అమ్మలో ఆప్యాయతని చూశాం. సోదరిలో అనురాగబంధాన్ని చూశాం. భార్యలో బాధ్యతను చూశాం. బిడ్డలో మమకారాన్ని చవిచూశాం. ఏ రకంగా చూసినా... వారిలో కనిపించేది మాధుర్యమే. అంతులేని ప్రేమాభిమానాలే. నాణేనికి ఇ వైపులా ఆత్మీయతే కనబడుతుంది. వారు సుకుమారులు, సున్నిత మనస్కులే కాదు... జయ విజయ అజేయులు కూడా! ఇక్కడ నాణేనికి ఇరువైపులా చూస్తే సరిపోదు... కనిపించని నాలుగో సింహాన్ని చూడాలి... చూస్తున్నాం కూడా... బరిలో గెలిచేందుకు పోరాడుతున్నారు... పతకం తేచ్చేందుకు శ్రమిస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. బ్యాట్ పట్టినా... పరుగు పెట్టినా... పంచ్ విసిరినా... గన్‌తో గురి చూసినా...పట్టుతో ప్రత్యర్థుల భరతం పట్టినా... ఎవరైతే నాకేంటి అంటున్నారు.ఎందాకైనా పయనిస్తామంటున్నారు... ఎవరు... ఎవరు... అంటే ఇంకా తెలియదా! అయితే తెలుసుకోండి...!
ఒక్క పట్టుతో...
‘ఫోగాట్ సిస్టర్స్’ గీత, బబిత, వినేశ్ విజయాలు ఓవైపు... సాక్షి మలిక్ ‘రియో ఒలింపిక్’ కాంస్య ప్రదర్శన మరోవైపు... అయినా ఒకే ఒక్క విజయంతో వీరితో సమానంగా పేరు సంపాదించింది పంజాబ్ మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్. 28 ఏళ్ల నవజ్యోత్ గతవారం కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 65 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అమృత్‌సర్ సమీపంలోని తరన్ తారన్ పట్టణానికి చెందిన నవజ్యోత్‌కు గత రెండేళ్లు ఏమాత్రం కలిసిరాలేదు. వెన్నునొప్పి కారణంగా ఆమె కొంతకాలం ఆటకు దూరమైంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన ఆమె వచ్చే నెలలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా ఎంపిక కాలేకపోయింది. అయితేనేం తాజా పసిడి ప్రదర్శన నవజ్యోత్‌కు ఒక్కసారిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. గతాన్ని మరచి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది.
పరుగెడితే పతకం...
నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు కామన్వెల్త్ గేమ్స్ గురించి అవగాహన లేదు. తెలిసిందల్లా ఫుట్‌బాల్ మాత్రమే. అయితే ఫుట్‌బాల్‌లో కెరీర్ గొప్పగా ఉండదని పాఠశాల వ్యాయామవిద్యా ఉపాధ్యాయుడు సలహా ఇచ్చారు. వ్యక్తిగత క్రీడాంశం అథ్లెటిక్స్‌లో అడుగు పెట్టాలని సూచించారు. ఆయన సలహా మేరకు అథ్లెటిక్స్‌లో అడుగు పెట్టిన ఆమె రెండేళ్లలో నిలకడగా రాణించి ఇపుడు కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆ అమ్మాయే అస్సాంకు చెందిన 18 ఏళ్ల హిమా దాస్. పాటియాలాలో జరుగుతున్న ఫెడరేషన్ కప్‌లో హిమా దాస్ అందరి అంచనాలను తారుమారు చేసి 400 మీటర్ల ఫైనల్లో 51.97 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణాన్ని సాధించింది. దాంతోపాటు కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని (52 సెకన్లు) అందుకుంది.
యువ సంచలనం..
భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ మినహాయిస్తే మిగతా సమయంలో వారికి అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువే. అయినప్పటికీ మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలాంటి మేటి మహిళా క్రికెటర్ల విజయాలతో అమ్మాయిలు ఈ ఆటవైపు వస్తున్నారు. అందులో తాజా సంచలనం ముంబైకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్. గత ఏడాది నవంబర్‌లో సౌరాష్ట్రతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ (202 పరుగులు) కొట్టి వార్తల్లో నిలిచిన జెమీమా ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌పై 179 పరుగులు సాధించింది. ఈ ప్రదర్శన జెమీమాకు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పాల్గొనే భారత సీనియర్ జట్టులో చోటు దక్కేలా చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌కు జతగా జెమీమా (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలకదశలో రాణించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
‘పంచ్’ పడిందంటే...
మేరీకోమ్ విజయాలతో ఎంతోమంది అమ్మాయిలు మహిళల బాక్సింగ్‌లో అడుగు పెట్టారు. విశ్వవేదికపై తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ కోవలోకే వస్తుంది అంకుశిత బోరో. అస్సాంకు చెందిన 17 ఏళ్ల ఈ గిరిజన అమ్మాయి గతేడాది ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 64 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. క్రీడా నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చిన అంకుశిత భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొని అందులో ప్రవేశం పొందింది. సహజ నైపుణ్యానికి తోడు కోచ్‌ల మార్గదర్శనంలో ఆమె ముందుకు దూసుకెళ్లింది. అహ్మెట్ కామెట్ (టర్కీ) టోర్నీ, బాల్కన్ టోర్నీ (బల్గేరియా) అంతర్జాతీయ టోర్నీల్లో రజతాలు నెగ్గిన అంకుశిత ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది.
నయా చరిత్ర...
పురుషుల షూటింగ్‌తో పోలిస్తే మహిళల షూటింగ్‌లో భారత్‌కు గొప్ప రికార్డు లేదు. కానీ ఏడాదిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జూనియర్ స్థాయిలో పతకాల పంట పండించిన హరియాణా షూటర్ మను భాకర్, బెంగాలీ అమ్మాయి మెహులీ ఘోష్ సీనియర్ స్థాయిలో అందరికీ ఆశ్చర్యం కలిగే ప్రదర్శన చేశారు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో 16 ఏళ్ల మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత్ తరఫున స్వర్ణాలు నెగ్గిన పిన్న వయస్కురాలిగా కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు 17 ఏళ్ల మెహులీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లో, మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్యాలు గెలిచింది. రెండేళ్ల క్రితమే షూటింగ్‌లో అడుగు పెట్టిన మను అంతకుముందు మార్షల్ ఆర్ట్స్, స్కేటింగ్, క్రికెట్, బాక్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించింది. బాక్సింగ్‌లో కంటికి గాయం కావడంతో ఆమె తల్లి సలహాతో షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన మను పతకాల పంట పండిస్తూ భారత మహిళల షూటింగ్‌కు భరోసా కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment