాడు. 75 కేజీల విభాగంలో వికాస్ కృషన్ 3-0తో అచిలోవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. అయితే 69 కేజీల బౌట్లో మన్దీప్ జాంగ్రా 1-2తో యుషిరో సుజుకీ (జపాన్) చేతిలో ఓడాడు. జున్జున్తో జరిగిన బౌట్లో తొలి సెకను నుంచే దేవేంద్రో పంచ్ పవర్ చూపించాడు. తొలి రౌండ్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఈ భారత బాక్సర్... మిగతా రౌండ్లలో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. లెఫ్ట్ అప్పర్ కట్స్‌తో పాటు రెగ్యులర్ పంచ్‌లతో హడలెత్తించాడు.